మాధవి డస్కీగా ఉన్న కూడా చూపు తిప్పుకోనివ్వని తన తేనె కళ్ళతో మాయ చేసి, అందం, అభినయంతో ఆకట్టుకుంది. 13 ఏళ్లకే సినీరంగ ప్రవేశం చేసిన మాధవి 1980-90 వ దశకంలో దాదాపు 17 ఏళ్లపాటు సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. ‘తూర్పు పడమర’ సినిమాలో ‘తూర్పు పడమర ఎదురెదురు…, నింగి నేల ఎదురెదురు…, కలియని దిక్కులు కలవవని, తెలిసీ ఆరాటం దేనికని…’ అంటూ శ్రీవిద్య పక్కన పెద్ద పెద్ద కళ్లతో 13 ఏళ్ల వయసులోనే చీర కట్టుకుని పెద్ద ఆరిందానిలా సంగీత కచేరి ఇచ్చిన అమ్మాయి మాధవి. ఆ తర్వాత చిరంజీవి సరసన ఖైదీ చిత్రంలో ”రగులుతుంది మొగిలిపొద.. గుబులుగుంది కన్నెపొద…” అంటూ, ఇంట్లో రామయ్య వీధిలో కష్ణయ్యలో ”పలికేది వేద మంత్రం.. నడిపేది నీచ తంత్రం..”, మాతదేవోభవ చిత్రంలో ”వేణువై వచ్చాను భువనానికి.. గాలినై పోతాను గగనానికి..” అంటూ ప్రేక్షకుల మదిని దోచుకుంది. మెగాస్టార్ చిరంజీవి, కమల్ హాసన్, రజనీకాంత్, అమితాబ్ బచ్చన్, కన్నడ రాజకుమార్, మోహన్ లాల్ వంటి అగ్ర హీరోల సరసన దాదాపు 300 చిత్రాలలో నటించింది. 1996లో పెద్దలు కుదుర్చిన ‘రాల్ఫ్ శర్మ’ని వివాహం చేసుకున్న మాధవి ప్రస్తుతం అమెరికాలోని న్యూజెర్సీలో ఎంతో ప్రేమించే భర్త, ముచ్చటైన ముగ్గురు అమ్మాయిలతో, అత్తా, మామలతో, తమ కుటుంబ వ్యాపారంలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తగా తను కోరుకున్న చక్కని జీవితం గడుపుతున్నారు. మాధవి ఈ నెల 14 వ తేదీన 63 వ జన్మదినోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా సోపతి పాటకుల కోసం అందిస్తున్న ప్రత్యేక వ్యాసం.
మాధవి తెలంగాణలోని హైదరాబాద్‌లో 1962 వ సంవత్సరం సెప్టెంబర్,14వ తేదీన శశిరేఖ, గోవింద స్వామి దంపతులుకు జన్మించింది. ఆమెకు ఒక చెల్లెలు, తమ్ముడు ఉన్నారు. మాధవి ఆమె చెల్లెలు కీర్తి కుమారి, తమ్ముడు ధనుంజరు లతో కలిసి హైదరాబాద్ అబిడ్స్ లోని స్టాన్లీ గర్ల్స్ హైస్కూల్‌లో చదువుకున్నారు. అదే సమయంలో మాధవి ఎనిమిదేళ్ల వయసులోనే హైదరాబాద్‌లోని నత్య కళాశాలలో ఉమా మహేశ్వరి దగ్గర భరతనాట్యం, శ్రీ భట్ దగ్గర జానపద నత్యాలు నేర్చుకోవడం ప్రారంభించింది. కొన్నాళ్ళకు మాధవి ప్రసిద్ధ భరతనాట్యం నత్యకారిణిగా మారి వెయ్యికి పైగా ప్రదర్శనలు ఇచ్చింది. ఎనిమిదవ తరగతి చదువుతున్నపుడు ఒకరోజు రవీంద్రభారతిలో నాట్య ప్రదర్శన ఇస్తున్న మాధవిని చూసి ఇంప్రెస్ అయిన ప్రముఖ చిత్ర దర్శకుడు దాసరి నారాయణరావు తన కొత్త సినిమా ‘తూరుపు పడమర’ చిత్రంలో తొలి అవకాశమిచ్చాడు. అలా మాధవి సినిమా రంగంలోకి అడుగు పెట్టింది. మాధవి అసలు పేరు కనక విజయలక్ష్మి. అప్పటికే సినిమా రంగంలో విజయలక్ష్మి, లక్ష్మి పేర్లతో చాలామంది తారలు ఉండటంతో దాసరి నారాయణరావు ఈమెకి ‘మాధవి’ అని సినీ నామకరణం చేశాడు.
