Tuesday, September 16, 2025
E-PAPER
Homeజాతీయంపోలవరం ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ అమలుకు తక్షణ చర్యలు తీసుకోవాలి

పోలవరం ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ అమలుకు తక్షణ చర్యలు తీసుకోవాలి

- Advertisement -

కేంద్ర మంత్రి సీఆర్‌ పాటిల్‌తో సీపీఐ(ఎం) బృందం భేటీ
త్వరలో కేంద్ర బృందాన్ని పంపిస్తామని మంత్రి హామీ


నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
పోలవరం ప్రాజెక్టుకు పునరావాసం, పరిహార (ఆర్‌అండ్‌ఆర్‌) ప్యాకేజీని అమలు చేయడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని సీపీఐ(ఎం) నేతలు డిమాండ్‌ చేశారు. సోమవారం నాడిక్కడ పోలవరం నిర్వాసితుల సమస్యలపై జలశక్తి మంత్రి సీఆర్‌ పాటిల్‌తో సీపీఐ(ఎం) బందం భేటీ అయ్యింది. కేంద్ర మంత్రికి రాజ్యసభ ఎంపీ జాన్‌ బ్రిట్టాస్‌, సీపీఐ(ఎం) ఏపీ రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, కేంద్ర కమిటీ సభ్యులు కె.లోకనాథం, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కిల్లో సురేంద్ర, ఎఎస్‌ఆర్‌ జిల్లా కార్యదర్శి బి.కిరణ్‌, ఏలూరు జిల్లా కమిటీ సభ్యులు డి.రమేష్‌తో కూడిన బృందం వివరణాత్మక వినతి అందజేసింది.

”పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణంలో అతి ముఖ్యమైన నిర్వాసితులకు ఆర్‌అండ్‌ఆర్‌ను అమలు చేయలేదు. పునరావాసంతో సహా మొత్తం ఖర్చు కేంద్ర ప్రభుత్వ బాధ్యత. ఎనిమిది మండలాల్లోని 392 గ్రామాల్లో 1,06,000 కుటుంబాలు మునిగిపోతున్నాయి. పూర్తి రిజర్వాయర్‌ స్థాయి (ఎఫ్‌ఆర్‌ఎల్‌) చేరుకున్నప్పుడు 2 నుంచి 3 లక్షల మంది ప్రజలు నిరాశ్రయులవుతారని అంచనాలు సూచిస్తున్నాయి. 2013 భూసేకరణ చట్టం ప్రకారం ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ ఇవ్వటం లేదు. ప్రాజెక్టు డీపీఆర్‌ అంచనా ప్రకారం ఆర్‌అండ్‌ఆర్‌కు దాదాపు రూ.33,000 కోట్లు ఖర్చవుతుంది. కానీ, ఇప్పటివరకు, ఆర్‌అండ్‌ఆర్‌కు కేవలం రూ. 5,200 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. ఇటీవల రూ.824 కోట్లు మంజూరయ్యాయి. కానీ ఈ నిధులలో ఎక్కువ భాగం ఇండ్ల నిర్మాణం కోసం కాంట్రాక్టర్లకు వెళ్లాయి. ఇది మొత్తం ప్రాజెక్ట్‌ నిర్వాసిత కుటుంబాలలో (పీడీిఎఫ్‌లు) దాదాపు 10 శాతం మాత్రమే కవర్‌ చేసింది. అది కూడా పాక్షికంగా ఉంది. ఈ ప్రాంతం రాజ్యాంగంలోని ఐదో షెడ్యూల్‌ కిందకు వస్తుందని గమనించాలి” అని సీపీఐ(ఎం) బందం పేర్కొంది.

”కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ ప్రాజెక్టును రెండు దశలుగా విభజించాయి. మొదటి దశలో 41.5 మీటర్ల స్థాయిలో 20 గ్రామాలు మాత్రమే మునిగిపోతాయని, దాదాపు 20,000 మంది నిర్వాసితులవుతారని అంచనా వేశాయి. కానీ ఇది వాస్తవం కాదు. గతంలో వరద స్థాయి 40మీటర్లకు చేరుకోవడానికి ముందే, 193 గ్రామాలు వరదల్లో మునిగిపోయాయి. అయితే ప్రజల నుంచి భారీ నిరసన వ్యక్తమవడంతో మునుపటి 20 గ్రామాలతో పాటు మరో 18 గ్రామాలు అదనంగా చేర్చారు. పునరావాస ఖర్చును రూ.20,980 కోట్లుగా నిర్ణయించారు. కానీ, 45.5 మీటర్ల స్థాయిలో మునిగిపోయే గ్రామాలన్నీ గతేడాది వరదల్లో మునిగిపోయాయని ప్రభుత్వం చెబుతోంది. ప్రాజెక్టు దశ లేదా కాంటూర్‌ స్థాయితో సంబంధం లేకుండా వరదలు అనేక గ్రామాలను ముంచెత్తాయి. ఈ వాస్తవాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విస్మరించాయి” అని సీపీఐ(ఎం) బృందం వివరించింది.

ముంపు గ్రామాల వాస్తవ నష్టం అంచనాకు కొత్త సర్వే చేపట్టాలి
”ప్రాజెక్ట్‌ నిర్వాసిత కుటుంబాలను పునరుద్ధరించడానికి నిర్మించిన కాలనీలన్నీ 2022 వరదల్లో మునిగిపోయాయి. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని ఐదు మండలాలు, ఏలూరు జిల్లాలోని మూడు మండలాలు నీటమునిగాయి. దీంతో వేలాది కుటుంబాలు నిరాశ్రయులయ్యాయి. చెప్పలేనన్ని కష్టాలను చవిచూశాయి. అందువల్ల, ఈ తప్పు సర్వేల అంచనాలన్నింటినీ తిరస్కరించాలి. 1986, 2022లో సంభవించిన వరదల అనుభవాల ఆధారంగా పునరావాసం కల్పించాలి. దాని కోసం మునిగిపోయిన గ్రామాల వాస్తవ నష్టాన్ని అంచనా వేయడానికి కొత్త సర్వే చేపట్టాలి” అని సీపీఐ(ఎం) డిమాండ్‌ చేసింది.

”2006లో ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్‌ కింద ఆనకట్ట నిర్మాణం 56శాతం పూర్తయినప్పటికీ, పునరావాసం 12 శాతం కూడా చేరుకోలేదు. చేపట్టిన పునరావాసం కూడా అనేక లోపాలతో నిండి ఉంది. ఇది నిర్వాసితులకు తీవ్ర ఇబ్బందులను కలిగిస్తుంది. కేంద్ర ప్రభుత్వం వెంటనే ఈ సమస్యలను పరిష్కరించి, చర్యలు తీసుకోవాలి” అని కోరింది.
– రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టును రెండు దశలుగా విభజించి, మొదట్లో 41.15 మీటర్ల నీటి నిల్వను కలిగి ఉంటుందని, మొదటి దశలో 38 గ్రామాలకు మాత్రమే పునరావాసం కల్పిస్తామని ప్రకటించింది. 2022 వరదల్లో ఈ కాంటూర్‌ లెక్కలు తప్పుగా నిరూపితమైంది. ప్రభావితమైన వారందరికీ ఒకే దశలో (45.75 మీటర్లు) పూర్తి పునరావాసం కల్పించాలి. భూమికి బదులు భూమి, ఇంటి నిర్మాణం, పూర్తి ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ అందించాలి. 2025 జులై నాటికి లేదా స్థానభ్రంశం ప్రారంభమైనప్పుడు 18 ఏండ్లు నిండిన ప్రతి వ్యక్తికి ప్యాకేజీ ఇవ్వాలి. గతంలో అమలు చేసిన పునరావాసంలో మినహాయించిన వివాహిత కుమార్తెలను కూడా చేర్చాలి.
– అధికారిక గణాంకాల ప్రకారం మొదటి దశ కిందకు వచ్చే 38,060 కుటుంబాలలో 12,658 కుటుంబాలకు మాత్రమే పునరావాసం కల్పించారు. మొత్తం ప్రభావిత కుటుంబాలు 1,06,000 ఉన్నాయి. 2017లో అధికారిక అంచనా ప్రకారం ప్రాజెక్టు మొత్తం వ్యయం రూ. 33,000 కోట్లుగా ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం దానిని 55,000 కోట్లకు నవీకరించమని కోరింది. పాత అంచనాల ప్రకారం, కేంద్ర ప్రభుత్వం ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీకి రూ. 33,000 కోట్లు అందించాలి. కానీ, ఇప్పటివరకు రూ. 5,900 కోట్లు మాత్రమే తిరిగి చెల్లించారు. అందువల్ల ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీకి ప్రాధాన్యతా ప్రాతిపదికన పూర్తి మొత్తాన్ని అందించాలి.
– మునిగిపోయిన గ్రామాలను గుర్తించడంలో తీవ్రమైన లోపాలు/వ్యత్యాసాలు జరిగాయి. ఒకే గ్రామంలో రోడ్డు ఒక వైపు మునిగిపోయినట్టు ప్రకటించారు. మరొక వైపు మునిగిపోలేదని పేర్కొన్నారు. కొన్ని ఇండ్లకు పరిహారం అందగా, మరికొన్నింటికి పరిహారం అందలేదు. దీన్ని సరిచేయాలి. ఉదాహరణకు వీఆర్‌పురం మండలంలోని రామవరం, చింతూరు మండలంలోని ముక్కునూరు ఉన్నాయి.

– గత రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విధంగా భూమికి పరిహారం ఎకరానికి రూ.26.5 లక్షలు ఉండాలి. ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ ప్రతి కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున అమలు చేయాలి. భూమికి భూమి పరిహారం విషయంలో సారవంతమైన, సాగు భూమిని కేటాయించాలి. సేకరించే భూమికి ఎకరానికి రూ. 20 లక్షలు మంజూరు చేయాలి.
– పునరావాస కాలనీలలో కనీస ప్రాథమిక సౌకర్యాలు కల్పించాలి. వీటిలో రక్షిత తాగునీరు, రోడ్లు, డ్రయినేజీ, వీధి దీపాలు, మరుగుదొడ్లు, రేషన్‌ దుకాణాలు, పాఠశాలలు, ఆస్పత్రులు, అంగన్‌వాడీ కేంద్రాలు, రవాణా శ్మశాన వాటికలు, అవసరమైన ఇతర సౌకర్యాలు ఉండాలి.
– మొదటి దశలో నిర్మించబోయే 75 కాలనీలలో 26 కాలనీలు మాత్రమే పూర్తయ్యాయి. నిర్మించిన ఇండ్లు లీక్‌ అవుతున్నాయి. దీనికి పరిహారం చెల్లించాలి. బాధ్యులైన కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలి.
– పునరావాస కాలనీలు, భూమికి భూమి పరిహారం కోసం 1/70 చట్టాన్ని ఉల్లంఘించి గిరిజన ఎన్టీఆర్‌ భూములను సేకరిస్తున్నారు. బదులుగా గిరిజనేతర భూ యజమానుల నుంచి భూమిని సేకరించాలి. గతంలో సేకరించిన భూములను చట్టవిరుద్ధంగా లీజుకు ఇచ్చారు. భూస్వాములు, ఉన్నత స్థాయి ప్రజా ప్రతినిధులు, అధికారులు అనుభవిస్తున్నారు. ఈ అవినీతిని ఆపాలి. ఇందులో పాల్గొన్న అవినీతిపరులపై చర్యలు తీసుకోవాలి. కొత్త భూ సేకరణలు ఈ అవినీతిని కొనసాగిస్తున్నాయి. దీనిని నిరోధించాలి. గ్రామసభ/పెసా సమావేశం తరువాత మాత్రమే భూ సేకరణ కొనసాగించాలి.

”అటవీ హక్కుల చట్టం కింద ”పోడు భూముల”కు పట్టాలు జారీ చేశారు. అయితే, పట్టాదారులకు పరిహారం ఇవ్వలేదు. వారి భూములు అటవీ భూములని వారికి చెబుతున్నారు. కానీ వాస్తవానికి ఈ భూములు చట్టబద్ధంగా గిరిజనుల యాజమాన్యంలో ఉన్నాయి. వీటికి అటవీ హక్కుల చట్టం కింద పట్టాలు జారీ చేయబడ్డాయి. దాని అమలులో చట్టం స్ఫూర్తిని ఉల్లంఘిస్తున్నారు. చట్టం దాని నిజమైన ఉద్దేశంతో అమలు చేయాలి. చట్టాన్ని అగౌరవపరిచే, గిరిజనులను వేధించే అధికారులపై చర్యలు తీసుకోవాలి” అని డిమాండ్‌ చేశారు. కాంటూర్‌ లెక్కల్లో తప్పులు, పునరావాస కాలనీల్లో మౌలిక సదుపాయాల గురించి కేంద్రమంత్రి సీఆర్‌ పాటిల్‌కు సీపీఐ(ఎం) నేతలు వివరించగా ఆయన స్పందిస్తూ త్వరలోనే నిపుణులతో కూడిన కేంద్ర బృందాన్ని పంపించి క్షేత్రస్థాయి పరిశీలన చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే కేంద్ర బృందాన్ని పంపించేందుకు చర్యలు తీసుకోవాలని జలశక్తి మంత్రిత్వ శాఖ జాయింట్‌ సెక్రెటరీ ప్రదీప్‌, ప్రాజెక్టుల కేంద్ర ప్రభుత్వ బాధ్యులు ప్రవీణ్‌ కుమార్‌కు సూచించారు. అనంతరం రాజ్యసభ ఎంపీ జాన్‌ బ్రిట్టాస్‌ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పోలవరం నిర్వాసితుల సమస్యలు పట్టించుకోవడం లేదని, పోలవరం నిర్వాసితుల సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -