– పరకాల ఇందిరా మహిళా డైరీ అవగాహన సదస్సులో
– పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి
నవతెలంగాణ -పరకాల : మహిళల ఆర్థిక అభివృద్ధి లక్ష్యంగా పరకాలలో “ఇందిరా మహిళా డైరీ” ఏర్పాటుకు శ్రీకారం చుట్టడం జరిగిందని. ప్రతి మహిళను పారిశ్రామికవేత్తగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కంకణం కట్టుకున్న నేపథ్యంలో, కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ కీలక ప్రణాళికలో భాగంగానే ఈ డైరీ ముందుకు వస్తోందని పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి తెలిపారు.ఈ మేరకు మంగళవారం పరకాల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో దామెర, ఆత్మకూరు, నడికూడ, పరకాల మండలాల ప్రాథమిక స్థాయి పాల ఉత్పత్తిదారుల సంఘాలతో జరిగిన సమావేశంలో రేవూరి ప్రకాశ్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ, మహిళల ఆర్థిక స్థిరత్వం కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తున్న వినూత్న కార్యక్రమాలలో డైరీ సంస్థాపన ఒక మహోన్నత ప్రయత్నమన్నారు. ప్రభుత్వ లక్ష్యంతో పాటు మహిళలు ఆర్థిక సాధికారికను సాధించాలంటే పాల ఉత్పత్తి, మార్కెటింగ్, యాజమాన్య బాధ్యతలపై గ్రామ స్థాయిలో పాల ఉత్పత్తిదారులు అవగాహన పెంపొందించుకొని బాధ్యతాయుతంగా డైరీ స్థాపనలో భాగస్వాములు కావాలన్నారు.
తాను ఎమ్మెల్యేగా గెలిచేందుకు మహిళలు చేసిన త్యాగం, అంకితభావానికి ఋణపడి ఉన్నానని, ఆ అప్పు తీర్చుకోవడమే ఈ డైరీ స్థాపనకు ప్రధాన కారణమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఇది కేవలం వ్యాపారం కాదని, సమాజ ఆర్థికాభివృద్ధి దిశగా మహా యజ్ఞమని వ్యాఖ్యానించారు.
డైరీ అభివృద్ధికి ప్రభుత్వం, అధికారులతో పాటు బాలవికాస లాంటి స్వచ్ఛంద సంస్థలు, ఎన్నారైలను సైతం భాగస్వాములను చేయిస్తూ వారి సహకారంతో గ్రామీణ మహిళల అభివృద్ధి కోసం కృషి చేయడం జరుగుతుందన్నారు.రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ డైరీ అభివృద్ధికి అంకిత భావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. పరకాలలో ప్రారంభమైంది ఒక పాల వ్యాపారం మాత్రమే కాదు, మహిళా సాధికారత వైపుగా ఒక ఉద్యమమని ఎమ్మెల్యే వ్యాఖ్యానించటం విశేషం.
మహిళల ఆర్థిక బలోపేతం లక్ష్యం:
మహిళా సంఘాలు ఆర్థికంగా బలపడాలంటే పాడిపరిశ్రమల అభివృద్ధి తప్పనిసరని, దీని ద్వారా కోట్లాది మహిళలను ఆత్మనిర్భరులుగా మార్చడం కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. నిజాయితీ, నిబద్ధతతో పెట్టుబడులు పెట్టిన ప్రతి గ్రామీణ మహిళను కోటీశ్వరురాలిగా తీర్చిదిద్దే ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని చెప్పారు.
ఆరోగ్యకరమైన జీవన విధానం దిశగా:
ప్రతి ఇంటికి ఆరోగ్యకరమైన ఆహారం, సమాజానికి సుసంపన్న జీవితం అందించడమే ఇందిరా మహిళా డైరీ ప్రధాన ఉద్దేశమని రేవూరి స్పష్టం చేశారు. మూడు మండలాల నుండి ప్రారంభమవుతున్న ఈ సమాఖ్య, భవిష్యత్‌లో మొత్తం పరకాల నియోజకవర్గానికి విస్తరించనుందన్నారు.
ఈ సన్నాహక సమావేశంలో డిఆర్డీఓ మేన శ్రీనివాస్,డిసిఓ సంజీవరెడ్డి,డివిఎహెచ్ఓ రాధాకృష్ణ,ట్రైనర్స్ యాకూబ్ నాయక్,రాజయ్య,ఆర్డీవో డా కె. నారాయణ,డిపిఎం సరిత,మండల సమైక్య అధ్యక్షులు,సిసిలు,ఎపిఎంలు,పరకాల ఇందిరా మహిళా డైరీ సోసైటీ ఎగ్జిక్యూటివ్ కమిటీ,మెంబర్స్, పాల ఉత్పత్తిదారులు, మహిళా సంఘాల ప్రతినిధులు, స్థానిక ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.