ప్రజలకు మేలు చేయని సీఎం పదవి నుండి రేవంత్ రెడ్డి తక్షణమే వైదొలగాలని బిఎస్పీ డిమాండ్..
నవతెలంగాణ – తిమ్మాజిపేట
తెలంగాణ రాష్ట్రం రైజింగ్ తెలంగాణ కాదని పోస్ట్ పోన్ తెలంగాణగా మారిందని బిఎస్ పి నాయకులు ఎద్దేవా చేశారు. సోమవారం బహుజన సమాజ్ పార్టీ (బిఎస్పీ) ఆధ్వర్యంలో జిల్లా కార్యాలయం గేట్ వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా బిఎస్పీ జిల్లా అధ్యక్షులు బోనాసి రాంచందర్ అడ్వకేట్ అధ్యక్షతన జరిగిన, ఈ కార్యక్రమంలో బిఎస్పీ అసెంబ్లీ నాగర్ కర్నూల్ అసెంబ్లీ ఇంచార్జీ కొత్తపల్లి కుమార్, జిల్లా ఇంచార్జీలు కళ్యాణ్, బీసమోళ్ళ యోసేఫ్, రాష్ట్ర మాజీ ఈసీ మెంబర్ పృధ్వీరాజ్, రాష్ట్ర మాజీ ప్రధాని కార్యదర్శి అంతటి నాగన్నలు మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి చెబుతున్నట్లు తెలంగాణ రాష్ట్రం రైజింగ్ తెలంగాణ కాదని పోస్ట్ పోన్ తెలంగాణగా మారిందని ఎద్దేవా చేశారు.
యూరియా అడిగితే పోస్ట్ పోన్, ఫీజు రీయింబర్స్మెంట్ అడిగితే పోస్ట్ పోన్, స్థానిక సంస్థల ఎన్నికలు అడిగితే పోస్ట్ పోన్, గ్రూప్ 1 పరీక్ష రద్దు గురించి అడిగితే పోస్ట్ పోన్, ఆరోగ్య శ్రీ బిల్లులు అడిగితే పోస్ట్ పోన్, గురుకులాల డైట్ బిల్లులు అడిగితే పోస్ట్ పోన్, ఇలా ప్రతి అంశం పోస్ట్ పోన్ చేస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని పోస్ట్ పోన్ తెలంగాణ గా మార్చారని దుయ్యబట్టారు. గ్రామ గ్రామాన గంజాయి దొరుకుతుందని, గ్రామగ్రామాన బెల్టు షాపుల ద్వారా మద్యం దొరుకుతుంది కానీ దేశానికి అన్నం పెట్టే రైతన్నకు మాత్రం యూరియా ఎందుకు దొరకదని విమర్శించారు. రైతువేదికల ద్వారా యూరియా ఎందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వలేకపోతున్నాయని నిలదీశారు. గతంలో రైతు వేదికలపై ఫొటోల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉబలాట పడ్డాయని ఇప్పుడు ఉన్న కేంద్ర ప్రభుత్వం యూరియా పై ఎందుకు శ్రద్ధ పెట్టడం లేదని ప్రశ్నించారు. కేంద్రం, రాష్ట్రం ఒకరిపై ఒకరూ నెట్టుకుని పంటకాలం అయిపోయాక యూరియా ఇస్తారా అనీ ప్రశ్నించారు.
అలగే ఫీజు రీ ఎంబర్స్మెంట్ విషయంలో ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం తాత్సారం చేస్తుందని మండిపడ్డారు. పేద విద్యార్థులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అన్ని కులాల పేద విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీ ఎంబర్స్మెంట్ ఇవ్వకపోవడాన్ని బహుజన సమాజ్ పార్టీ పేద విద్యార్థులను ఉన్నత చదువులకు దూరం చేసే కుట్రగా అర్ధం చేసుకోవాల్సి వస్తుందని ఆరోపించారు. గతంలో ఏకలవ్యున్ని బ్రోటన వేలును గురుదక్షిణగా అడిగినట్లుగా, చదువుకుంటే బహుజనుల చెవుల్లో సీసం పోసినట్టుగా భావించాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ లో ఉన్న ఫీజు రీ ఎంబర్మెంట్ను విడుదల చేసి బహుజన విద్యార్థుల పట్ల చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. గ్రూప్ 1 పరీక్ష విషయంలో హైకోర్టు తీర్పును అనుసరించి పరీక్షను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
జీఓ నం.29 బహుజన విద్యార్థుల మెడపై కత్తి లాంటిదని అన్నారు. ఏకపక్షంగా కొన్ని సెంటర్లు కేవలం మహిళలకు, కొన్ని సెంటర్లు కేవలం పురుషులకు కేటాయించడం అంటే అనుకూలురకు ఉద్యోగాలు ఇవ్వడం కోసమేనా అనీ నిలదీశారు. ప్రిలిమ్స్ కి ఒక హాల్ టికెట్, మెయిన్స్ కి ఇంకో హాల్ టికెట్ ఇవ్వడం వెనుక ప్రభుత్వం ఉద్దేశ్యం ఏంటని ప్రశ్నించారు. ప్రజలకు మేలు చేయని సీఎం పదవి రేవంత్ రెడ్డికి ఉంటే ఎంత, పోతే ఎంత అనీ అన్నారు. ప్రజలకు మేలు చేయడం రాకపోతే సీఎం పదవికి రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అట్లాగే బహుజనులు ఓట్ల చైతన్యం అయి సీఎం, పీఎం అయితేనే తప్ప బహుజనుల బ్రతుకులు మారవని స్పష్టం చేశారు. బహుజనుల రాజ్యాధికారమే అంతిమ లక్ష్యంగా బహుజనులు పోరాడాలని పిలుపునిచ్చారు.
ఆనంతరం కలెక్టర్ కార్యాలయం ఏవో చంద్రశేఖర్ కు వినతి పత్రం సమర్పించారు. ఇ కార్యక్రమంలో బిఎస్పీ వనపర్తి జిల్లా ఇంచార్జీ మిద్దె మహేష్, నాగర్ కర్నూల్ జిల్లా ఉపాధ్యక్షులు రామన్న, జిల్లా కోశాధికారి దాస్, వనపర్తి అసెంబ్లీ ఇంచార్జీ మండ్ల మైబుస్, అచ్చంపేట్ అసెంబ్లీ ఇంచార్జ్ కృపానందం, నాగర్ కర్నూల్, అచ్చంపేట్, కొల్లాపూర్ అసెంబ్లీ అధ్యక్షులు మడుపు నాగేష్, మల్లన్న, కురుమయ్య, నాయకులు రాజు, భాస్కర్, రాంచందర్, శంకర్, నాగేష్, శ్రీను, బాలనాగులు, బాలరాజ్, వెంకటేష్, శివరాజ్, శ్రీకాంత్, మధు, శేఖర్, వీరబాబు, రవి లు తదితరులు పాల్గొన్నారు.
