నవతెలంగాణ-హైదరాబాద్: సోషల్ మీడియాను నిషేధిస్తూ నేపాల్ పార్లమెంట్ తీసుకున్న నిర్ణయాన్ని జనరేషన్ జెడ్ తీవ్రంగా వ్యతిరేకించిన విషయం తెలిసిందే. ఈక్రమంలో రెండు రోజుల పాటు జరిగిన నిరసన ప్రదర్శనలు ఆ దేశాన్ని అల్లకల్లోలం చేశాయి. ఆ దేశ ప్రధాని ఓలి శర్మతో పాటు ఇతర మంత్రులు రాజీనామా చేశారు. ఆ తర్వాత అధికార పగ్గాలు ఆర్మీ చేతులోకి వెళ్లిపోయాయి. శాంతిభద్రతలను అదుపులోకి తేవడానికి ఆ దేశ ఆర్మీ అన్ని ప్రాంతాల్లో మోహరించింది. ఎక్కడికక్కడ కర్ఫ్యూ విధించి నిరసన కాండను అడ్డుకుంది. ఈ ఉద్రిక్తతల పరిస్థితుల్లో భారత్ అలర్ట్ అయింది. నేపాల్‌తో సరిహద్దు పంచుకుంటున్న రాష్ట్రాల్లో హై అలర్ట్ ప్రకటించి నేపాల్-ఇండియాన్ సరిహద్దు వెంబడి గస్తీ పెంచిన విషయం తెలిసిందే. ఈక్రమంలో ఆ దేశంతో ఎలాంటి రాకపోకలకు అనుమతి నిషేధించారు. అంతేకాకుండా ఎగుమతులు, దిగమతులపై తాత్కాలిక నిషేధ0 కూడా విధించి ఎలాంటి వాహనాలను ఇరుదేశాలకు అనుమతించడంలేదు.
తాజాగా నేపాల్‌తో సరిహద్దు పంచుకుంటున్న పశ్చిమ బెంగాల్ డార్జీలింగ్ జిల్లాకు చెందిన పనిషకి అనే ప్రాంతంలో సరుకులతో కూడిన లారీలు బారులు తీరాయి. కిలో మీటర్ల మేర వాహనాలు వివిధ సరుకులతో రోడ్లలపై నిలిచిపోయాయి. దీంతో తమ లారీల్లో తెచ్చిన నిత్యావసర సరుకులు పాడైపోతున్నాయని, తమకు భారీ మొత్తంలో నష్టం వాటిల్లుతుందని వ్యాపారులు వాపోతున్నారు.
ఇరుదేశాల అనుమతులతో రాకపోకలకు అనుమతిస్తామని కస్టమ్స్ అధికారులు స్పష్టం చేస్తున్నారు. సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు తాము ఏమి చేయలేమని చెప్తుతున్నారు.