Sunday, September 14, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుపార్టీ మారిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలి

పార్టీ మారిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలి

- Advertisement -

తొమ్మిది నెలల్లో ఉప ఎన్నికలు ఖాయం
ఎమ్మెల్యే బండ్ల దొంగల ముఠాలో చేరిపోయారు
గద్వాలలోని గర్జనసభలో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌

నవతెలంగాణ – జోగులాంబ గద్వాల
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దమ్ముంటే.. పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు వెళ్లాలని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సవాల్‌ విసిరారు. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని తేరు మైదానంలో ఏర్పాటు చేసిన గర్జన సభకు కేటీఆర్‌ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. రేవంత్‌ రెడ్డి గతంలో పార్టీ మారిన ఎమ్మెల్యేలను రాళ్లతో కొట్టి చంపాలని చెప్పిన మాట ఇప్పుడు ఏమైందని ప్రశ్నించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టు సీరియస్‌గా ఉందని, రాబోయే తొమ్మిది నెలల్లో రాష్ట్రంలో ఉపఎన్నికలు వస్తాయని అన్నారు. దీనికోసం గద్వాల ప్రజలు సిద్ధంగా ఉండాలని తెలిపారు. జిల్లాకు మెడికల్‌ కళాశాల, నర్సింగ్‌ కళాశాల, 350 పడకల ఆస్పత్రి నిర్మాణం కేసీఆర్‌ హయాంలోనే వచ్చాయన్నారు. జిల్లా కేంద్రంలో 1375 డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లు ఏర్పాటు చేస్తే కాంగ్రెస్‌ నాయకులు రంగులు మార్చి ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినట్టు చెప్పుకోవడం సిగ్గుచేటని తెలిపారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను రన్నింగ్‌ ప్రాజెక్టులుగా మార్చి అదనంగా 10 లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చిన ఘనత కేసీఆర్‌కి దక్కుతుందన్నారు.

ఎన్నికల సమయంలో ఆరు గ్యారంటీలు ఇస్తామని ప్రజలకు హామీ ఇచ్చి అమలు చేయడం లేదన్నారు. రూ. రెండు లక్షల రుణమాఫీ పూర్తిస్థాయిలో అమలు కాలేదని తెలిపారు. సీడ్‌, పత్తి రైతులు డబ్బులు అందక ఇబ్బందులు పడుతుంటే పట్టించుకోవడం లేదన్నారు. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డి అభివృద్ధి కోసమే పార్టీ మారినట్టు చెప్పారని ఇప్పుడేం అభివృద్ధి జరిగిందని కేటీఆర్‌ ప్రశ్నించారు. ఉప ఎన్నికలు వస్తాయని భయంతోనే పార్టీ మారలేదని, బీఆర్‌ఎస్‌లోనే ఉన్నానని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని అన్నారు. నిరుద్యోగులకు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఒక్క నోటిఫికేషన్‌ అయినా ఇచ్చారా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌ ఇస్తామన్న మాట ఏమైందని అడిగారు. సాగు నీరు సమృద్ధిగా లభించేందుకు గట్టు, తుమ్మిళ్ల ప్రాజెక్టులు చేపడితే వాటిని ఎండబెడుతున్నారన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో వలసలకు కేరాఫ్‌గా ఉన్న పాలమూరును తెలంగాణ ఏర్పడ్డాక అభాగ్యులకు అన్నం పెట్టే జిల్లాగా చేశామని ఆయన తెలిపారు. అంతేకాక కేసీఆర్‌ 1020 గురుకులాలు ఏర్పాటు చేసి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తే ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాలనలో రాష్ట్రంలో విద్యార్థులు ఎలుకలు కొరికి చనిపోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. అలంపూర్‌ నియోజకవర్గం పెద్ద తాండ్రపాడులో నిర్మించ తలపెట్టిన విత్తనాల ఫ్యాక్టరీని రద్దు చేయాలని కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు. ఈ ఫ్యాక్టరీ రద్దు కోసం ఆందోళన చేసిన రైతులను 15 రోజులపాటు జైల్లో పెట్టిన దుర్మార్గపు పాలన కాంగ్రెస్‌దని అన్నారు.

నిర్మల్‌ ప్రాంతంలో చేపట్టే విత్తనాల ఫ్యాక్టరీని రద్దు చేసినట్టే పెద్దతాండ్రపాడులో ఏర్పాటు చేసే విత్తనాల ఫ్యాక్టరీని రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. అనంతరం మాజీ మున్సిపల్‌ చైర్మెన్‌ బిఎస్‌ కేశవ్‌, జడ్పీటీసీ పద్మా వెంకటేశ్వర్‌ రెడ్డి, 10మంది కౌన్సిలర్లు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు కేటీఆర్‌ సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు నిరంజన్‌ రెడ్డి, శ్రీనివాస్‌ గౌడ్‌, లక్ష్మారెడ్డి, ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌, ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌ రెడ్డి, విజయుడు, ఎమ్మెల్సీలు చల్ల వెంకట్రాంరెడ్డి, నవీన్‌కుమార్‌ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు రాజేందర్‌రెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, అంజయ్య యాదవ్‌, జైపాల్‌ యాదవ్‌, బాసు హనుమంత నాయుడు, నాగర్‌దొడ్డి వెంకట రాములు, ఆంజనేయులు గౌడ్‌ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -