Tuesday, September 16, 2025
E-PAPER
Homeజాతీయంఏపీలో యూటీిఎఫ్‌ 'రణభేరి'

ఏపీలో యూటీిఎఫ్‌ ‘రణభేరి’

- Advertisement -

రాష్ట్రంలో ఐదు ప్రాంతాల నుంచి జాతాలు ప్రారంభం
శ్రీకాకుళం జిల్లాలో అడ్డుకున్న పోలీసులు
రాష్ట్ర అధ్యక్షుడు సహా పలువురు అరెస్టు, విడుదల
19 వరకూ కొనసాగనున్న జాతాలు

చిత్తూరు: విద్యారంగ, ఉపాధ్యాయుల ఆర్థికపరమైన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ యుటిఎఫ్‌ రణభేరి మోగించింది. సోమవారం రాష్ట్రంలోని ఐదు ప్రాంతాల నుంచి జాతాలను ప్రారంభించింది. ఈ జాతాలు ఈ నెల 19 వరకూ కొనసాగనున్నాయి. తొలిరోజు ఆయా జాతాలకు ఉపాధ్యాయులు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో హాజరై స్వాగతం పలికారు. శ్రీకాకుళం జిల్లా పలాస ఆర్‌టిసి కాంప్లెక్స్‌ వద్ద యుటిఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు ఎన్‌.వెంకటేశ్వర్లు ఢంకా మోగించి రణభేరి జాతాను ప్రారంభించారు. కాశీబుగ్గ డిఎస్‌పి వి.వెంకట అప్పారావు, సిఐ సూర్యనారాయణ పోలీసు సిబ్బందితో అక్కడకు చేరుకొని సెక్షన్‌-30 అమల్లో ఉందని, జాతాకు అనుమతుల్లేవని అడ్డుకున్నారు. తాము శాంతియుతంగా కార్యక్రమం నిర్వహిస్తున్నామని యుటిఎఫ్‌ నాయకులు చెప్పినా డిఎస్‌పి అంగీకరించలేదు. దీంతో, యుటిఎఫ్‌ నాయకులు జాతాను కొనసాగించేందుకు ప్రయత్నించగా వెంకటేశ్వర్లు, యుటిఎఫ్‌ కోశాధికారి రెడ్డి మోహనరావు, రాష్ట్ర కార్యదర్శి కిషోర్‌ కుమార్‌, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎల్‌.బాబూరావు, బి.శ్రీరామ్మూర్తితోపాటు పలువురు నాయకులను పోలీసులు బలవంతంగా అరెస్టు చేసి కాశీబుగ్గ స్టేషన్‌కు తరలించారు. పోలీసుల తీరును నిరసిస్తూ యుటిఎఫ్‌ నాయకులు, ఉపాధ్యాయులు నినాదాలు చేశారు.

రెండు గంటల పాటు స్టేషన్‌లో నిర్బంధించి అనంతరం వారిని సొంత పూచీకత్తుపై పోలీసులు విడుదల చేశారు. ఆ తర్వాత జాతా కొనసాగింది.చిత్తూరు జిల్లా పలమనేరులో జాతాను మాజీ ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రమణ్యం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం విద్యారంగంలో చేసిన ప్రయోగాల దుష్పరిణామాలను సరిదిద్దాలని ఈ ప్రభుత్వానికి మొరపెట్టుకున్నా ఫలితం లేకుండా పోయిందన్నారు. పైగా, నూతన విద్యా విధానం పేరుతో పాఠశాలలను పునర్‌ వ్యవస్థీకరణ చేసిందని, దీంతో, తొమ్మిది రకాలైన పాఠశాలలు ఆవిర్భవించాయని వివరించారు. కొన్ని ఏకోపాధ్యాయ పాఠశాలలుగా మారాయని, మూడు లక్షల మంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ప్రైవేట్‌ పాఠశాలలకు మళ్లిపోయారని తెలిపారు. కర్నూలులో జాతాను జెండా ఊపి యుటిఎఫ్‌ రాష్ట్ర సహాధ్యక్షులు కె.సురేష్‌ కుమార్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని టిడిపి కూటమి ప్రభుత్వానికి విద్యా రంగం పట్ల చిన్నచూపు తగదన్నారు. ఎన్‌టిఆర్‌ జిల్లా జగ్గయ్యపేటలో జాతాను మాజీ ఎమ్మెల్సీ కెఎస్‌ లక్ష్మణరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయులకు, ప్రభుత్వోద్యోగులకు నాలుగు డిఎలు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. ఈ దసరాకి కనీసం రెండు డిఎలు ఇవ్వాలని, పిఆర్‌సి నియమించి మధ్యంతర భృతి ప్రకటించాలని, రిటైర్‌ ఉద్యోగులకు గత అక్టోబర్‌ నుంచి బకాయి ఉన్న గ్రాట్యూటీని వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేశారు.

యుటిఎఫ్‌ రాష్ట్ర సహాధ్యక్షులు ఎఎన్‌ కుసుమ కుమారి, రాష్ట్ర కార్యదర్శులు ఎస్‌పి మనోహర్‌ కుమార్‌, కె.ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లో పర్యటించే రణభేరి జాతాను తునిలో యుటిఎఫ్‌ సీనియర్‌ నాయకులు జి.సత్యనారాయణమూర్తి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ బొర్రా గోపిమూర్తి మాట్లాడుతూ గత ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలు పట్టించుకోకపోవడం వల్లనే తాము అధికారంలోకి వచ్చామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పుకుంటున్నారన్నారు. కానీ, అధికారం చేపట్టి ఏడాదిన్నరైనా నేటికీ ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించలేదని తెలిపారు. సుమారు రూ.20 వేల కోట్లను ఉపాధ్యాయ, ఉద్యోగులకు ప్రభుత్వం చెల్లించాల్సి ఉందన్నారు. ఈ యాత్రలో ఉపాధ్యాయులు తెలిపిన సమస్యలను డాక్యుమెంట్‌ రూపంలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని, శాసనమండలి సమావేశాల్లో ప్రస్తావిస్తానని తెలిపారు. ఎస్‌టిఎఫ్‌ఐ జాతీయ కార్యదర్శి కె.అరుణకుమారి మాట్లాడుతూ సిపిఎస్‌ రద్దు చేసి పాత పెన్షన్‌ విధానం పునరుద్ధరించాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే ఈ నెల 25న విజయవాడలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -