Sunday, September 14, 2025
E-PAPER
Homeసమీక్షగౌడన్న బతుకు చిత్రమే 'వంకతాడు'

గౌడన్న బతుకు చిత్రమే ‘వంకతాడు’

- Advertisement -

ప్రాచీన భారతదేశంలో మనుషులు చేసే వత్తులను బట్టి వారికి కులం అనేది ఏర్పడింది. అనేక రకాల భిన్న వత్తులు వారి వారి వత్తి చేసుకుంటూ జీవనాన్ని సాగిస్తూనే ఉన్నారు. వారి వత్తి వారి ఐడెంటిటీ. రాను రాను వత్తి కాస్త కులంగా మారింది. అగ్రవర్ణ కులాల వారు, వత్తిని చేసుకునే వారిని చిన్నచూపు చూడడం జరిగింది. రాను రాను కాస్త ఆధిపత్య ధోరణిలోకి వెళ్ళిపోయింది. కానీ వత్తిని నమ్ముకొని దానిని దైవంగా, వారి బాధ్యతగా భావిస్తూ ఇంకా ఆ వత్తిపైనే ఆధారపడి జీవిస్తున్న అనేక కులాలు మనం చూస్తూనే ఉన్నాం. సాహిత్యంలో కూడా వారి వత్తిని ఆ వత్తిలోని సాధక బాధలను దీర్ఘ కవితలు, కథల రూపంలో అనేకమంది అక్షర రూపంలో ప్రపంచానికి పరిచయం చేశారు. ముఖ్యంగా గౌడ వత్తి గురించి మన తండా హరీష్‌ గౌడ్‌ ‘వంకతాడు’ అనే దీర్ఘ కవితతో మన ముందుకు వచ్చాడు.

ఏ విషయమైనా కవిత్వం రాయడం వేరు. కులవత్తిని కవిత్వంలోకి ఒంపడం వేరు. ఎందుకంటే కులవత్తిని వాస్తవిక దష్టి కోణంలో చూసేటప్పుడు కవి ఆ వత్తిలోని మూలాల వరకు వెళ్లాల్సి ఉంటుంది. అందులోని సాధక బాధల గురించి వివరించాల్సి ఉంటుంది. ఈ దీర్ఘ కవితలో మనం గౌడవత్తిని చూడవచ్చు. కవిత్వంలోకి వెళ్ళితే ”నురగలు కక్కే/ ఆ తెల్లని నదిని/ పటువలో పట్టుకొచ్చి/ మండవదగ్గర కుసున్నోళ్ల/ మనసు గాయాలకు/ మందు పూస్తవు”.

పొద్దంతా శ్రమ కోర్చి, అనేక బాధలతోటి కల్లు మండవకి చేరుకున్న వారికి గౌడ్‌ అన్న వారితో ఎంతో ప్రేమగా మాట్లాడి కల్లు ఒంపినప్పుడు వారి మనసు ఎంతో తేలికై మనసు విప్పి మాట్లాడుకుని బాధల్ని అక్కడే విడిచిపెట్టి ఇంటికి చేరుకుంటారు. ఒక విధంగా గౌడ్‌ అన్న మనసు గాయాలకు నయం చేసే కనిపించని డాక్టర్‌. అందుకే కవి హరీష్‌ ఇలా అంటున్నాడు ”కల్లు ఒంపి/ నలుగురి ధూప తీర్చే/ ఆ చేతులే లేకుంటే/ శ్రామికసూర్యుడు ఏ దిక్కుకు/ నడిచెళ్లేవాడో”. ఎండనక, వాననక, ఉదయం, సాయంత్రం ప్రతిరోజు కల్లు గీసి, ఆ చెట్టుని దైవంగా భావించి చెట్టు మొదలుకు దండం పెట్టి చెట్టు పచ్చగా ఉంటే తన జీవితం కూడా పచ్చగా ఉంటుందని నమ్మి జీవితాన్ని కొనసాగించుతాడు. కాని ఆ గౌడ్‌ అన్న జీవితంలో ఎన్నో ఆటుపోట్లు కూడా ఉంటాయని ఎంతమందికి తెలుసు.
ప్రపంచం వేగంగా మారుతుంది. మనుషులంతా డబ్బు వెనకాల పరిగెడుతూ రియల్‌ ఎస్టేట్‌ దందా చేస్తూ పచ్చని ప్రకతిని నేడు ఫ్లాట్లుగా మార్చి అమ్ముతుంటే గౌడ్‌ అన్న ఎంతో నైరాశ్యంకి గురవుతున్నాడు. అంతేకాకుండా ప్రతి ఊరిలో వైన్స్‌ తెరిచి విచ్చలవిడిగా మద్యం అమ్ముతుంటే, గౌడ్‌ అన్న తను గీచిన కల్లు ”అమ్ముడుబోని రోజు/ కల్లును పారబోసుకుంట/ చెట్టు తల్లిని తల్సుకొని/ దుఃఖపడిన క్షణాలు ఎన్నో”. అందుకే గౌడ్‌ అన్నకు ‘జీవితంలో పచ్చబొట్టు పొడిపిచ్చుకున్నట్టు/ కాళ్లకు, చేతులకు, బర్రెలు తప్ప/ మిగిలిందేముంది’. నెలసరి ‘వాడికల’ పోపించుకొని చివరికి సగం ఎగొట్టే జనాలే కనిపిస్తుంటారు. ”ఎంతెత్తు చెట్లెక్కినా/ జీవితం మెట్లెక్కలేని/ నిస్సాహాయతల పొగ” ఇలా వారి ఆర్థిక స్థితిగతులు చెప్పుకుంటూ పోతే లెక్కలేని ఇబ్బందులే కనిపిస్తాయి.
గౌడ వత్తికి ముఖ్యంగా ఇద్దరి సహకారం ఎంతో ఉంటుంది. వారే కుండలిచ్చిన కుమ్మరన్న, కత్తులు సర్సిన కమ్మరన్న. నిత్యం వీరితో కలిసి తన వత్తిని కొనసాగిస్తూ ఊరిలో అందరితో నవ్వుతూ మాట్లాడుతూ, కొంతమంది తనని తన వత్తిని హేళన చేసినప్పటికీని అవేవీ పట్టించుకోకుండా తన తండ్రి, తాతల నుండి వంశపారంపరంగా వస్తున్న వత్తినే దైవంగా భావిస్తూ జీవిస్తున్నాడు. ఓట్లు వచ్చినప్పుడు మాత్రమే రాజకీయ నాయకులకు వీరు ఓటు బ్యాంకుగా మాత్రమే కనపడతారు. గెలిచాక వీరికి ఎలాంటి సాయం కూడా అందించట్లేదు. అందుకే కవి వీరి జీవితాల గురించి చెబుతూ ”తాడు మీదికెళ్ళిబడి/ ఎన్ని బతుకులు కాట్లే గలిసినా/ తాళ్లు ఎక్కి ఎక్కి/ వంకతాడోలే నీ నడుము వంగిపోయినా/ ఏ పథకం నీ జీవితాన్ని వెలిగించకపాయే”, ‘ఎక్కడేసిన గొంగడి అక్కడనే అనిపిత్తంది’ అంటాడు.

కాలక్రమేన రోజు రోజుకి తాటివనాలు తరిగిపోతున్నాయి, ఈతవనాలు ఈదరగాలులకు పట్టుతప్పుతున్నాయి. వైన్‌ షాప్‌కి అలవాటు పడుతున్న జనాలతోని గౌడ వత్తి అడుగంటి పోతుంది. ఇప్పుడు గౌడ్‌ అన్న చేతికి ‘కుండలు పెట్టిన చోట/ ల్యాప్‌టాప్‌లతో/ కొత్త ప్రోగ్రాములు నడవాలే’, ఇటు వత్తిని అటు చదువుని చదువుకుంటూ రెండు వైపులా పదును తేలితేనే జీవితం కొనసాగుతుంది. ఈ భూమి మీద తాటిచెట్టు ఉన్నంతకాలం గౌడన్న అనే పేరు వినపడుతూనే ఉంటుంది. కవి ఉపాధ్యాయ వత్తి చేస్తున్నప్పటికీ తాను పుట్టి పెరిగింది, తన తండ్రి, తాత ముత్తాతలంతా గౌడ వత్తిని ఎన్నుకోవడం వలన ఆ వత్తిపై ఎనలేని మమకారంతోనే దీర్ఘకవిత రాసాడేమో అనిపిస్తుంది.

ప్రాచీన కాలంలో తాటి కమ్మల మీదనే తాళపత్ర గ్రంధాలు తయారు చేశారు. అంతటి చరిత్ర కలిగిన గౌడన్న ను కవి ‘ముంజల దేశానికి రాజు’ అని ‘మూడు కన్నుల చందమామ’ గా పోల్చడం ద్వారా కవి యొక్క గొప్పదనం తెలుస్తుంది. ఈ దీర్ఘ కవితలో 20 కవితలు ఉన్నాయి. ప్రతి కవితలో ఆ వత్తిలో జీవిస్తున్న జీవన విధానం ఎట్టిదో తెలియజేస్తుంది. కులవత్తుల జీవితాలు బాగుపడాలంటే రాజ్యాధికారం ఒకటె అని తెలియజేస్తూ ఈ దీర్ఘ కవితని ముగిస్తాడు. చక్కని అంశం పైన కవిత రాసిన తండ హరీష్‌గౌడ్‌ని అభినందిస్తూ..

  • గాజోజి శ్రీనివాస్‌
    9948483560
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -