సుంకం రద్దుతో వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం
బలమైన రైతాంగ ఉద్యమాలే సాగుకు రక్ష
ఎస్‌కేఎం సదస్సులో నేతలు పోతినేని, పద్మ, బాగం, కెచ్చల
ఖమ్మం బైపాస్ రోడ్డులో రైతుల ప్రదర్శన
నవతెలంగాణ – ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
పత్తి రైతునే కాదు దేశ ఆర్థిక సార్వభౌమాధి కారాన్ని సైతం మోడీ ప్రభుత్వం దెబ్బతీస్తోందని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్ అన్నారు. కార్పొరేట్లకు వ్యవసాయాన్ని అప్పజెప్పే పరిస్థితులను బీజేపీ ప్రభుత్వం కల్పిస్తోందని విమర్శించారు. సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఖమ్మంలోని రామనర్సయ్య విజ్ఞాన కేంద్రంలో బుధవారం రాష్ట్ర రైతు సదస్సు జరిగింది. వివిధ సంఘాల రాష్ట్ర నేతలు పోతినేని సుదర్శన్, బాగం హేమంతరావు, పశ్య పద్మ, కెచ్చల రంగయ్య హాజరై మాట్లాడారు. ”యూరియా సరఫరా పెంచాలి.. వర్షాలకు దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం ఇవ్వాలి.. పత్తి దిగుమతి సుంకం 11శాతం కొనసాగించాలి.. పత్తికి క్వింటాకు మద్దతు ధర రూ.10,075 చొప్పున చెల్లించాలి.. మార్క్‌ఫెడ్ ద్వారా పెసలు కొనుగోలు చేయాలి” అనే డిమాండ్లతో ఈ సదస్సు జరిగింది. ఈ సందర్భంగా పోతినేని సుదర్శన్ మాట్లాడుతూ.. ఏటేటా యూరియా సబ్సిడీలో ప్రభుత్వం కోత విధిస్తోందన్నారు. ఈ ఏడాది రూ.55 వేల కోట్లు యూరియా సబ్సిడీలో కోత విధించినట్టు చెప్పారు. రూ.26 లక్షల కోట్ల రుణాలు కార్పొరేట్లకు మోడీ ప్రభుత్వం మాఫీ చేసిందని, దేశంలోని 60 లక్షల మంది రైతులకు రూ.15 లక్షల కోట్ల రుణమాఫీ చేయటానికి మాత్రం కేంద్రానికి మనసు అంగీకరించడం లేదన్నారు. కేవలం ఏడాదికి రూ.6000 పెట్టుబడుల నిమిత్తం ఇస్తే సరిపోతుందా? అని ప్రశ్నించారు.
ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. పత్తిపై 25శాతం సుంకం.. 25శాతం జరిమానా పేరుతో అమెరికా మన దేశంపై ఆంక్షలు పెడుతోందన్నారు. అయినా ట్రంప్‌ను ప్రశ్నించే ధైర్యం మోడీకి లేదని విమర్శించారు. సీసీఐ క్వింటా పత్తి ధర రూ.8,110 నిర్ణయిస్తే.. మార్కెట్లో రూ.6611 చొప్పున కొనుగోలు చేస్తున్నారన్నారు. రైతాంగాన్ని, వ్యవసాయ రంగాన్ని దెబ్బతీసి కార్పొరేట్లకు ఎరవేసే విధంగా మోడీ ప్రభుత్వ విధానాలు ఉన్నాయన్నారు.
దిగుమతి సుంకం కొనసాగించాలి..
వ్యవసాయరంగ ఉత్పత్తులు ముఖ్యంగా పత్తి దిగుమతిపై సుంకాన్ని రద్దు చేయడంతో దేశ వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతోందని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బాగం హేమంతరావు, పశ్య పద్మ, అఖిల భారత రైతు కూలీ సంఘం కేంద్రం కన్వీనర్ కెచ్చల రంగయ్య అన్నారు. దేశ వ్యాప్తంగా పత్తి ధరలు క్షీణించి సాగుపై రైతులు వెనక్కి తగ్గేలా ఉందన్నారు. పెట్టుబడి ఆధారంగా పత్తి క్వింటాకు రూ.10,076 ప్రకటించాలని ఆందోళనలు చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. భారతదేశ వ్యాప్తంగా గణనీయంగా పత్తి సాగు చేస్తున్నారని, తెలంగాణలోనే సుమారు 50 లక్షల ఎకరాల్లో సాగు చేస్తున్నారని తెలిపారు. బలమైన రైతాంగ ఉద్యమాలు నిర్మించి, ఆందోళనలు చేపడితేనే వ్యవసాయ రంగాన్ని రక్షించుకోగలమన్నారు. ఈ సదస్సుకు రైతు సంఘాల నేతలు -దొండపాటి రమేష్, మాదినేని రమేష్, మలీదు నాగేశ్వరరావు, బజ్జూరి వెంకట్రామిరెడ్డి అధ్యక్షవర్గంగా వ్యవహరించారు. సదస్సులో ఏఐకేఎంఎస్ రాష్ట్ర గౌరవాధ్యక్షులు వి.కోటేశ్వరరావు, రైతు సంఘాల ప్రతినిధులు కొండపర్తి గోవిందరావు, బొంతు రాంబాబు, కోల్లేటి నాగేశ్వరరావు, వై.ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. సదస్సుకు ముందు ఖమ్మం బైపాస్ రోడ్డులో తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులు భారీ ప్రదర్శన నిర్వహించారు.