వెంకటాపురం అనే గ్రామంలో రాజు, సోము, రంగ అనే ముగ్గురు స్నేహితులు వుండేవారు. ఎక్కడికి వెళ్ళినా ముగ్గురు కలిసే వెళ్ళేవారు. రాజు వ్యాపారం చేసేవాడు బాగా సంపాదించాడు. సోము వ్యవసాయం చేస్తాడు. రంగ మాత్రం కూలి పనికి వెళుతుంటాడు. ముగ్గురు కలిసి ఎక్కడికి వెళ్ళినా ఖర్చు మొత్తం రాజు భరించుకునేవాడు. అప్పుడప్పుడు సోము కాస్తలో కాస్త ఖర్చు చేసేవాడు. కూలి చేసుకుంటూ జీవనం గడుపుకుంటున్న రంగ.. కేవలం వారి జతలో వెళ్లి వచ్చేవాడు.
”రేరు రంగ! ఇదేం బాగోలేదురా మేము ఎన్నిసార్లు ఖర్చు చేసాం నువ్వు ఒక్కసారైనా పది రుపాయలు ఖర్చు చేసావా? పెట్టింది తింటూ వుండడం పద్ధతి కాదురా” అంటూ మొహం పైనే అనేసాడు రాము.
”పోనీ వదిలేరు రా.. పాపం కూలి చేసుకుంటూ బ్రతుకుతున్నాడు” అన్నాడు సోము. రాము అనిన మాట రంగ మనసులో నాటుకుపోయింది.
”తినేవాళ్ళు తెలివిగా తింటున్నారు. తెలివిగా ఖర్చు పెట్టిస్తున్నారు, అంతా నా కోసమే పెడుతున్నట్టు మాట్లాడుతున్నారు” అని బాధ పడ్డాడు రంగ
వారి వెంట విందు వినోదాలకు వెళ్ళడం మానేసాడు రంగ. కొన్నాళ్ళు గడిచిపోయిన పిమ్మట వాళ్ళు విచ్చలవిడిగా తిరుగుతూ జల్సాలకు వెళుతున్నారని తెలిసింది. ఐనా కూడా పట్టించుకోవడం మానేసాడు రంగ.
”ఎందుకురా స్నేహితుల్ని దూరం చేసుకున్నావ్” అని అడిగారు కొందరు.
”తిని తాగి సంతోషంగా వున్నంత మాత్రాన స్నేహం అనిపించుకోదు. దాని విలువ తెలియని వాళ్ళు తిని తాగడమే స్నేహం అనుకుంటారు. అది నాకు నచ్చదు” అంటూ సమాధానం చెప్పేవాడు రంగ.
కొన్నాళ్ళు గడిచిపోయింది.. రాజు వ్యాపారంలో తీవ్ర నష్టం వచ్చి దివాలా తీసాడని తెలిసింది. పూటకు గడవడం కూడా కష్టంగా వుందని ఎవరో చెబితే విన్నాడు రంగ. పైగా ఆరోగ్యం కూడా క్షీణించి మంచాన పడ్డాడని తెలిసినాక రంగ చాలా బాధ పడ్డాడు.
”ఈమధ్య స్నేహితులు ఎక్కువైపోయారంట. ఉన్న డబ్బంతా విందులకు వినోదాలకు ఖర్చు పెట్టేసి దివాలా తీసాడు. బాగా ఖర్చు పెట్టించిన స్నేహితులు ముఖం చాటేసారు. ఇప్పుడు రాజు బతుకు కుక్కలు చింపిన విస్తరిలా తయారైంది” అంటూ ఒకతను అంటుండగా రంగ విన్నాడు.
రంగ బయలుదేరి రాజు ఇంటికి వెళ్ళాడు. పక్కనే భార్య ఏడుస్తూ కూర్చుంది. రంగని చూడగానే రాజు కళ్ళల్లో నీళ్ళు పెట్టుకున్నాడు.
”నేను బాగా ఖర్చు చేసినప్పుడు చుట్టూ ఈగలు ముసిరినట్టు స్నేహితులు చేరారు. ఉన్న సంపదనంతా పోగొట్టుకుని మంచాన పడగానే ఒక్కరు కూడా రాలేదు. నువ్వు ఒక్కడివి మాత్రమే వచ్చావ్. స్నేహమంటే ఇదేరా” అంటూ వాపోయాడు రాజు.
”నేను ఖర్చు పెట్టలేదని ఆరోజు నన్ను చులకనగా మాట్లాడావు గుర్తుందా.. అనవసరమైన వాటికి నేను ఖర్చు చేయలేదు కాబట్టే.. ఆ డబ్బు ఇప్పుడు పనికొచ్చింది. జేబు చూసి చేసే స్నేహం చాలా కాలం నిలబడదురా.. స్నేహమంటే నిస్వార్థంగా వుండాలి” అంటూ తెచ్చిన డబ్బు రాజు చేతిలో పెట్టాడు రంగ.
”బాగా చూపించుకో. అవసరమైతే ఇంకా అడుగు ఇస్తాను. ఆరోగ్యం జాగ్రత్త” అన్నాడు రంగ.. పశ్చాత్తాపం చెందుతూ రంగ చేతులు పట్టుకున్నాడు రాజు.
- నరెద్దుల రాజారెడ్డి, 9666016636