పాకిస్తాన్ క్రికెట్ బోర్డు డిమాండ్
ఐసీసీకి లేఖ రాసిన పీసీబీ చీఫ్
దుబాయ్ (యుఏఈ) : ఆసియా కప్‌లో భారత్, పాకిస్తాన్ ముగిసినా.. వివాదాలు మాత్రం సద్దుమణగటం లేదు. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో భారత్, పాక్‌లు గ్రూప్ దశ మ్యాచ్‌లో ఆదివారం తలపడ్డాయి. ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో భారత్ 7 వికెట్ల తేడాతో గెలుపొందిన సంగతి తెలిసిందే. అయితే, భారత ప్రభుత్వం, బీసీసీఐ సూచనలతో టాస్ సమయంలో, మ్యాచ్ అనంతరం పాకిస్తాన్ ఆటగాళ్లతో భారత క్రికెటర్లు కరచాలనం చేయలేదు. టాస్ సమయంలో మ్యాచ్ రిఫరీ సమక్షంలో ఇరు జట్ల కెప్టెన్లు షేక్ హ్యాండ్స్ అనంతరమే.. టాస్ కాయిన్‌ను గాల్లోకి ఎగరేస్తారు. ఆదివారం నాటి భారత్, పాక్ మ్యాచ్‌లో అందుకు భిన్నంగా జరిగింది. భారత కెప్టెన్‌తో కరచాలనం చేసేందుకు ప్రయత్నం చేయవద్దని పాక్ కెప్టెన్ సల్మాన్ ఆగాకు మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ సూచించారని సమాచారం. ఈ విషయాన్ని పాక్ కెప్టెన్ టీమ్ మేనేజర్ దృష్టికి తీసుకెళ్లగా.. ఆయన పీసీబీకి తెలియజేశాడు. ఐసీసీ క్రమశిక్షణా నియమావళి, క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా ప్రవర్తించిన మ్యాచ్ రిఫరీని ఆసియా కప్ నుంచి తక్షణమే సస్పెండ్ చేయాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చీఫ్ మోషిన్ నక్వీ అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)కి లేఖ రాశాడు. ఆసియా కప్ నిర్వహణలో ఐసీసీ పాత్ర ఉండదు. కానీ మ్యాచ్ అధికారుల కేటాయింపు, మార్పుల అంశం ఐసీసీ పరిధిలోకి వస్తుంది. ఆసియా కప్ ఆతిథ్య దేశం బీసీసీఐ సైతం పీసీబీ లేఖ అంశంలో స్పందించాల్సి ఉంటుంది. మ్యాచ్ రిఫరీపై వేటు వేయకుంటే.. పాకిస్తాన్ ఆసియా కప్ నుంచి వాకౌట్ చేసేందుకు సిద్ధమనే వార్తలు సైతం వస్తున్నాయి. మోషిన్ నక్వీ ప్రస్తుతం ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) అధ్యక్షుడిగానూ కొనసాగుతున్నారు.