నవతెలంగాణ – హైదరాబాద్ : క్రీడాభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న భారత్-పాకిస్తాన్ జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ మరికొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. ఆసియాకప్ క్రికెట్ టోర్నీలోనే హై ఓల్టేజ్ క్రికెట్ మ్యాచ్ ఇది. సూపర్-4లో చేరుకోవాలంటే ఇరుజట్లకు గెలుపు తప్పనిసరి. గ్రూప్-ఎలో భాగంగా తొలి లీగ్ మ్యాచ్‌లో భారతజట్టు ఆతిథ్య యుఎఇపై, పాకిస్తాన్ జట్టు ఒమన్‌పై ఘన విజయం సాధించాయి. ఈ క్రమంలో భారత్-పాకిస్తాన్ జట్ల మధ్య ఆదివారం ఉత్కంఠ పోరు జరగనుంది. టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్పిన్నర్లపైనే భారం మోపాడు. రెగ్యులర్ పేసర్ బుమ్రా మినహా.. మరో పేసర్‌ను టి20ల్లో ఎంపిక చేసే అవకాశం లేదు. దీంతో వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్‌లపైనే ఆశలు ఉన్నాయి. వరుణ్ చక్రవర్తి గత ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. స్పిన్ ఆల్‌రౌండర్‌గా అక్షర్ పటేల్ పేస్ ఆల్‌రౌండర్‌గా హార్దిక్ పాండ్యా ఉండనే ఉన్నారు. ‘చైనామన్’ బౌలర్ కుల్‌దీప్ యాదవ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే. ఆరు నెలల తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌లో ఆడే అవకాశం రావడంతో తొలి మ్యాచ్‌లో యుఎఇపై అదరగొట్టాడు. ఆసియా కప్ తొలి మ్యాచ్‌లోనే యూఏఈపై నాలుగు వికెట్ల ప్రదర్శన చేశాడు. వైవిధ్యమైన అతడి బౌలింగ్ ముందు పసికూన నిలవలేకపోయింది. అయితే, చాన్నాళ్లు బెంచ్‌కే పరిమితమైనా తనలోని సత్తా తగ్గలేదని నిరూపించాడు. స్టంప్స్ లక్ష్యంగా అతడి బౌలింగ్‌ను తట్టుకోవడం పాక్ యువ బ్యాటింగ్ విభాగానికి కష్టమే. తన ‘స్పిన్’ ఎటాక్‌తో విరుచుకుపడతాడని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. జస్‌ప్రీత్ బుమ్రాను పాక్ బ్యాటర్లు ఎలా ఎదుర్కొంటారో చూడాలి. టీమిండియాపై చెలరేగిపోయే షహీన్ అఫ్రిదిపై మన బ్యాటర్లు ఆధిపత్యం ప్రదర్శిస్తే మనకు కష్టమే. బ్యాటింగ్‌లో అభిషేక్-గిల్ జోడీ.. బౌలింగ్‌లో కుల్దీప్-వరుణ్ చక్రవర్తి జోడీ ప్రధాన ఆకర్షణ అనడంలో సందేహం లేదు.
మరోవైపు పాకిస్తాన్ జట్టుకు మహ్మద్ నవాజ్ రూపంలో అత్యంత ప్రమాదకార స్పిన్నర్ ఉన్నాడు. అతడికి తోడుగా అబ్రార్ అహ్మద్ కూడా కీలకమే. ఇక సుఫియాన్ ముకీమ్, సయామ్ అయుబ్ కూడా పార్ట్ స్పిన్‌తో వికెట్లు తీసే బౌలర్లు. అయితే, భారత బ్యాటర్లు వీరిని ఎలా ఎదుర్కొంటారనేది ఆసక్తికరం. సీనియర్లు రోహిత్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ వంటి ఆటగాళ్లు లేకుండా తొలిసారి మినీ టోర్నీలో టీమ్‌ఇండియా ఆడుతోంది. స్పిన్‌ను కాచుకొని క్రీజ్‌లో నిలదొక్కుకుంటే దుబారులో పరుగులు చేయడం పెద్ద కష్టమేం కాదు.
జట్లు(అంచనా)..
ఇండియా: సూర్యకుమార్(కెప్టెన్), శుభ్‌మన్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, దూబే, హార్దిక్, సంజు(వికెట్ కీపర్), అక్షర్, కుల్దీప్, బుమ్రా, వరుణ్ చక్రవర్తి.
పాకిస్తాన్: అఘా సల్మాన్(కెప్టెన్), హర్రిస్(వికెట్ కీపర్), ఆయుబ్, ఫర్హాన్, నవాజ్, ఫహీమ్ అష్రాఫ్, షాహిన్ షా అఫ్రిది, రవూఫ్, అబ్రార్ అహ్మద్, హసన్ అలీ, షోరిఫుల్ ముఖీమ్.