ప్రసవ పూర్వ సంరక్షణ గురించి గత వారం కొంత అవగాహన పెంచుకొన్నాం కదా! అంతే ప్రాముఖ్యత, ప్రసవ సమయ సంరక్షణకు కూడా ఇవ్వాల్సి వుంటుంది. మేము చదువుకొనే రోజుల్లో, మా ప్రొఫెసర్, తన మొట్టమొదటి క్లాస్‌లో ‘ప్రసవమనేది ప్రకృతిసిద్ధంగా జరిగే ప్రక్రియ. దీని బాధ్యత చాలావరకు, బిడ్డను తన గర్భంలో నవమాసాలు కాపాడుకొన్న ఆ తల్లే తీసుకుంటుంది. గర్భ నొప్పులు భరించి, బిడ్డను బయటకు తీసుకు వచ్చేలా ప్రయాసపడు తుంది. ఆ క్రమంలో చుట్టూ ఉన్నవారి సహకారం కొంత మేరకు మాత్రమే తీసుకుంటుంది. ఆమెకు సహాయమందించే వారు వైద్యులు, శిక్షణ పొందిన నర్సులు, ఏఎన్‌ఎంలు, అనుభవ మున్న స్త్రీలు ఇలా ఎవరైనా కావచ్చు. ఎటువంటి సహకారం దొరకని పరిస్థితుల్లో ప్రసవం యాదృచ్చికంగా జరిగిపోతుంది’ అని మొదలుపెట్టి, ‘కానీ, ఈ విధంగా అన్నివేళల్లో జరగక పోవచ్చు. ప్రసవ సమయంలో ఏవైనా సమస్యలుత్పన్నమైతే అవి తల్లికీ, బిడ్డకీ ప్రాణాంతకం కావొచ్చు. కాబట్టి ప్రసవ సమయ సంరక్షణ సరైన పద్ధతిలో అందించటానికి, తల్లి-బిడ్డల ఆరోగ్యం కొరకు అన్ని సౌకర్యాలున్న ఆసుపత్రిలో మాత్రమే ప్రసవం జరగాలి’ అని చెప్పుకుంటూ పోయారు. ప్రొఫెసరుగారు చెప్పినవి అప్పుడూ, ఇప్పుడూ కూడా నిర్వివాదమైన వాస్తవాలు.
సంరక్షణ ఎప్పటినుండి మొదలౌతుంది?
ఇది ప్రసూతి పూర్వ సంరక్షణకు కొనసాగింపు చర్యగా గుర్తించాలి. ప్రసవ సమయం దగ్గరపడుతున్నా లేదా నొప్పులు మొదలైననా ప్రతి గర్భిణీ తప్పనిసరిగా పొందవల్సిన వైద్యసంరక్షణ. ప్రసవపూర్వ దశలో, గర్భిణి ఆరోగ్య దృష్ట్యా వైద్యులు సూచించిన తేదీకి ఆసుపత్రిలో చేరడం తప్పనిసరి. సామాన్యంగా ప్రథమ వైద్య సంప్రతింపులో గత రుతుస్రావ తేదీని బట్టి ఆమె ప్రసవ తేదీ అంచనా వేస్తారు. ఆ తేదీకి సుమారు ఒకటి-రెండు వారాలు ఇటు, అటుగా కూడా ప్రసవం పట్ల అప్రమత్తమై ఉండమని సూచిస్తారు. ఆమెకు ఆరోగ్య సమస్యలున్నట్లైతే వైద్యులు నిర్ణయించిన తేదీకి ఆసుపత్రిలో చేరవలసి ఉంటుంది. కొందరు మహిళలు తెలిసో తెలియకో, వీలు చేసుకోలేకనో నలభై వారాల గర్భ సమయం ముగిసే వరకు/నీరు విరిగే వరకు పనులు చేసుకొంటూనే ఉంటారు. ఇది ప్రమాదకరం. ఆసుపత్రికి తరలించేలోపే ప్రసవం జరిగిపోవచ్చు. దీనికి భిన్నంగా జాగురూకులై ఉన్న మరి కొందరు స్త్రీలు, జనన మార్గద్వారాన్ని మూసివుంచే మ్యూకస్ ప్లగ్ పడిపోవడాన్ని(మొలకెత్తడం, ఆంగ్లంలో షో), ప్రసవసంకేతంగా తెలుసుకొని, వెంటనే ఆసుపత్రికి బయల్దేరుతారు. ఇది సరైన సకాల చర్య.
సంరక్షణ ముఖ్యోద్దేశం?
గర్భిణీ.. క్షేమంగా, సానుకూలమైన, పరిశుభ్రమైన వాతావరణంలో ఆరోగ్యమైన బిడ్డను ప్రసవించాలి. ప్రసవ సమయంలో తల్లికి, నవజాత శిశువుకు ఏ విధమైన అంటూ తగలకూడదు. ప్రసవానంతర సంక్రమణం (ప్యూపెరల్సెప్సిస్) జరుగకూడదు. ఆ విధమైన ప్రసవ ప్రక్రియకు దోహదపడడమే ప్రసవ సమయ సంరక్షణ ముఖ్యోద్దేశం.
అమలులో పెట్టడం ఎలా?
తల్లికి, బిడ్డకి ఎటువంటి అంటూ తగలకుండా ఉండేటట్లు చేయాలంటే ప్రసవం చేసే సిబ్బంది వ్యక్తిగత పరిశుభ్రత, ముఖ్యంగా చేతులు క్రిమిరహితంగా ఉండాలి. ప్రసూతి, మూత్ర విసర్జన గదులు, ప్రసూతి బల్ల, ప్రసవ పరంగా వాడే పరికరాలకు సంబంధించి సంపూర్ణ పరిశుభ్రత పాటించడం, ఎప్పటికప్పుడు క్రిమిరహితంగా ఉంచడానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వవలిసి ఉంటుంది. డిస్పోసబెల్స్ విరివిగా వాడాలి. తల్లి-బిడ్డలకి ఏ మాత్రమూ, ఎటువంటి హాని జరగకుండా, సురక్షిత ప్రసవం అయ్యేలా ఒక ప్రత్యేకమైన ప్రోటోకాల్ ప్రకారంగా అన్ని పనులు వెంటవెంటనే జరిగిపోవాలి. ఎక్కడా ఆలస్యానికి తావివ్వకూడదు. నవజాత శిశు, అత్యవసర చికిత్స, అనేస్తేషియా వైద్యులు అందుబాటులో ఉండాలి. ప్రసవం జరుగుతున్న సమయంలో ఏదైనా అనుకోని, అనివార్య సమస్య తలెత్తినప్పుడు దానికి వైద్య సిబ్బంది సుముఖంగా, సంసిద్ధంగా, క్రియాశీలకంగా ఉండాలి ప్రసవ నొప్పులు భరిస్తున్న తల్లికి ఓదార్పు, మానసిక స్థైర్యం కలుగచేసేటట్టుగా సిబ్బంది ప్రవర్తించాలి. ఆ విధమైన నైతిక ప్రమాణాలతో కూడుకొన్న శిక్షణ వారు పొంది ఉండాలి.
తగు జాగ్రత్తలతో…
తల్లికి అవసరమైన మానసిక స్థైర్యం కలుగ జేయడం, ప్రసవనొప్పుల పట్ల సహానుభూతి ప్రకటిస్తూనే, బిడ్డను జననద్వారం వైపు నెట్టేట్టుగా, ఆ నొప్పులను బిగపట్టడం వంటి చర్యలు చేపట్టే విధంగా ఆమెను, సౌమ్యంగా ప్రోత్సహించడం, ఆ క్రమంలో మహిళ అలిసిపోతే, సేదతీరడానికి అవకాశమిచ్చి మరల ఉపక్రమించేలా చేయాలి. క్లుప్తంగా చెప్పాలంటే ప్రసవ సమయంలో ఆమె పక్కనే మద్దతుగా ఉండి, ప్రసవ పురోగతి సకాలంలో జరిగి, బిడ్డను సునాయాసంగా కనేటట్టుగా చేయాలి. ఈ ప్రక్రియలో భాగంగా ప్రసూతి ప్రక్రియ సానుకూలంగా జరుగుతున్నదని, తల్లి బిడ్డలు క్షేమంగా ఉన్నారని తెలియచేసే పరికరాలు అందుబాటులో ఉండాలి. ప్రసవ వేదనను అదుపులో ఉండేటట్టు చేసే శ్వాస ప్రక్రియలు, మధ్యమధ్యలో రిలాక్సేషన్ టెక్నిక్స్, విశ్రాంతి, తల్లి ప్రసవ భంగిమల్లో సడలింపు వంటివి తల్లి చేత చేయించగలగాలి. నవజాత శిశు పరంగా సంరక్షణ ఇవ్వగలగడం అనివార్య అంశం.
బిడ్డ పుట్టిన తర్వాత
పుట్టిన వెంటనే బిడ్డ ఏడవడం తప్పకుండ జరగాలి. అది బిడ్డ తీసుకునే మొదటి శ్వాస. అందుకుగాను బిడ్డ నోరు, గొంతు, ముక్కు రంధ్రాలు సున్నితంగా శుభ్ర పరచడం, బిడ్డను చేతిపై బోర్లా వేసుకొనేనివీపుపై మృదువుగా చరచడం వంటివి సిబ్బంది చేయగలిగుండాలి. జన్మ సమయం, బరువు, అప్గార్ స్కోర్ వంటివి వెంటవెంటనే నమోదు చేసుకుంటూనే, నాభితీగ తగు రీతిలో బిగించి, తల్లినుండి వేరుచేయాలి. బిడ్డను శుభ్రపరచి, పరిశుభ్రమైన, వెచ్చతనమిచ్చే బట్టతో చుట్టి తల్లికి అప్పచెప్పాలి. ఈలోగా తల్లి కొంత ప్రసవ జనిత అలసటనుండి కోలుకుంటూ ఉన్న తరుణంలో, మావి గర్భసంచి నుండి వేరు పడుతుంది. దానిని జాగ్రత్తగా బయటకు తీసి బయోమెడికల్ డిస్పోసబుల్ సంచిలో పడవేయాలి. ఈ పద్ధతులు ప్రాథమిక మైనవి, తప్పనిసరిగా పాటించవలసినవి. కాలక్రమేణా టాగ్ వేయడం, కంగారు కేర్, కార్డు బ్లడ్ హార్వెస్టింగ్, స్టెమ్ సెల్ సేకరణ వంటి ఆధునీకమైన, ప్రసూతి గదిలోనే జరగవల్సినవి, ప్రసవ సమయ సంరక్షణలో పొందు పరచబడ్డాయి. ఆసుపత్రి ప్రసవ నిర్వహణ నియమాలనుసారంగా, తల్లి-బిడ్డ పరంగా అవసరమయ్యే జాగ్రత్తలు తీసుకొని, బాధ్యతపూర్వకంగా ఇద్దరినీ, కుటుంబసభ్యుల పర్యవేక్షణలో, ప్రసవానంతర గదికి తరలించి, సంరక్షణనిచ్చే సిబ్బందికి వారిని అప్పచెప్పటంతో ప్రసవసమయ సంరక్షణ ముగుస్తుంది.
- డా|| మీరా, ఎం.డి. రిటైర్డ్ ప్రొఫెసర్, ఉస్మానియా మెడికల్ కాలేజ్