– పుష్ప రాజ్ తరహాలో మాఫియ
– ప్రభుత్వ ఆదాయానికి గండి
– అధికారులకు షరా మాములేనా…?
నవతెలంగాణ, కాటారం
కాటారం మండలం లోని విలాసాగర్ మానేరు నుంచి పట్టపగలే యదేచ్చగా ఇసుకను తోడేస్తున్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పేరిట ట్రాక్టర్ల ద్వారా ఇసుకను అక్రమంగా కాటారం, రుద్రారం మీదుగా జిల్లా కేంద్రం అయిన భుపాలపల్లి, వరంగల్ కు తరలి ఇస్తున్నారు. ఇందిరమ్మ ఇళ్ల పేరిట ఇసుక వ్యాపారం ఫుల్ గా సాగుతోంది. మానేరు నుండి ఇసుకను ఇష్టారీతిన తోడేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. అనుమతులు లేకున్నప్పటికీ మానేరు నుండి కాటారం మీదుగా జిల్లా కేంద్రానికి ట్రాక్టర్ల ద్వారా పట్ట పగలే ఇసుకను తరలిస్తున్నారు.
అధికారుల నిఘా కరువు
మానేరు నుండి కాటారం, రుద్రారం మీదుగా జిల్లా కేంద్రానికి పట్టపగలే ట్రాక్టర్ల ద్వారా ఇసుకను తరలిస్తున్నప్పటికీ రెవెన్యూ, మైనింగ్, పోలీస్ అధికారులు చూసి చూడనట్టు వ్యవహరించడంపై అధికారుల నిఘా కరువైందని, అక్రమార్కులకు అధికారుల అండదండలు పుష్కలంగా ఉన్నాయని అడ్డుకట్ట వేయాల్సిన అధికారులే అక్రమలను ప్రోత్సహిస్తున్నారని మండలంలో జోరుగా చర్చ సాగుతోంది.
నామమాత్రంగా దాడులు
అక్రమ ఇసుక రవాణాకు సంబంధించి ప్రజల్లో అనుమానం రాకుండా ఉండేందుకు అధికారులు నామమాత్రంగా అడపాదడపా దాడులు చేసి ఒకటి రెండు వాహనాలను సీజ్ చేసి చేతులు దులుపుకుంటున్నారు.నిత్యం పదుల సంఖ్యలో పట్టపగలే ట్రాక్టర్ల ద్వారా అక్రమ ఇసుక రవాణా జరుగుతున్నప్పటికీ అధికారుల నిర్లక్ష్యం వల్ల అక్రమ ఇసుక రవాణా అడ్డుకట్ట పడడం లేదు.
అక్రమ ఇసుక రవాణాకు అడ్డుకట్ట పడేనా…?
రెవెన్యూ,మైనింగ్, పోలీస్ ఇన్ని శాఖల అధికారులు జిల్లాలో ఉన్నప్పటికీ అక్రమ ఇసుక రవాణా ఎందుకు అరికట్టలేకపోతున్నారని ప్రజల్లో సందేహాలు కలుగుతున్నాయి. సంబంధిత శాఖ అధికారులు పట్టించుకోకపోవడం వల్లే ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడుతుందని, దళారులు జేబులు నింపుకుంటున్నారని ప్రజలు వాపోతున్నారు. అక్రమ ఇసుక రవాణాకు అడ్డుకట్ట వేసే నాధుడే కరువయ్యాడని అంటున్నారు.
ప్రభుత్వ ఆదాయానికి గండి
ప్రకృతి సహజ సంపద అయినటువంటి ఇసుకను ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనుల కోసం లబ్ధిదారులకు ఉచిత ఇసుక పాలసీని తీసుకొచ్చిన విషయం విధితమే. కానీ ఇదే అదునుగా భావించిన కొంతమంది దళారులు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పేరుతో ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్నారు. విలాసాగర్ మానేరు నుండి పట్టపగలే ఇసుకను తరలిస్తున్నారు. వర్షాకాలం వాగులు వంకలు నీటితో నిండి ఇసుక కొరత ఏర్పడడంతో మార్కెట్ లో ఇసుకకు భారీగా డిమాండ్ పెరిగింది.
ఇదే అదునుగా భావించిన దళారులు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పనుల మాటున విలాసాగర్ మానేరు నుండి కాటారం మీదుగా జిల్లా కేంద్రానికి తరలించి అధిక రేట్లకు విక్రయిస్తున్నారు.ఒక ట్రాక్టర్ ఇసుకను నాలుగు నుండి ఐదువేలకు విక్రయిస్తు, జేబులు నింపుకుంటున్నారు. సహజ సంపద దళారుల పాలు అవుతుంటే ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడుతుంది. ఇంత జరుగుతున్న అధికారులు అక్రమ ఇసుక రవాణాను అరికట్ట లేకపోవడం పై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.