నవతెలంగాణ-హైదరాబాద్ : నేపాల్‌లో చేపట్టిన జెన్ జీ తిరుగుబాటు తీవ్ర హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. ఈ ఆందోళనల నేపథ్యంలో ప్రధాని ఓలీ రాజీనామా చేయగా ప్రస్తుతం శాంతి భద్రతలను సైన్యం చేపడుతోంది. ఈ క్రమంలోనే ప్రభుత్వ వ్యతిరేక నిరసనల సమయంలో దేశవ్యాప్తంగా వివిధ జైళ్ల నుంచి 7,000 మందికి పైగా ఖైదీలు తప్పించుకున్నారని మీడియా నివేదికలు తెలిపాయి. నిరసనలను ఆసరాగా చేసుకున్న ఖైదీలు జైళ్ల నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించారని, ఫలితంగా అనేక జైళ్లలో ఘర్షణలు చెలరేగాయని పేర్కొన్నాయి. పశ్చిమ నేపాల్‌లోని ఒక జైలులో భద్రతా సిబ్బందితో జరిగిన ఘర్షణలో ఐదుగురు బాల ఖైదీలు మరణించినట్టు వెల్లడించాయి. ఖైదీలు భద్రతా సిబ్బంది ఆయుధాలను స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించినప్పుడు జరిగిన పోలీసులు కాల్పుల్లో వీరు ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తోంది. అలాగే ఈ ఘటన సమయంలో జైలు నుండి 585 మంది ఖైదీలలో 149 మంది, జువైనల్ హోమ్ నుండి 176 మంది ఖైదీల్లో 76 మంది తప్పించుకున్నారని అధికారులు తెలిపారు.
దక్షిణ నేపాల్‌లోని బాగ్మతి ప్రావిన్స్‌లోని సింధులిగాధిలోని జిల్లా జైలు నుంచి 43 మంది మహిళలు సహా మొత్తం 471 మంది ఖైదీలు తప్పించుకున్నారని ఓ నివేదిక తెలిపింది. దీనిని జైలు ఉన్నతాధికారులు సైతం ధ్రువీకరించారు. ఖైదీలు భద్రతా సిబ్బందిని బెదిరించి బయటకు వెళ్లారని, వివిధ నేరాలకు శిక్ష అనుభవిస్తున్న దోషులు ఇప్పుడు స్వేచ్ఛగా ఉండటంతో ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నట్టు తెలుస్తోంది. అలాగే తాము జైలుకు వెళ్లేందుకు కారణమైన వారిపై కూడా బాధితులు ప్రతీకార చర్యల తీసుకునే ప్రమాదం ఉండటంతో అనేక మంది భయపడి తమ ఇళ్లను వదిలి పారిపోయినట్టు సమాచారం.