స్థానిక ఎన్నికలపై స్పష్టత కరువు
రిజర్వేషన్లపై ఆశావాహుల్లో ఆందోళన.
నవతెలంగాణ – మల్హర్ రావు
గ్రామ పంచాయతీ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయో..పాతరిజర్వేషన్లనే కొనసాగిస్తారా..కొత్త విధానం అవలంబిస్తారా..ఇలా పల్లెల్లో ఎక్కడ చూసినా చర్చ సాగుతోంది. పంచాయతీ పదవులపై కన్నేసిన ఆశావహులు ఓ వైపు రిజర్వేషన్ కలిసొస్తుందో లేదోనని ఆందోళన పడుతూనే, వర్తించకపోతే ఏం చేయాలోనని ప్రస్తుతం తర్జన భర్జన పడుతున్నారు. కొందరు ఆసక్తిగల నాయకులు తమ అనుచరగణంతో ఎన్నికలపై సమాలోచనలు జరుపుతున్నారు. మాజీ ప్రజాప్రతినిధులు సైతం తమ హయాంలో చేసిన అభివృద్ధి పనుల బిల్లులు రావాల్సి ఉన్నా.. వచ్చే ఎన్నికల్లో తమ ఉనికి చాటుకునేందుకు అవసరమైన వ్యూహాలు రచిస్తున్నారు.
కొత్త విధానమా.?
గత ప్రభుత్వం పంచాయతీ రిజర్వేషన్లు పదేళ్ల పాటు అమల్లో ఉండేలా గత ఎన్నికల సమయంలోనే చట్టం రూపొందించింది. ఆ చట్టం ప్రకారం పాత రిజర్వేషన్లనే కొనసాగించాల్సి ఉంటుంది. కానీ, ఈసారి కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని ప్రభుత్వం కొత్త విధానం అమలు చేసి తన మార్కు చూపెట్టుకుంటుందనే అభిప్రాయాలున్నాయి. అదే జరిగితే పాత రిజర్వేషన్ల చట్టాన్ని రద్దు చేసి కొత్తది రూపొందించాల్సి ఉంటుందని, అందుకు ఏ పద్ధతులను అమలు చేస్తారోననే ఉత్కంఠ ఆశావహుల్లో నెలకొంది. రిజర్వేషన్ల అమలు, పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవడం ఆందోళనకు గురిచేస్తోంది.
ఓటరు జాబితా తయారీ..
పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉండేలా ఎన్నికల సం ఘం ఇప్పటికే ఆదేశాలు ఇచ్చింది. దీంతో అధికార యంత్రాంగం ఓటరు తుది జాబితా తయారీ పూర్తి చేసింది. ఒకే కుటుంబానికి చెందిన వారంతా ఒకే పోలింగ్ బూత్ లో ఓటు హక్కు వినియోగించుకు నేలా చేశారు. ఫొటో ఓటరు జాబితా ప్రచురించిం ది. ఓటరు జాబితాపై అభిప్రాయ సేకరణ కోసం మండలస్థాయి రాజకీయ నాయకులతో సమావేశాలు నిర్వహించారు. పంచాయతీల వారీగా ఓటరు తుది జాబితాను ప్రచురించారు.