Monday, September 15, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మనువాదానికి వ్యతిరేకంగా పోరాడుదాం: సీపీఐ(ఎం)

మనువాదానికి వ్యతిరేకంగా పోరాడుదాం: సీపీఐ(ఎం)

- Advertisement -

సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ్మ..
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 

స్వార్ధ రాజకీయ ప్రయోజనాల కోసం నాటి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని హిందూ ముస్లింల ప్రజల మధ్యన జరిగిన మత ఘర్షణగా చిత్రీకరించడానికి మతోన్మాద బిజెపి ప్రయత్నిస్తుందని నాటి చరిత్రనే పూర్తిగా వక్రీకరిస్తుందని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ్మ విమర్శించారు. నాటి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుల స్ఫూర్తితో మనువాదానికి, మతోన్మాదానికి వ్యతిరేకంగా ప్రజలందరూ ఐక్యంగా ఉద్యమాలకు సిద్ధం కావాలని  పిలుపునిచ్చారు. సోమవారం భువనగిరి మండల పరిధిలోని నందనం గ్రామంలో సీపీఐ(ఎం) మండల కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారోత్సవాల్లో భాగంగా ఆనాటి పోరాటయోధుడు అమరజీవి కామ్రేడ్ కొల్లూరి పోచయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనమైన నివాళులు అర్పించిన అనంతరం వారి సతీమణి చంద్రమ్మ కి సన్మానం చేశారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యతిధిగా నర్సింహ్మ హాజరై,  మాట్లాడుతూ ఆనాడు హైదరాబాద్ సంస్థానంలోని తెలంగాణ పల్లెల్లో భూసాముల, జమీందారుల, జాగిర్దారుల దోపిడీ, దౌర్జన్యాలకు వ్యతిరేకంగా భూమికోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం అన్ని వర్గాల ప్రజలు కుల మతాలకతీతంగా సాయుధ రైతాంగ పోరాటం జరిగిందని తెలిపారు. సాయుధ రైతాంగ పోరాటంలో కమ్యూనిస్టులు ముందుండి ఉద్యమాన్ని నడిపి తమ ప్రాణాలను తృణప్రాయంగా అర్పించారని తెలియజేశారు. ప్రధానంగా గ్రామాలలో భూస్వాములు, జమీందార్లు, దేశ్ముకుల దోపిడీకి అణిచివేతకు వ్యతిరేకంగా దున్నేవాడికి భూమి కావాలని, భూస్వాముల దగ్గర ఉన్న భూములను పేదలకు పంచాలని, వెట్టి చాకిరి పోవాలని సబ్బండ జాతులతో పాటు వృత్తిదారులను ఐక్యం చేసి పోరాడిన చరిత్ర ఎర్ర జెండాలదని అన్నారు.

తెలుగు భాష అభివృద్ధి కోసం, కౌలుదారులకు రక్షణ కల్పించాలని, శిస్తును రద్దు చేయాలని ఉద్యమించిన చరిత్ర కూడా కమ్యూనిస్టులకు ఉన్నదని అన్నారు. ఆనాడు రైతాంగాన్ని దోచుకున్న భూస్వాములు, ప్రజలు పీడించినవారు దొరలు కూడా హిందువులేనని వీరికి అండగా నిలిచినా రజాకారులనేత ఖాసిం రజ్వీ ముస్లిం మతోన్మాదని, నిరంకుశ నిజాం రాజు కూడా ముస్లిమేనని హిందూ భూస్వాములు, ముస్లిం రాజు, రజాకార్లూలు కలిసి తెలంగాణ ప్రజలను పీడించడానికి దోపిడీ చేయడానికి మతం అడ్డు రాలేదని పరస్పరం బాగా సహకరించుకున్నారని తెలిపారు. వీరి దోపిడీకి వ్యతిరేకంగా పోరాడిన ప్రజలు మత భేదాలు పక్కనపెట్టి ఐక్యంగా తిరగబడ్డారని ఈ చరిత్రను బిజెపి తెలుసుకోవాలని అన్నారు. నాటి పోరాటంలో బలైన మమ్మద్ బందగి, కలం యోధుడు సోయాబుల్లాఖాన్, మఖ్దుం మోహినుద్దీన్ లాంటివారు ముస్లింలేనని తెలిపారు. నాటి పోరాటంలో బిజెపి, ఆర్ఎస్ఎస్ పాత్రలేదని ఏనాడు ఉద్యమంలో పాల్గొనలేదని చరిత్ర లేని చరిత్ర లేని మతోన్మాదులు చరిత్ర కలిగిన ఎర్ర జెండా పార్టీలను, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని వక్రీకరించడం చాలా దారుణమని ఈ బీజేపీ యొక్క తప్పుడు పద్ధతులను గ్రామ గ్రామాన ప్రజలకు తెలియజేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

నాటి తెలంగాణ సాయుధ పోరాట యోధుడు కొల్లూరి పోచయ్య గారి స్ఫూర్తితో మరో మారు భూ పోరాటాలకు సిద్ధం కావాలని నర్సింహ ప్రజలను కోరారు.  ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) మండల కార్యదర్శి పల్లెర్ల అంజయ్య , మాజీ మండల కార్యదర్శి బొల్లెపల్లి కుమార్ , మండల కార్యదర్శివర్గ సభ్యులు ఏదునూరి మల్లేశం, మండల నాయకులు గునుగుంట్ల శ్రీనివాస్, జిట్ట అంజిరెడ్డి, కొండపురం యాదగిరి, సీపీఐ(ఎం) గ్రామ శాఖ కార్యదర్శి కొల్లూరి సిద్దిరాజు, గ్రామ మాజీ సర్పంచ్ మోలుగు రాములమ్మ , గ్రామ నాయకులు, ప్రజలు కొండపురం పౌల్, సింగిరెడ్డి భూపాల్ రెడ్డి, కొండపురం శ్రీను, పొట్ట పెంటయ్య, మోలుగు బిక్షపతి, నాగరాజు, కొండపురం భాగ్యలక్ష్మి, కిష్టమ్మ, పద్మ, అల్లంపెల్లి సుగుణ, పోలపాక గణేష్, కొల్లూరి రాణి లు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -