ఆది విశాలమైన హాలు. దేశ దేశాల నుండి తెప్పించిన కళాకృతులతో ఆ హాలును ఎంతో అందంగా తీర్చిదిద్దారు. చూడగానే మనస్సుకు ఎంతో అహ్లాదం కలిగించే విధంగా ఆ హాలు ఉన్నది. ఆ హాలు గోడలకు మంచి చిత్ర పటాలు కూడా అలంకరించి ఉన్నాయి! తమాషా ఏమిటంటే ఆ చిత్రపటాలు అన్నీ స్నేహాన్ని ప్రదర్శించేవే! అలాంటి అందమైన హాలులోకి పెద్దాయన హుందాగా, ఎంతో గంభీరంగా ప్రవేశించారు. ఆ హాలు ఇటీవలే నిర్మించారు. ఆ హాలు అంతా పెద్దాయన అభిరుచుల మేరకే రూపొందించబడ్డది. ఆ హాలుకి ‘మిత్ర మందిరం’ అని పేరు పెట్టుకున్నారు. మిత్ర అనే మాట పెద్దాయనకు ఎంతో ఇష్టమైనది. ఆ హాలులోని చిత్రపటాలను ఒక్కొక్కటి పెద్దాయన చూస్తూన్నాడు. ఆయనలో పెల్లుబుకుతున్న స్నేహాభిలాషను వ్యక్తపరిచే చిత్రమేమిటా అని వెదుకుతున్నాడు! స్నేహానికి మారుపేరుగా నిల్చిన కర్ణదుశ్శాసనుల చిత్రపటం ముందుకు వచ్చాడు పెద్దాయన. ఎందుకో ఆ ఫొటో పెద్దాయనకు అంతగా నచ్చలేదు. దుర్యోధనుడు కర్ణుడిని స్నేహితుడిగానే చూశాడు.
కాని కర్ణుడిలో మన ధర్మం కన్నా, ధుర్యోధనుడి పట్ల కృతజ్ఞతగా ఎక్కువగా కనబడింది. మిత్రులంటే ఇద్దరూ ఒకే స్థాయిలో ఉన్నామనే భావన ఉండాలి కదా! పెద్దాయనకు ఇద్దరు మిత్రులు ఉన్నారు. ఒకరు స్వదేశీ మిత్రుడైతే మరొకరు అమెరికా మిత్రుడు, వాళ్లిద్దరు ఆయనకు ప్రాణమిత్రులని చెప్పాలి. కర్ణుడికి దుర్యోధనుడు కేవలం అంగరాజ్యం మాత్రమే ఇచ్చాడు. అప్పట్లోని రాజ్యానికి ఎంతపరిధి ఉండేదో మనకు తెలియనిది కాదు. అంతరాజ్యంలో ఒక సామంత రాజ్యాన్ని దుర్యోధనుడు కర్ణుడికి ఇచ్చాడు. మరి పెద్దాయన ఖండమంత దేశానికి పెద్దదిక్కు. విశాలమైన దేశంలో తన స్వదేశ స్నేహితుడికి ఏం కావాలో మనసెరిగి, నీటినుండి పెట్రోల్ దాకా, మట్టిదిబ్బల నుండి మహాపర్వతాల దాకా బస్టాండ్ల నుండి విమాన, నౌకాశ్రయాల వరకూ అన్ని ధారపోసినా పెద్దాయనలోని మిత్రాగ్ని చల్లారలేదు. అంతటి ఇంకా మిత్ర బంధాన్ని కర్ణ దుర్యోధనుల మిత్రత్వంతో పోల్చగల ఫొటోకాదని పెద్దాయనకు అన్పించటం సహజమే కదా! తర్వాతి ఫొటో వద్దకు వచ్చాడు పెద్దాయన. ఆది రామ, సుగ్రీవుల స్నేహాన్ని చూపే ఫొటో. అది చూడగానే పెద్దాయన పెదాలపై చిన్ననవ్వు వచ్చింది. ఎందుకంటే ఆయనకు తన అమెరికా మిత్రుడు గుర్తొచ్చాడు.
రామ సుగ్రీవు లిద్దరూ వేర్వేరు జాతులకు చెందిన వారు. ఆచ్చంగా కాను, తన అమెరికా మిత్రుడి లాగే, రాముడి బలం చూసుకుని వాలి మీదికి యుద్ధానికి వెళ్లిన సుగ్రీవుడు వాలిపై గెలిచాడు. అలాగే సుగ్రీవుడి బలమైన వానర సైన్యంతో రాముడు రావణుడితో యుద్ధంలో గెలిచాడు. నిజానికి రాముడికి వాలితోగాని, సుగ్రీవుడికి రావణుడితోగాని ఎలాంటి వైరం లేదు. కేవలం తమ, తమ మిత్రుల కోసమే వారి వారి శత్రువులతో రాముడు, సుగ్రీవులు యుద్ధాలు చేశారు. ఈ ఫొటోకు తన అమెరికా మిత్రుడితో తనకున్న స్నేహానికి కొన్ని పోలికలు పెద్దాయనకు కన్పించాయి. తాను అమెరికా మిత్రుడి కోసం ఎవరితోనూ యుద్ధాలు చేయలేదు. కాని అమెరికా మిత్రుడి శత్రువులు అందరిని తన శత్రువులుగానే చూశాడు. అప్పటిదాకా తనకు ఎంతో సహాయపడి, చవకగా సరుకులు అమ్మిన మిత్రుల వద్ద కూడా సరుకులు కొనటం మానేశాడు! తాను మిత్రధర్మం అంత బలంగా పాటించాడు! కాని ఈ మధ్య అమెరికా మిత్రుడికి ఎందుకీ కోపం వచ్చింది! తనతో మాట్లాడం మానివేశాడు! అది గుర్తుకు వచ్చిన పెద్దాయనకు కండ్లలో నీళ్లు తిరిగాయి. కాళ్లు తడబడ్డాయి. గుండె లయ తప్పింది. మనసు మొద్దు బారింది.
అమెరికా మిత్రుడి కోసం తానుచేసిన త్యాగాలు తల్చుకుంటుంటే పెద్దాయన హృదయం బద్దలైంది. అమెరికా మిత్రుడు చెప్పిన సరుకులు అన్నీ కొంటున్నాడు. కాని తన వద్ద తయారైన సరుకులు అమ్మేటపుడు అమెరికా మిత్రుడు తన సరుకుల మీద భారీగా సుంకాలు విధిస్తున్నాడు! ఇదేనా మిత్రధర్మం అని అమెరికా మిత్రుడిని అడగాలని ఎప్పటికపుడు – అనుకుంటూనే ఉన్నాడు! కాని తాను పాటిస్తున్న మిత్రధర్మం అట్లా అడగనివ్వటం లేదు! అట్లా ఆడిగితే తన ప్రాణమిత్రుడు దూరమవుతాడేమోనన్న భయం! అందుకే తనకూ తన కుటుంబానికి ఎంత నష్టమైనా జరగనీ, కాని అమెరికా మిత్రుడిని దూరం చేసుకోకూడదనే ధృఢ నిశ్చయానికి వచ్చాడు! అమెరికా మిత్రుడికి దూరమై, భారమైన మనుసుతో మిత్ర మందిరంలో మరో ఫొటో వద్దకు వెళ్లాడు పెద్దాయన. ఆది కృష్ణుడు కుచేలుర ఫొటో! ఎందుకో ఆ ఫొటో పెద్దగా నచ్చలేదు. ఆ మాటకొస్తే వాళ్లిద్దరి స్నేహం పెద్దాయనకు పెద్దగా నచ్చదు. కృష్ణుడు మహారాజు, కుచేలుడు కటిక పేదవాడు. వాళ్లిద్దరు మిత్రులు కావటం ఏమిటి? అని ఆయన భావన. వాళ్లిద్దరూ చదువుకునేటపుడు మిత్రులు కదా! ఆ పెద్దాయన ముందు ఎవరో నోరుజారాడు, పెద్దాయనకు అస్సలు గిట్టదు.
పెద్దాయన వేగంగా అడుగులు వేసి, మరో ఫొటో ముందుకు వచ్చాడు. ఆ ఫొటో షోలో సినిమాలో మిత్రులుగా నటించిన అమితాబ్ బచ్చన్, ధర్మేంద్ర అది. షోలో సినిమా వాళ్లిద్దరి స్నేహాన్ని గొప్పగా చూపింది. ఆ సినిమాలో హీరోలిద్దరూ సమానులే. ఒకరికోసం మరొకరు త్యాగాలు చేస్తారు! ఈ రెండు పాయింట్లు పెద్దాయనకు బాగా నచ్చాయి. అమితాబ్‌కు ధర్మేంద్ర మాదిరిగా ఆడి, పాడే హీరోయిన్ లేదు. ఆ పాయింట్ కూడా ఫర్వాలేదన్పించింది! క్లైమాక్స్‌లో ధర్మేంద్రకు గర్ల్ ఫ్రెండ్ ఉందని, వారిద్దరికి పెండ్లి కావాలని, అమితాబ్ డమ్మీ కాయిన్ టాస్ వేసి, తన ప్రాణాలు అర్పించటం పెద్దాయనకు గుర్తొచ్చింది. ఆ పాయింట్ అస్సలు నచ్చలేదు! తనలోని మిత్రబంధాన్ని, తన మిత్రులతో ఉన్న రిలేషన్‌ను చెప్పగలిగే ఫొటోలు చరిత్రలోనే లేవా? అన్పించింది పెద్దాయనకు, వెంటనే చప్పట్లు కొట్టాడు. ప్రధాన సేవకుడు వచ్చాడు. ఫొటోల వంక పెద్దాయన చూపులతో అది నచ్చలేదని సేవకుడికి అర్థమైంది! వెంటనే ఫొటోలన్నీ తీసి అవతల పారేశాడు. ”ఆజ్ఞ దేవరా’! అన్నట్లు పెద్దాయన వైపు చూశాడు. పెద్దాయన కండ్లలో వ్యక్తావ్యక్తమైన భావన ఏదో కదలాడింది.
”చిత్తం! మీరు ఎంతో మహోన్నతమైన మిత్రధర్మాన్ని పాటించే మహనీయులు. మీకు ఉన్న స్వదేశీ, అమెరికా మిత్రులకు ఉన్న మిత్ర బంధానికి సమానమైన మిత్రబంధం చరిత్రలోనే లేదు. మీ మిత్రబంధానిదే ఒక చరిత్ర! అందుకే మీ మిత్రబంధాన్ని వివరిస్తూ మన ఆస్థాన చరిత్రకారులతోనే చరిత్ర రాయించుదాము. ఇప్పటికీ వారు చరిత్ర మార్చే పనిని వారు విజయవంతంగా చేస్తున్నారు! కొత్తగా జొప్పిస్తున్న చరిత్రలో మీ స్వదేశీ, అమెరికా మిత్రబంధాన్ని వివరించే చాప్టర్ కూడా పెట్టిద్దాం! మీ మిత్రబంధాన్ని వివరించే ఒక ఆయిల్ పేయింట్ చూడముచ్చటగా వేయిస్తాము! అని ప్రధాన సేవకుడు సెలవు తీసుకున్నాడు. ”మిస్ యూ ఫ్రెండ్!” అని పెద్దాయన ఫోనుకు మెస్సెజి వచ్చింది. అది అమెరికా మిత్రుడు పెట్టినది. అంతే! ”దోస్త్ మేరా దోస్త్” అంటూ పెద్దాయన ఫోను తీసుకుని కండ్లకద్దుకుని అమెరికా ఫ్లైట్ ఎక్కేశాడు!
- ఉషాకిరణ్