‘రేషన్’ కోసం 7 కిలోమీటర్లు
కాలినడకన వెళ్లి బియ్యం తెచ్చుకుంటున్న వృద్ధులు
నవతెలంగాణ-మహదేవపూర్
జయశంకర్- భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం చండ్రుపల్లి, నాగపెళ్లి గ్రామాల పరిధిలో సుమారు 400 రేషన్ కార్డులు(ఎస్సీ, ఎస్టీ) ఉన్నాయి. కానీ, అక్కడ రేషన్ షాపు లేదు. కాలినడకన 7కిలోమీటర్ల దూరంలో ఉన్న అన్నారం గ్రామ పంచాయతీకి వెళ్లి రేషన్ బియ్యం, నిత్యావసర సరుకులు తెచ్చుకోవాలి. ఐదేండ్ల కిందట అప్పటి సర్పంచ్ ఆధ్వర్యంలో గ్రామానికి సంబంధించిన రేషన్ బియ్యాన్ని గ్రామ పంచాయతీ ట్రాక్టర్ ద్వారా తీసుకొచ్చి పంపిణీ చేసేవారు. పాలకవర్గం పదవీకాలం పూర్తవ్వడంతో కార్యదర్శి పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. గ్రామ పంచాయతీకి సరిపడా నిధులులేవని, పైఅధికారులకు వివరించా మని చెబుతున్నారని వాపోతున్నారు. ఉమ్మడి అన్నారం గ్రామ పంచాయతీకి వెళ్లే మార్గమధ్యలో లో లెవెల్ వంతెనపై నీరు చేరడంతో కెనాల్ కాల్వ ద్వారా సుమారు 7 కిలోమీటర్లు కాలినడకన వెళ్లి రేషన్ తెచ్చుకుంటు న్నామని వృద్ధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం డీలర్‌ని నియమించి తమ గ్రామ పంచాయతీ లోనే రేషన్ సరుకులు ఇవ్వాలని స్థానిక మంత్రి డి.శ్రీధర్ బాబును, జిల్లా కలెక్టర్‌ను రెండు గ్రామాల ప్రజలు కోరుతున్నారు.