నవతెలంగాణ – జుక్కల్
కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలోని దోస్పల్లి శ్రీ జగద్గురు నరేంద్ర మహారాజ్ స్వామి వారి పీఠం నందు భక్తులతో శనివారం కిటకిటలాడింది. ఈ సందర్భంగా జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే జగద్గురు శ్రీ నరేంద్ర మహారాజ్ జీ స్వామి ఆశీస్సులను పొందారు. తెలంగాణ దక్షిణపీఠాధిపతి జగద్గురు శ్రీ నరేంద్ర మహారాజ్ స్వామి వారి ఆశీస్సుల కోసం ఆ గ్రామం భక్తుల ఎగబడ్డారు. వేలాదిమంది భక్తులు తరలివచ్చి, భక్తినినాదాలతో ఆకాశం మార్మోగగా, దోస్పల్లి చరిత్రలో ఒక కొత్త ఆధ్యాత్మిక అధ్యాయం రాసుకుపోయింది. ఈ మహోత్సవంలో జుక్కల్ మాజీ ఎమ్మెల్యే శ్రీ హన్మంత్ షిండే పాల్గొని, వినమ్రతతో స్వామి వారిని దర్శించుకుని పాదప్రణామం చేశారు. అనంతరం స్వామి నరేంద్ర మహారాజ్ జీ స్వామి వారు ఆయనను ఆశీర్వదించి, “ప్రజాసేవ ధర్మసేవ” అని ఉద్బోధించారు. ప్రజల కోసం మరింత శక్తి, ఆధ్యాత్మిక బలం తో సేవ చేయాలని, సమాజానికి ఆదర్శంగా నిలవాలని ఆశీస్సులు ప్రసాదించారు. ధర్మం, భక్తి, నిజాయితీ, సేవ – ఇవే సమాజానికి పునాది అని సద్బోధనలు అందించారు.
స్వామి వారి సత్సంగాన్ని వినేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు, ఆధ్యాత్మిక ప్రేమికులు, స్థానికులు తరలి వచ్చారు. క్రమపద్ధతిలో కూర్చొని సద్గురువచనాలను శ్రద్ధగా ఆలకించారు. ఆ వాతావరణం భక్తి పరవశంతో నిండిపోయింది. “జై గురుదేవ్”, “జై నరేంద్ర మహారాజ్ జీ స్వామి” నినాదాలతో దోస్పల్లి గ్రామం ఆధ్యాత్మిక క్షేత్రంగా మారింది. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే శ్రీ హన్మంత్ షిండే మాట్లాడుతూ ..“జగద్గురు స్వామి వారి ఆశీస్సులు పొందడం నా జీవితంలో ఒక మహాభాగ్యం. ఈ దివ్యసాన్నిధ్యం నాకు కొత్త ఉత్సాహం, ప్రజాసేవలో కొత్త శక్తి నింపింది. నా జుక్కల్ నియోజకవర్గ ప్రజలు ఎల్లప్పుడూ సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో, పాడిపంటలతో ఆనందంగా జీవించాలని మనసారా కోరుకుంటున్నాను” అని మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే అన్నారు.