సినీరంగ ప్రవేశం
‘తూరుపు పడమర’ చిత్రం భారీ విజయం సాధించడంతో, ఆ తర్వాత 1978 లో కె. బాలచందర్ రూపొందిస్తున్న తెలుగు చిత్రం ‘మరోచరిత్ర’ లో సహాయ నటిగా అవకాశం కల్పించారు. ఇదే సినిమాను 1981లో ‘ఏక్ దుజే కే లియే’ పేరుతో హిందీలో రీమేక్ చేసినపుడు మాధవి తన పాత్రను తిరిగి తానే పోషించింది. ఈ చిత్రం బాలీవుడ్‌లో అత్యధిక వసూళ్లు సాధించింది. ఈ చిత్రంతో మాధవి ఉత్తమ సహాయ నటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు ప్రతిపాదనను పొందింది. 1981లో కె. బాలచందర్ ఆమెను తమిళ చిత్ర పరిశ్రమకు రజనీకాంత్ సరసన ‘తిల్లు ముల్లు’ చిత్రం ద్వారా పరిచయం చేశారు. 1982లో చిరంజీవితో కలిసి నటించిన ‘ఇంట్లో రామయ్య వీదిలో కష్ణయ్య’ తో జత కట్టిన మాధవి, ఆ తర్వాత భారీ విజయాన్ని సాధించిన ‘ఖైదీ’, ‘కోతలరాయుడు, ప్రాణంఖరీదు, కుక్క కాటుకు చెప్పు దెబ్బ’ వంటి చిత్రాలలో ఆయన సరసన నటించింది. తెలుగులో మాధవి నటించిన చివరి చిత్రం ‘బిగ్ బాస్’. 1990 లో మాధవి అమితాబ్ బచ్చన్‌తో ‘అగ్నిపత్’ంలో నటించింది. డా. రాజకుమార్, విష్ణువర్ధన్, అనంత్ నాగ్, అంబరీష్ వంటి దిగ్గజాలతో ఆమె అనేక కన్నడ సినిమాల్లో నటించింది. రాజ్‌కుమార్‌తో మాధవి ‘హాలు జేను, భాగ్యద లక్ష్మి బారమ్మ, అనురాగ అరళీతు, శతి సెరిదాగ, జీవన చైత్ర, ఆకాస్మిక, ఒదహుత్తిదవరుతో’ వంటి ఏడు సినిమాల్లో నటించింది . విష్ణువర్ధన్‌తో కూడా మాధవి ఏడు చిత్రాలు ‘ఒండే గురి, గండుగలి రామ. చిన్నదంతా మగ, రుద్రనాగ, ఖైదీ, చాణక్య, మలయ మారుత’ సినిమాల్లో నటించింది.
మాధవి తమిళంలో ”రాజ పార్వై, టిక్ టిక్ టిక్, కాక్కి సత్తై, సత్తం, ఎల్లమ్ ఇంబ మయం, మంగమ్మ సబధం’ చిత్రాల్లో కమల్ హాసన్‌తో కలిసి నటించింది. రజనీకాంత్‌తో నటించిన చిత్రాలలో గర్జనై, తిల్లు ముల్లు, తంబిక్కు ఎంత ఊరు, ఉన్ కన్నిల్ నీర్ వజిందాల్, విదుతలై ఉన్నాయి. మలయాళంలో కూడా మోహన్ లాల్, ముమ్ముట్టితో చాలా చిత్రాలలో నటించింది. 1989 లో జాతీయ అవార్డు పొందిన ‘ఒరు వడక్కన్ వీరగాథ’ చిత్రంలో మాధవి ఉన్ని యార్ప పాత్రను పోషించింది. ఆకాశదూతలో లుకేమియాతో మరణించిన తల్లిగా మాధవి పోషించిన పాత్ర ఆమెకు 1993లో ఉత్తమనటిగా కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డును, ఉత్తమ నటిగా ఫిల్మ్ ఫేర్ అవార్డును తెచ్చిపెట్టింది.
‘మాతదేవోభవ’ తో కన్నీళ్ళు పెట్టించిన మాధవి
మాధవి కెరీర్‌లో ఎప్పటికీ గుర్తుండిపోయే చిత్రం ‘మాతదేవోభవ’. 1993లో వచ్చిన ఈ చిత్రంలో మాధవి నటనకు ప్రేక్షకులు జేజేలు కొట్టడంతో పాటు కన్నీళ్ళు పెట్టుకున్నారు. ఇందులో ముగ్గురు పిల్లల తల్లిగా ఆమె చేసిన పోరాటం, ఎమోషన్స్ సినిమా చూసిన ప్రతి ఒక్కరి కంటిలో కన్నీళ్ళు తెప్పించాయి. ఈ చిత్రంలో భర్త చనిపోయాక.. తాను క్యాన్సర్‌తో చనిపోతానని తెల్సుకున్న తల్లి తన పిల్లలను అనాథలుగా మారకుండా దత్తత ఇవ్వడానికి సిద్దపడిన పాత్రలో మాధవి నటించింది అనడం కన్నా జీవించింది అని చెప్పాలి. ముఖ్యంగా ఈ సినిమాలో పాటలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ”వేణువై వచ్చాను భువనానికి.. గాలినై పోతాను గగనానికి” పాటలో ఆమె నటన ఇప్పటికీ అభిమానుల కళ్ళలో మెరుస్తూనే ఉంటుంది. మదర్ సెంటిమెంట్‌తో క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పై కె.ఎస్. రామారావు రూపొందించిన ఈ చిత్రంలో మాధవి, నాజర్‌లు కీలకమైన పాత్రలలో నటించి, మెప్పించారు.
మాతదేవోభవను వదులుకున్న జీవిత
మాతదేవోభవ చిత్రంలో మాధవి పోషించిన పాత్ర కోసం చిత్ర యూనిట్ మొదట్లో జీవితను సంప్రదిస్తే, ఆమెకి అప్పటికే పెళ్లి కావడంతో గహిణిగానే ఉంటానని సున్నితంగా కాదని చెప్పడంతో మాధవికి ఆ అవకాశం దక్కింది. అయితే ఆ తర్వాత ఈ చిత్రం ఘన విజయం సాధించినప్పటికి జీవిత బాధ పడలేదు.
చిరంజీవి ఫేవరెట్ హీరోయిన్ మాధవి
ఈ అందాల తార చిరంజీవి ఫేవరెట్ జోడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. చిరంజీవి మొదటి సినిమా ‘ప్రాణం ఖరీదుతో మొదలై ఇంట్లో రామయ్య- వీధిలో కష్ణయ్య, చట్టంతో పోరాటం, మరణశాసనం, రోషగాడు, కోతల రాయుడు, దొంగమొగుడు, కుక్క కాటుకు చెప్పు దెబ్బ, బిగ్ బాస్’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించారామె. ఖైదీ సినిమాలో ‘రగులుతోంది మొగలిపొద’ పాట ఎంత పెద్ద హిట్టో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇందులో మెగాస్టార్ చిరంజీవితో పోటీపడి డ్యాన్స్ చేసింది మాధవి.
వివాహం : మాధవి తన కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడు సినిమాలకు ఒక్కసారిగా గుడ్‌బై చెప్పి పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకున్నారు. ఆమె ఆధ్యాత్మిక గురువు ‘స్వామి రామ’ అమెరికాలో నివసించే వ్యాపారవేత్త ‘రాల్ఫ్ శర్మ’తో ఫిబ్రవరి 14, 1996న వివాహం చేశారు. మాధవి, రాల్ఫ్ శర్మ ‘స్వామి రామ’ శిష్యులు. ఆ తర్వాత అమెరికా వెళ్ళి అక్కడే సెటిల్ అయిపోయిన మాధవి భర్త బిజినెస్‌లు చూసుకుంటూ బిజీగా మారిపోయింది. ఇకపోతే మాధవికి ముగ్గురు ఆడపిల్లలు. వారి పేర్లు టిఫనీ, ప్రిసిల్లా, ఎవలిన్. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే మాధవి అప్పుడప్పుడు తమ కూతుళ్ల ఫొటోలను షేర్ చేస్తూ ఉంటుంది. పిల్లలు ముగ్గురికి భరతనాట్యం, మన పూజలు, సంప్రదాయాలు, గాయత్రీ మంత్రం, మత్యుంజయ మంత్రం కూడా స్వయంగా మాదవినే నేర్పించారు. అమ్మను మించిన అందంగా ఉన్నారు మాధవి కూతుళ్లు. వీరికి సినిమాల్లోకి వచ్చే ఉద్దేశం లేకపోవడంతో.. చదువుకుంటూ తండ్రి వ్యాపార విషయాలను చూసుకుంటున్నారు.
మాధవి తన భర్త గురించి చెపుతూ.. ”రాల్ఫ్‌కి శ్రీరాముడంటే విపరీతమైన భక్తి. ఆయనే తనకి రోల్ మోడల్, హీరో. ఈ రోజుల్లో శ్రీరాముడిలా ఉండాలనుకునే వారు ఎవరండీ? నా ఉద్దేశంలో భగవంతుడు ఒక్కరినే సష్టించాడు. నా అదష్టవశాత్తు ఆయనే నా భర్త అయ్యారు” అని అంటుంది.
మళ్లీ సినిమాల్లోకి మాధవి : మళ్లీ సినిమాల్లో మాధవిని చూడాలనుకునే వారి ఆశ నెరవేరేటట్టే ఉంది. అయితే కొన్ని షరతులు వర్తిస్తాయని మాధవి అంటారు. ఎందుకంటే కుటుంబానికి తన అవసరం ఇంకా చాలా ఉందనే చెబుతుందామె. అంతేకాకుండా మాధవి ఒక ప్రశాంతమైన వాతావరణానికి అలవాటు పడి ఉన్నారు. అయితే ఎవరైనా కలిసి ఫలాన పాత్ర మీరు చేసి ఉంటే బాగుండేది అన్నప్పుడు మాత్రం ఆమెలో ఉత్సాహం కలిగి పాత రోజులు గుర్తుకొచ్చి, మంచి పాత్ర దొరికితే చేయాలనిపిస్తుదంటారు. అలాంటి రోజు వస్తే మాత్రం తప్పకుండా తెలుగు వారి కోసం మాత్రమే నటిస్తానని అంటుంది మాధవి.
అవార్డులు : 1981 లో కేరళ రాష్ట్ర ప్రభుత్వం నుండి ‘వలర్తు మగంగల్’ చిత్రానికి ఉత్తమ నటి అవార్డు, 1982 లో కేరళ రాష్ట్ర ప్రభుత్వం నుండి ‘ఓర్మక్కాయి’ చిత్రానికి ఉత్తమ నటి అవార్డు, 1993లో మలయాళం ‘ఆకాశదూతు’ చిత్రానికి ఉత్తమ నటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు, 1982 లో కేరళ రాష్ట్ర ప్రభుత్వం నుండి ‘ఆకాశదూతు’ చిత్రానికి ఉత్తమ నటిగా అవార్డు అందుకున్నారు.
- డా. పొన్నం రవిచంద్ర, 9440077499