రక్షణశాఖమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు సీఎం రేవంత్ రెడ్డి వినతి
చిట్యాల ఐలమ్మకు నివాళ్లు
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు రక్షణ శాఖ భూములు బదలాయించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. బుధవారం నాడిక్కడ రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. మూసీ, ఈసా నదుల సంగమ స్థలిలో గాంధీ సరోవర్ ప్రాజెక్టు చేపట్టనున్నట్టు వివరించారు. ఈ రెండు నదుల సంగమ స్థలిలో గాంధీసర్కిల్ ఆఫ్ యూనిటీ నిర్మాణం చేపడతామని, ఇందుకు అక్కడ ఉన్న 98.20 ఎకరాల రక్షణ శాఖ భూములు రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించాలని కోరారు. జాతీయ సమైక్యత, గాంధేయ విలువలకు సంకేతంగా గాంధీ సరోవర్ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టనున్నట్టు తెలిపారు. గాంధీ సరోవర్ ప్రాజెక్టులో గాంధీ సిద్ధాంతాలను ప్రచారం చేసే నాలెడ్జ్ హబ్, ధ్యాన గ్రామం, చేనేత ప్రచార కేంద్రం, ప్రజా వినోద స్థలాలు, ల్యాండ్ స్కేప్, ఘాట్లు, శాంతి విగ్రహం మ్యూజియం నిర్మిస్తామని వివరించారు. సమావేశం లో ఎంపీలు పోరిక బలరాం నాయక్, కడియం కావ్య, చామల కిరణ్‌కుమార్ రెడ్డి, మూసీ రివర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ ఇ.వి.నరసింహారెడ్డి, కేంద్ర ప్రాజెక్టులు, పథకాల సమన్వయకర్త గౌరవ్ ఉప్పల్ పాల్గొన్నారు.
అణచివేతపై ధిక్కార పతాక చిట్యాల ఐలమ్మ
అణచివేత.. దమనకాండపై పోరాడిన ధిక్కార పతాక చిట్యాల ఐలమ్మ అని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి కొనియాడారు. తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు ఐలమ్మ వర్థంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి సీఎం రేవంత్ రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. తెలంగాణ గడ్డపై దొరల అహంకారానికి, నిరంకుశత్వానికి వ్యతిరేకంగా 80ఏండ్ల క్రితమే జంగ్ సైరన్ ఊదిన యోధురాలు ఐలమ్మ అని అన్నారు. సమ్మక్క.. సారక్క…చిట్యాల ఐలమ్మల స్ఫూర్తితోనే తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించామని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు పోరిక బలరాం నాయక్, చామల కిరణ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ నేత రోహిన్ రెడ్డి పాల్గొన్నారు.