నిజాం కాలేజ్ ప్రిన్సిపాల్ ప్రొ.ఏవీ రాజశేఖర్
హైదరాబాద్ : నిత్యం పని ఒత్తిడితో సమమతమయ్యే పాత్రికేయులకు క్రీడలు నూతన ఉత్తేజాన్ని అందిస్తాయని నిజాం కాలేజ్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఏవీ రాజశేఖర్ అన్నారు. నవతెలంగాణ పదో వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్‌కు ముఖ్య అతిథిగా ఏవీ రాజశేఖర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘నవతెలంగాణ ప్రజల పత్రిక. ప్రజా సమస్యలు, విద్యా రంగ సమస్యలను నిజాయితీగా వెలుగులోకి తీసుకొచ్చే పత్రిక. పదో వార్షికోత్సవం సందర్భంగా పాత్రికేయులు, ఉద్యోగులకు శుభాకాంక్షలు. కలంతో పాత్రికేయ స్ఫూర్తి చూపించే జర్నలిస్ట్‌లు మైదానంలో క్రీడా స్ఫూర్తితో ఆటల పోటీల్లో తలపడటం హర్షణీయమని’ అన్నారు. నిజాం కాలేజ్ వైస్ ప్రిన్సిపాల్ ప్రొ.నాగేశ్వర్ రావు, స్టూడెంట్ డీన్ డాక్టర్ పాండయ్య, స్పోర్ట్స్ ఆఫీసర్ ప్రవీణ్ కుమార్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.