Sunday, September 14, 2025
E-PAPER
Homeజాతీయంఎట్టకేలకు మణిపూర్‌కు ప్రధాని

ఎట్టకేలకు మణిపూర్‌కు ప్రధాని

- Advertisement -

అమానుష హింసాకాండ జరిగిన రెండన్నరేండ్ల తరువాత పర్యటన
భారీ బందోబస్తు మధ్య సభలు
మీ వెంటే ఉంటానంటూ ఇప్పుడు హామీ
మోడీ గోబ్యాక్‌ : పలుచోట్ల నిరసనలు

ఇంఫాల్‌ : ఎట్టకేలకు మణిపూర్‌కు ప్రధాన మంత్రి నరేంద్రమోడీ వెళ్లారు. గిరిజనులను లక్ష్యంగా చేసుకుని అమానుష హింసాకాండ జరిగిన రెండున్నరేండ్ల తరువాత శనివారం జరిగిన ఈ పర్యటనకు సైతం భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. మోడీ పాల్గొన్న సభలకు వచ్చే వారిని సైతం పూర్తిస్థాయిలో తనిఖీ చేశారు. నిఘా యంత్రాంగం రాష్ట్రమంతా కన్ను వేసింది. అయినా ప్రజలు ఎక్కడికక్కడ కదిలారు. మోడీ గోబ్యాక్‌ అని నినదిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు చేశారు. ఒక పథకం ప్రకారం నెలల తరబడి చెలరేగిన హింసలో వందలాది మంది గిరిజనులు మరణించగా, వేలాదిమంది నిరాశ్రయులయ్యారు. ఈ దాడుల వెనుక బీజేపీకి చెందిన అప్పటి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బీరేన్‌సింగ్‌ ప్రమేయం ఉందన్న విషయం సుప్రీంకోర్టులో నిర్ధారణ కావడంతో ఆయన పదవి నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. హింసాకాండ జరుగుతున్నప్పటి నుండి ప్రధానమంత్రి మోడీ ఈ రాష్ట్రంలో పర్యటించాలని, బాధిత ప్రజలను పరామర్శించాలన్న డిమాండ్‌ దేశ వ్యాప్తంగా వ్యక్తమైంది. తరచు విదేశీ పర్యటనలకు వెడుతున్న మోడీ దేశంలోని మణిపూర్‌ను విస్మరించిన విషయం పార్లమెంటులోనూ ప్రస్తావనకు వచ్చింది. సోషల్‌ మీడియాలోనూ పలు విమర్శలు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో, తాజాగా జరిగిన పర్యటన తరువాతైనా బాధిత ప్రజానీకానికి ఊరట ఏమైనా లభించిందా అంటే ప్రశ్నార్థకమే! ఇంత ఆలస్యంగా జరిపిన కార్యక్రమంలోనూ ‘మీతోనే ఉంటా’ వంటి ఊకదంపుడు ప్రసంగానికి, బాధితుల పరామర్శకు మోడీ పరిమితమయ్యారు. ఎప్పుడు ఫలితాలిస్తాయో తెలియని రూ.8,500 కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. దీంతో మోడీ పర్యటన జరిగిన తీరుపై పలు విమర్శలు వస్తున్నాయి.

