నెతన్యాహును దోషిగా నిలబెట్టాలని పిలుపు
ఈ దాడులు శాంతి యత్నాలకు విఘాతమేనన్న హమాస్
గాజా, దోహా : ఖతార్ రాజధాని దోహాపై ఇజ్రాయిల్ దాడులతో విరుచకుపడిన నేపథ్యంలో ఖతార్‌కు మద్దతుగా ప్రాంతీయ మిత్రపక్షాలన్నీ ఏకమవుతున్నాయి. దోహా దాడుల్లో మరణించిన ఆరుగురికి జరిగిన అంత్యక్రియలకు ఖతార్ అమీర్ హాజరయ్యారు. ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదానికి పాల్పడినందుకు శిక్ష పడేలా ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహను న్యాయస్థానం ముందు నిలబెట్టాలని ఖతార్ ప్రధాని పిలుపిచ్చారు. మరోవైపు గాజాను ఇజ్రాయిల్ బలగాలు దాడులతో హోరెత్తిస్తున్నాయి. గురువారం నాటి దాడుల్లో 32మంది మరణించారు. వీరిలో ఆహారం కోసం వెళ్ళి మృతి చెందినవారు పదిమంది వున్నారు. ఇప్పటికే గాజా దక్షిణ ప్రాంతం కిక్కిరిసిపోయి వుండగా, 10 లక్షలమందికి పైగా ప్రజలు గాజా నగరాన్ని వదిలి వెళ్ళాలంటూ ఇజ్రాయిల్ బలవంతంగా వారిని వెళ్లగొట్టే ఆదేశాలు జారీ చేయడంపై మానవ హక్కుల సంఘాలు, మానవతా సాయమందించే సంస్థలు ఆందోళన వ్యక్తం చేశాయి.
శాంతి యత్నాలకు దెబ్బే !
దోహాపై దాడులను శాంతి యత్నాలకు విఘాతంగా హమాస్ అభివర్ణించింది. ఈ మేరకు హమాస్ ప్రతినిధి ఫవ్జి బర్హూమ్ టీవీలో ఒక ప్రకటన చేశారు. దోహాలో చర్చలు జరుపుతున్న హమాస్ ప్రతినిధి బృందాన్ని మట్టుబెట్టాలని ప్రయత్నించడం, పైగా విదేశాల్లోని హమాస్ నాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకుంటామంటూ బెదిరించారంటే 23మాసాలుగా యుద్ధం కొనసాగించినా ఇంకా వారనుకున్నది చేయడంలో ఇజ్రాయిల్ విఫలమైందని అర్ధమవుతోందని అన్నారు. కాల్పుల విరమణ ప్రతిపాదన గురించి చర్చిస్తుంటే హత్యాయత్నం చేశారని బర్హూమ్ విమర్శించారు. మొత్తంగా చర్చల ప్రక్రియపై ఇలా దాడి జరపడం నేరమని విమర్శించారు. ఖతార్ సార్వభౌమాధికారంపై, వారి భద్రతపై దాడి చేయడం కాదని, మొత్తంగా అరబ్ దేశాలు, ఇస్లామిక్ దేశాలపై బహిరంగ యుద్ధాన్ని ప్రకటించడమని వ్యాఖ్యానించారు. ఇజ్రాయిల్ చర్యలు ప్రాంతీయ, అంతర్జాతీయ భద్రతకు ముప్పుగా మారాయని ఆయన హెచ్చరించారు. ఈ నేరాలన్నింటికీ ఇజ్రాయిల్‌ను జవాబుదారీ చేయాలని ఆయన ప్రపంచ నేతలను కోరారు.