అక్రిడిటేషన్ పాలసీపై యాక్షన్ ప్లాన్ : మంత్రి పొంగులేటి
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినధి-హైదరాబాద్
ముఖ్యమంత్రి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమానికి కట్టుబడి ఉందని రాష్ట్ర రెవెన్యూ, గహనిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు అందేలా విధివిధానాలను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. సోమవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో హోంశాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ రవిగుప్తా, ప్రెస్ అకాడమీ ఛైర్మెన్ కె.శ్రీనివాసరెడ్డి, సమాచార శాఖ స్పెషల్ కమీషనర్ సీహెచ్ ప్రియాంక, సీపీఆర్‌వో జి. మల్సూర్‌తో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రధానంగా అక్రిడిటేషన్ పాలసీ, జర్నలిస్ట్‌ల హెల్త్ పాలసీ, జర్నలిస్టుల అవార్డులు, జర్నలిస్టులపై దాడులకు సంబంధించి హైపవర్ కమిటీ తదతర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జర్నలిస్టులపై దాడులు జరగకుండా ప్రభుత్వం అన్నీ చర్యలు తీసుకుంటుందని, ఇందుకోసం హై పవర్ కమిటీని కూడా పునరుద్దరించాలని నిర్ణయించినట్టు వెల్లడించారు.
ఇందుకు సంబంధించి ఉమ్మడి రాష్ట్రంలో 2008లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం జీవో జారీచేసిందనీ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ఆ ఊసే ఎత్తలేదని విమర్శించారు. అలాగే, జర్నలిస్టుల జీతభత్యాలకు సంబంధించి త్రైపాక్షిక కమిటీని కూడా పునరుద్దరిస్తున్నట్టు తెలిపారు. జర్నలిస్టుల హెల్త్ పాలసీపై సమగ్రంగా చర్చించామనీ, ఇన్సూరెన్స్ పాలసీలో ఏది జర్నలిస్టులకు ప్రయోజనకరంగా ఉంటుందో అనే అంశంపై ఆరోగ్యశ్రీ విభాగంతో కలిసి లోతైన అధ్యయనం చేయాలని అధికారులకు సూచించారు. అక్రిడిటేషన్ పాలసీపై కూడా సుదీర్ఘంగా చర్చించారు. జర్నలిస్టుల నుంచి దరఖాస్తులను స్వీకరించేందుకు ప్రత్యేక వెబ్‌సైట్‌ను తక్షణమే రూపొందించాలని అధికారులకు సూచించారు. జర్నలిస్టులకు అవార్డులను పునరుద్దరించాలని ప్రెస్ అకాడెమీ ఛైర్మెన్ శ్రీనివాస్‌రెడ్డి విజ్ఞప్తి పట్ల మంత్రి సానుకూలంగా స్పందించారు. ఈ సమావేశంలో ఆరోగ్యశ్రీ సీఈవో ఉదరుకుమార్, కార్మిక శాఖ అదనపు కమిషనర్ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.