మోడీ ఏమన్నారు?
‘ఇక్కడ హింస ప్రజ్వరిల్లడం దురదృష్టకరం. ఈ రోజు నేను మీకు ఓ హామీ ఇస్తున్నాను. భారత ప్రభుత్వం మీతోనే ఉంటుంది. నేను కూడా మీ వెంటే ఉంటాను. రాష్ట్రంలో శాంతిని, సుస్థిరతను సాధిస్తాం’ అని ప్రధాని అన్నారు. ప్రజల్లో పొదుపును పెంచి వారి జీవితాలను సుఖమయం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే జీఎస్టీని తగ్గించాం. ఫలితంగా మణిపూర్‌లో పర్యాటకం అభివృద్ధి చెందుతుంది. రాష్ట్ర ప్రజల ఇబ్బందులను తొలగించడానికి కేంద్రం సున్నితంగా వ్యవహరిస్తుంది. 2014కు ముందు మణిపూర్‌ వృద్ధి రేటు ఒక శాతం కంటే తక్కువగా ఉన్నది. ఇప్పుడు వేగవంతమైన రేటుతో దూసుకుపోతోంది’ అని ఆయన అన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు
బీజేపీ పాలనలో మణిపూర్‌ తగలబడిపోయిందని పేర్కొంటూ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కాంగ్రెస్‌, మణిపూర్‌ పీపుల్స్‌ పార్టీ (ఎంపీపీ), మహిళా సంఘాలు, విద్యార్థుల ఆధ్వర్యంలో ఆందోళనలు జరిగాయి. ‘మోడీ గోబ్యాక్‌’ అని నినదించారు. కాంగ్రెస్‌, ఎంపీపీ ఆధ్వర్యంలో ఆయా పార్టీల కార్యకర్తలు ఇంఫాల్‌లో పెద్దఎత్తున ప్రదర్శన నిర్వహించారు. చారిత్రక కాంగ్లా కోట ఎదుట కాంగ్రెస్‌ పార్టీ నిరసన నిర్వహించింది. ప్రధాని సభకు వంద మీటర్ల దూరంలోనే ఉన్న కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో కూడా నిరసనలు జరిగాయి. మణిపూర్‌ పీపుల్స్‌ పార్టీ కూడా ప్రధాని బహిరంగ సభ వేదిక సమీపంలో ప్రదర్శన నిర్వహించింది.’ .తౌబాల్‌ జిల్లాలోని ఖంగాబోక్‌, లీషాంగ్దెమ్‌, తౌబాల్‌ హవోకా తదితర ప్రాంతాల్లో మహిళా సంఘాల ఆధ్వర్యాన నిరసన తెలిపారు. మణిపూర్‌ విశ్వవిద్యాలయంలో, రాష్ట్రంలోని వివిధ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులు తమ క్యాంపస్‌లో, కళాశాలల వద్ద నిరసనలు తెలిపారు.

రాష్ట్ర ప్రజలకు అవమానకరం : కాంగ్రెస్‌
సహాయ శిబిరాల్లోని ప్రజల ఆక్రందనలు వినలేదు : మల్లిఖార్జున ఖర్గే
మోడీ మణిపూర్‌ పర్యటన రాష్ట్ర ప్రజలకు తీవ్ర అవమానకరమని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే విమర్శించారు. సహాయ శిబిరాలలో ఉంటున్న ప్రజల ఆక్రందనలను మోడీ వినలేదని ఆయన పేర్కొన్నారు. 2022 జనవరిలో ఎన్నికలు జరుగుతున్న సమయంలో మోడీ మణిపూర్‌కు వచ్చారని, మళ్లీ మరో ఏడాదిలో ఎన్నికలు జరుపుతున్న సమయంలో ప్రస్తుతం పర్యటనకు వచ్చారని ఆయన ట్వీట్‌చేశారు. ఇంత ఆలస్యంగా పర్యటించడం దురదృష్టకరమని కాంగ్రెస్‌ ఎంపి ప్రియాంక గాంధీ పేర్కొన్నారు.

చాలా ఆలస్యమైంది : సీపీఐ(ఎం)
అఖిలపక్షంతో వెళ్ళాలని కోరాం : సీపీఐ(ఎం) నేత జాన్‌ బ్రిట్టాస్‌
ప్రధాని పర్యటన ఇప్పటికే చాలా ఆలస్యమైందని సీపీఐ(ఎం) ఎంపీ జాన్‌ బ్రిట్టాస్‌ వ్యాఖ్యానించారు. అయినప్పటికీ దానిని స్వాగతిస్తున్నట్లు తెలిపారు. ‘ప్రతిపక్ష పార్టీగా మేము ఎప్పుడూ ఒకే మాట చెబుతున్నాం. అన్ని పార్టీల ప్రతినిధులతో కలిసి మణిపూర్‌లో పర్యటించాలని ప్రధానిని కోరాం. దీనివల్ల రాష్ట్రంలో శాంతి, ప్రశాంతత నెలకొంటాయి. గత రెండు సంవత్సరాలుగా ఆయన మా మాట వినలేదు. పార్లమెంటులో పూర్తిస్థాయి చర్చ జరగాలని కోరినప్పటికీ పట్టించుకోలేదు. కనీసం ఇప్పుడు రాష్ట్రానికి వెళ్లారు. కానీ చాలా ఆలస్యమైంది.’ అని ఆయన పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -