Thursday, September 11, 2025
E-PAPER
spot_img
Homeరాష్ట్రీయంజాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ ఏర్పాటు

జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ ఏర్పాటు

- Advertisement -

చైర్మెన్‌గా సీఎస్‌ నియామకం
సభ్యులుగా 11 శాఖల ఉన్నతాధికారులు
శాశ్వత సభ్యులుగా 9 ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు
ప్రభుత్వ ఉత్తర్వులు జారీ

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత రాష్ట్రంలో తొలిసారిగా ఉద్యోగ సంఘాల సివిల్‌ సర్వీసెస్‌ జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) కె రామకృష్ణారావు బుధవారం (జీవో నెంబర్‌ 185) ఉత్తర్వులు విడుదల చేశారు. ఈ కౌన్సిల్‌లో 25 మందికి తగ్గకుండా 30 మందికి ఎక్కువ కాకుండా సభ్యులుంటారని తెలిపారు. ఇందులో సగం మంది అధికారులు, మిగిలిన సగం మంది సర్వీస్‌ అసోసియేషన్లు (ఉద్యోగ సంఘాల) నుంచి ఉంటారని వివరించారు. సీఎస్‌ సీఎస్‌ లేదా ముఖ్య కార్యదర్శి లేదా ప్రధాన కార్యదర్శి, లేదా కార్యదర్శి హోదాకు తక్కువ కాని ఉన్నతాధికారి ఈ కౌన్సిల్‌కు చైర్మెన్‌గా వ్యవహరిస్తారని తెలిపారు. ఆయనతోపాటు ప్రభుత్వం నుంచి సీసీఎల్‌ఏ, ఆర్థిక. పురపాలక, సాధారణ పరిపాలన, విద్య, పంచాయతీరాజ్‌, షెడ్యూల్డ్‌ కులాల అభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు లేదా ముఖ్య కార్యదర్శులు లేదా కార్యదర్శులతోపాటు న్యాయశాఖ కార్యదర్శి, పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌/సంచాలకులు, ఇంటర్‌ విద్యాశాఖ కమిషనర్‌/సంచాలకులు సభ్యులుగా ఉంటారని పేర్కొన్నారు. జీఏడీ అదనపు/జాయింట్‌/డిప్యూటీ కార్యదర్శులు సభ్యులుగా ఉండటంతో పాటు కౌన్సిల్‌ కార్యదర్శిగా వ్యవహరిస్తారని వివరించారు. జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌లో శాశ్వత సభ్యులుగా తొమ్మిది ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలకు అవకాశం కల్పించామని తెలిపారు. అందులో టీఎన్జీవోస్‌ కేంద్రసంఘం, తెలంగాణ గెజిటెడ్‌ అధికారులు (టీజీవో) కేంద్రసంఘం, డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ తెలంగాణ సచివాలయ సంఘం (టీజీఎస్‌ఏ), ప్రొగ్రెసివ్‌ రికగ్నైజ్డ్‌ టీచర్స్‌ యూనియన్‌ (పీఆర్టీయూటీఎస్‌), స్టేట్‌ టీచర్స్‌ యూనియన్‌ (ఎస్టీయూటీఎస్‌), తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్‌ సర్వీస్‌ అసోసియేషన్‌ (ట్రెసా), తెలంగాణ క్లాస్‌-4 ఎంప్లాయీస్‌ కేంద్ర సంఘం, తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌ (టీఎస్‌యూటీఎఫ్‌), తెలంగాణ రాష్ట్ర టీచర్స్‌ ఫెడరేషన్‌ (టీఆర్టీఎఫ్‌)ల ప్రతినిధులు శాశ్వత సభ్యులుగా ఉంటారని తెలిపారు.

