– ఫీజు బకాయిలపై చేతులెత్తేసిన సర్కారు
– నిరవధిక బంద్‌కు కాలేజీ యాజమాన్యాల పిలుపు
– చదువులపై తీవ్ర ప్రభావం
– లక్షలాది మంది పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్ధకం
– రూ.8,200 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ పెండింగ్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిల అంశం ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. సోమవారం నుంచి కాలేజీలను నిరవధిక బంద్ చేయనున్నట్టు యాజమాన్యాలు ప్రకటించాయి. విద్యార్థులు సోమవారం నుంచి కాలేజీలకు రావొద్దని కోరాయి. ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లను సకాలంలో ప్రభుత్వం ఫీజు బకాయిల చెల్లింపులపై చేతులెత్తేసింది. సంక్షేమ పథకాలు అమలు చేసేందుకే నిధులు సరిపోవడం లేదనీ, ఫీజు బకాయిల చెల్లింపునకు ఒక్క పైసా లేదని కాలేజీ యాజమాన్యాలకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. దీంతో సోమవారం నుంచి కాలేజీలకు తాళాలు వేస్తున్నట్టు యాజమాన్యాలు ప్రకటించాయి. అటు ప్రభుత్వం ఫీజు బకాయిలను చెల్లించకపోవడం, ఇటు యాజమాన్యాలు కాలేజీలను నిరవధిక బంద్‌కు పూనుకోవడంతో విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపుతున్నది. రాష్ట్రంలో డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్ సహా ఇతర వృత్తి విద్యా కోర్సులు చదువుతున్న లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్ధకంగా మారనుంది. ప్రభుత్వం, కాలేజీ యాజమాన్యాల నిర్ణయంతో విద్యార్థులే సమిధలుగా మారబోతున్నారు. విద్యార్థుల చదువులు, వారి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఫీజు బకాయిల సమస్యను వెంటనే పరిష్కరించాలని రాజకీయ పార్టీల నేతలు, విద్యావేత్తలు, విద్యార్థి సంఘాల నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా తీరని సమస్య
బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని సక్రమంగా అమలు చేయలేదన్న విమర్శలు వచ్చాయి. దీంతో అధికారంలోకి వస్తే ఫీజు రీయింబర్స్‌మెంట్ సమస్యను పరిష్కరిస్తామంటూ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో హామీ ఇచ్చింది. విద్యార్థులకు రూ.ఐదు లక్షల విద్యా భరోసా కార్డును ఇస్తామని ప్రకటించింది. అధికారంలోకి వచ్చి 20 నెలలు దాటినా అదీ నెరవేర్చలేదు. బడుగు, బలహీనవర్గాల పిల్లల ఉన్నత చదువుల కోసం ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని 2007లో నాటి సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రారంభించారు. ఆ పథకాన్ని మరింత పటిష్టంగా అమలు చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వంపైనే ఉన్నది. కానీ ఫీజు బకాయిల గురించి పట్టించుకోకపోవడం పట్ల ఇటు విద్యార్థులు, అటు కాలేజీ యాజమాన్యాల ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీఆర్‌ఎస్ హయాంలో సుమారు రూ.మూడు వేల కోట్ల వరకు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 2023-24 విద్యాసంవత్సరంలో రూ.2,600 కోట్లు, 2024-25 విద్యాసంవత్సరంలో రూ.2,600 కోట్లు కలిపి మొత్తం రూ.5,200 కోట్లు ఫీజు రీయింబర్స్‌మెంట్ పెండింగ్‌లో ఉన్నది. దీంతో రాష్ట్రంలో మొత్తం రూ.8,200 కోట్లు ఫీజు బకాయిలున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా ఆ సమస్య పరిష్కారం కాకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు.
విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వకుండా నిరాకరణ
ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను మూడు విద్యాసంవత్సరాల నుంచి రాష్ట్ర ప్రభుత్వం చెల్లించడం లేదు. దీంతో ఇంజినీరింగ్ సహా పలు వృత్తి విద్యా కోర్సుల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. వారికి కాలేజీ యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇవ్వకుండా నిరాకరిస్తున్నాయి. ఫీజు కడితేనే సర్టిఫికెట్లు ఇస్తామంటూ వేధిస్తున్నాయి. ఉన్నత విద్యామండలి, సాంకేతిక విద్యాశాఖ అధికారులు జోక్యం చేసుకుని కాలేజీ యాజమాన్యాలతో మాట్లాడినా ఫలితం అంతంత మాత్రమే. విద్యార్థులందరికీ న్యాయం జరగడం లేదు. దీంతో ఫీజు కట్టే స్థోమత లేక సర్టిఫికెట్లు చేతికి అందక ఎస్సీ,ఎస్టీ,బీసీ, మైనార్టీ, పేద పిల్లలు విద్యార్థులు ఉన్నత చదువులకు వెళ్లలేక, ఉద్యోగాలు చేసుకోలేక మానసిక వేదన అనుభవిస్తున్నారు. సర్టిఫికెట్ల కోసం అటు కాలేజీల చుట్టూ, ఇటు అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇంకోవైపు కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులకూ వేధింపులు తప్పడం లేదు. ఫీజు చెల్లిస్తేనే పరీక్షలకు అనుమతిస్తామనీ, హాల్‌టికెట్లు ఇస్తామని కాలేజీ యాజమాన్యాలు నోటీసులు జారీ చేస్తున్నాయి. దీంతో ఫీజు రీయింబర్స్‌మెంట్‌పైనే ఆధారపడిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రంలో ఏటా ఇంజినీరింగ్ సహా వృత్తివిద్యా కోర్సులతోపాటు మెడిసిన్, డిగ్రీ, పీజీ, ఇంటర్మీడియెట్ కలిపి సుమారు 5.50 లక్షల మంది కొత్తగా ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం దరఖాస్తు చేశారు. మరో 8.50 లక్షల మంది విద్యార్థులు రెన్యూవల్ కోసం దరఖాస్తులను సమర్పిస్తారు. దీంతో మొత్తం 14 లక్షల మంది విద్యార్థులు ఫీజురీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ కోసం దరఖాస్తు చేస్తారు. రాష్ట్ర ప్రభుత్వం ఫీజు బకాయిలను పెండింగ్‌లో ఉంచడంతో లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ఆగమ్యగోచరంగా మారుతున్నది. మరోవైపు మూడు విద్యాసంవత్సరాలుగా ఫీజు బకాయిలు ఉండడంతో కాలేజీ యాజమాన్యాలు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. అద్దె కట్టలేక, సిబ్బందికి జీతాలు చెల్లించలేక, అప్పుల భారం ఎక్కువై అవస్థలు పడుతున్నాయి.
ఫీజు బకాయిలు తక్షణమే విడుదల చేయాలి : టి నాగరాజు, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి
సోమవారం నుంచి ఇంజినీరింగ్, ఇతర వృత్తి విద్యా కాలేజీల నిరవధిక బంద్‌కు ఎస్‌ఎఫ్‌ఐ మద్దతు ప్రకటించింది. ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని మెరుగుపరుస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చి 20 నెలలు దాటినా ఫీజు బకాయిలకు, ఉద్యోగుల జీతాలకు డబ్బుల్లేవంటూ చెప్తున్నది. ఇది దుర్మార్గమైన విషయం. ఎమ్మెల్యేలు, మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధుల జీతాలు ఆపి అయినా ఫీజు బకాయిలను విడుదల చేయాలి. ఫీజు బకాయిలను విడుదల చేయకపోవడం వల్ల ఉత్తీర్ణులైన విద్యార్థులకు కాలేజీ యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు. కాలేజీ యాజమాన్యాలు సమ్మెకు దిగడం తెలంగాణలో మొదటిసారి. ఈ పరిస్థితి మరింత ఉధృతం కాకముందే ప్రభుత్వం చొరవ చేసి ఫీజులను విడుదల చేయాలి.
సర్కార్ నిర్లక్ష్యం వీడాలి : ఎండీ జావీద్, డీవైఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు
పెండింగ్‌లో ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి. విద్యారంగంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిర్లక్ష్యం వీడాలి. ఫీజులు విడుదల చేయకపోవడంతో ప్రయివేటు కాలేజీలు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నాయి. అధ్యాపకులకు జీతాలు చెల్లించలేక, కాలేజీల నిర్వహణ చేయలేక ఇబ్బందులు పడుతున్నాయి. విద్యారంగంపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే దసరాలోపు విద్యార్థులకు న్యాయం చేయాలి. లేదంటే రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులను సమీకరించి ఆందోళన కార్యక్రమాలు చేపడతాం.
విద్యార్థులే సమిధలు!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES