కూకట్‌పల్లి మహిళ హత్య కేసులో నిందితుల అరెస్టు
వివరాలు వెల్లడించిన సైబరాబాద్ సీపీ అనినాష్ మహంతి
నవతెలంగాణ-మియాపూర్
నగరంలోని కూకట్‌పల్లి పోలీసుస్టేషన్ పరిధిలో జరిగిన మహిళ హత్య కేసులో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. మహిళ ఇంట్లో పనిచేసే వ్యక్తే హంతకుడిగా గుర్తించారు. ఆమెను హత్య చేసి బంగారంతోపాటు నగదును దొంగిలించినట్టు నిర్ధారించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను సైబరాబాద్ కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో సీపీ అవినాష్ మహంతి శనివారం వెల్లడించారు. కూకట్‌పల్లి పీఎస్ పరిధిలో స్వాన్ లేక్ అపార్ట్‌మెంట్‌లో రేణు అగర్వాల్ అనే మహిళ ఉంటోంది. కొద్ది రోజుల క్రితమే ఆమె ఇంట్లో హర్ష అనే వ్యక్తి పనికి కుదిరాడు. రోషన్ అనే మరో వ్యక్తి అదే అపార్ట్‌మెంట్‌లో పై అంతస్తులో పని చేసేవాడు. రేణు అగర్వాల్ ఇంట్లో కుటుంబ సభ్యులు ఎవరూ లేకపోవడంతో ఆమెను హత్య చేసేందుకు నిందితులు పథకం రచించారు. ఈ నెల 10వ తేదీన రేణు అగర్వాల్‌పై తన ఇంట్లోనే కుక్కర్‌తో దాడి చేశారు.
ఈ ఘటనలో ఆమె తలకు బలమైన గాయం కావడంతో ఆమె కింద పడిపోయింది. వెంటనే ఆమె కాళ్లు, చేతులు కట్టేసి బంగారం, ఇతర నగదును దోచుకుని నిందితులు వెళ్లిపోయారు. ఏడు తులాల బంగారం, ఖరీదైన వాచ్‌లు, ఇతర సామగ్రిని దొంగిలించారు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. రేణు అగర్వాల్ అప్పటికే మృతిచెందింది. కేసు నమోదు చేసుకుని పోలీసులు విచారణ చేపట్టారు. నిందితులు హర్ష, రోషన్‌ను శనివారం అరెస్టు చేశారు. నిందితులపై గతంలో కూడా మూడు కేసులు ఉన్నాయి. ఈ కేసులో రోషన్ సోదరుడిని సైతం అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు సీఐ తెలిపారు. ఈ సమావేశంలో పోలీసు అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.