రొటేషన్‌ పద్ధతిలో ఆరు సంఘాలకు అవకాశం
రొటేషన్‌ పద్ధతిలో ఆరు ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలకు జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌లో అవకాశం కల్పించామని సీఎస్‌ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. తెలంగాణ సచివాలయ అధికారుల సంఘం (టీజీఎస్‌ఓఏ), డిప్యూటీ కలెక్టర్ల సంఘం, తెలంగాణ తహశీల్దార్ల సంఘం (టీజీటీఏ), తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్‌), స్కూల్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ (ఎస్టీఎఫ్‌), గవర్నమెంట్‌ జూనియర్‌ లెక్చరర్ల సంఘం (జీజేఎల్‌ఏ)ల నుంచి ప్రతినిధులు సభ్యులుగా ఉంటారని తెలిపారు. జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ సభ్యుల పదవీ కాలం ఏడాదిపాటు ఉంటుందని స్పష్టం చేశారు.

నాలుగు నెలలకోసారి సమావేశం
జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ సమావేశం నాలుగు నెలలకోసారి సమావేశం నిర్వహిస్తామని సీఎస్‌ తెలిపారు. సమావేశానికి సీఎస్‌ అందుబాటులో లేకుంటే సీనియర్‌ అధికారి అధ్యక్షత వహిస్తారని పేర్కొన్నారు. ముగ్గురు అధికారులు, శాశ్వత సభ్యత్వం ఉన్న సంఘాల నుంచి ఇద్దరు, రొటేషన్‌ పద్ధతిలో ఉన్న సంఘాల నుంచి ఒక్కరు హాజరైతే కోరం ఉన్నట్టేనని తెలిపారు.14 రోజుల ముందు ఎజెండాను ఖరారు చేస్తామని పేర్కొన్నారు. ప్రభుత్వం ఉద్యోగుల మధ్యం సంబంధాలను మెరుగుపర్చడం, ప్రజలకు మెరుగైన సేవలను అందించడం, ఉద్యోగుల సంక్షేమం, వారి సమస్యలను పరిష్కరించడమే జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ లక్ష్యమని స్పష్టం చేశారు.

ప్రభుత్వానికి ఉద్యోగ జేఏసీ కృతజ్ఞతలు
రాష్ట్రంలోని ఉద్యోగ సంఘాలకు గుర్తింపునిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి ఉద్యోగ జేఏసీ చైర్మెన్‌ మారం జగదీశ్వర్‌, సెక్రెటరీ జనరల్‌ ఏలూరి శ్రీనివాసరావు కృతజ్ఞతలు తెలిపారు. ఉమ్మడి ఏపీలో ప్రభుత్వాలతో దశాబ్ధాలుగా గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాలకు 2014లో కేసీఆర్‌ ప్రభుత్వం దుర్మార్గంగా గుర్తింపును రద్దు చేసిందని విమర్శించారు. ప్రజాప్రభుత్వం వచ్చాక తిరిగి ఉద్యోగ సంఘాలకు గుర్తింపునిచ్చిందని తెలిపారు. ఈ ఉత్తర్వులు జారీ చేసినందుకు సీఎం రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులకు, సీఎస్‌, ఇతర అధికారులకు ధన్యవాదాలు ప్రకటించారు.

టీఎస్‌యూటీఎఫ్‌ హర్షం
రాష్ట్రంలో 12 ఏండ్ల తర్వాత ఉద్యోగ సంఘాల సివిల్‌ సర్వీసెస్‌ జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ ఏర్పాటు చేయడం పట్ల టీఎస్‌యూటీఎఫ్‌ హర్షం ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వానికి టీఎస్‌యూటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు చావ రవి, ప్రధాన కార్యదర్శి ఎ వెంకట్‌ కృతజ్ఞతలు తెలిపారు. ఉద్యోగుల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి చర్చించడానికి అధికారికంగా వేదిక లభించిందని పేర్కొన్నారు. క్రమం తప్పకుండా జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ సమావేశాలను నిర్వహించాలనీ, ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కారానికి సీఎస్‌ చొరవ తీసుకోవాలని సూచించారు. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ను తిరిగి ఏర్పాటు చేయడం పట్ల టీఆర్టీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు కటకం రమేష్‌, ప్రధాన కార్యదర్శి మారెడ్డి అంజిరెడ్డి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad