బైరాన్‌పల్లిని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలి
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి వారసులమని చెప్పుకునే వారికి భూములు పంచే దమ్ముందా?
అమరుల స్ఫూర్తితో ప్రజా సమస్యలపై ఉద్యమిస్తాం : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ
బైరాన్‌పల్లిలో అమరవీరుల సంస్మరణ సభ
అమరవీరుల స్థూపం వద్ద ఘన నివాళులు
నవతెలంగాణ-మద్దూరు
”భూమి కోసం.. భుక్తి కోసం, వెట్టిచాకిరీ నుంచి విముక్తి కోసం.. దున్నేవానికే భూమి కావాలని ఎర్రజెండా నాయకత్వంలో తెలంగాణ సాయుధ రైతాంగ వీరోచిత పోరాటం చేసింది కమ్యూనిస్టు పార్టీ.. భూస్వాముల నుంచి 10 లక్షల ఎకరాల భూములు స్వాధీనం చేసుకుని నిరుపేదలకు పంచిన ఘన చరిత్ర కమ్యూనిస్టులది.. ఆ పోరాటంతో ఏమాత్రం సంబంధం లేని బీజేపీ తామే వారసులమని చెప్పుకోవడం సిగ్గుచేటు.. చరిత్రను వక్రీకరిస్తే ప్రజలు క్షమించరు.. రాష్ట్రంలో 25 లక్షల ఎకరాల భూములు ఉన్నాయి.. వాటిని పేదలకు పంచే దమ్ముందా మీకు?” అని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ ప్రశ్నించారు. సిద్దిపేట జిల్లా దూల్మిట్ట మండలంలోని బైరాన్‌పల్లి గ్రామంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో అసువులు బాసిన అమరవీరుల స్థూపానికి మంగళవారం జాన్‌వెస్లీ, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు చుక్క రాములు పూలమాల వేసి నివాళులర్పించారు. అక్కడి నుంచి ర్యాలీగా బురుజు వద్దకు చేరుకున్నారు. అనంతరం బురుజుపై ఎర్రజెండాను ఆవిష్కరించారు. బురుజు ముందు చుక్కరాములు సీపీఐ(ఎం) జెండాను ఎగురవేశారు.
అనంతరం సీపీఐ(ఎం) జిల్లా కార్య దర్శి ఆముదాల మల్లారెడ్డి అధ్యక్షతన జరిగిన అమరవీరుల సంస్మరణ సభలో జాన్‌వెస్లీ ప్రసం గించారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నైజాం పాలనకు వ్యతిరేకంగా.. రజాకార్లు, భూ స్వాములు, దేశముఖ్‌లకు వ్యతిరేకంగా, ప్రజలకు అండగా సాగిందని తెలిపారు. కమ్యూనిస్టులు ప్రాణాలను త్యాగం చేసి పోరాడారని చెప్పారు. అన్ని వర్గాల ప్రజలను ఐక్యం చేసి కుల మతాలకతీతంగా నడిపిన గొప్ప వర్గ పోరాటం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటమన్నారు. రజాకార్లు గ్రామాలపై దాడులు చేసి.. ఒకేరోజు 96 మందిని బైరాన్‌పల్లి బురుజు వద్ద, కూటిగల్ గ్రామంలో 22 మందిని కాల్చి చంపారని, ఊచకోత కోశారని గుర్తు చేశారు. అయినా, ప్రజలు వెనకడుగు వేయకుండా కమ్యూనిస్టుల నాయకత్వంలో ఎర్రజెండా చేతబట్టుకుని పోరాడారని కొనియాడారు.
పోరాటాన్ని వక్రీకరించి లబ్ది పొందే యత్నం
ఈ ప్రాంతంలోని ప్రతి గ్రామంలో త్యాగాల చరిత్ర ఉందని జాన్‌వెస్లీ తెలిపారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ ఈ పోరాటాన్ని వక్రీకరించి రాజకీయ లబ్ది పొందాలని దొంగ నాటకాలు ఆడుతున్నా యని విమర్శించారు. ఇలాంటి వారికి ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి వారసులమైన కమ్యూనిస్టులుగా.. నాటి నుంచి నేటి వరకు అన్ని వర్గాల ప్రజల పక్షాన పోరాడు తుంది ఎర్రజెండా మాత్రమేనన్నారు. ప్రజాసమస్యల పరిష్కారం కోసం కార్మికులు, రైతులు, కూలీలు, వృత్తిదారులు, అన్ని వర్గాల ప్రజలను ఐక్యం చేసి ఉద్యమాలు నిర్మిస్తామని తెలిపారు.
హామీలను అమలు చేయని రాష్ట్ర ప్రభుత్వం
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేముందు ప్రజలకు అనేక హామీలు ఇచ్చిందని, ఏ ఒక్క హామీని పూర్తిగా అమలు చేయడం లేదని జాన్‌వెస్లీ అన్నారు. బైరాన్‌పల్లి గ్రామాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని, అర్హులైన పోరాట యోధులందరికీ పింఛన్లు మంజూరు చేయాలని ప్రభు త్వాన్ని డిమాండ్ చేశారు. బైరాన్‌పల్లి గ్రామంలో అర్హులుగా గుర్తించిన వారికి కూడా పింఛన్ ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. అంతకుముందు వల్లంపట్ల గ్రామంలో వేల్పుల దేవయ్య స్థూపానికి జాన్‌వెస్లీ, చుక్క రాములు పూలమాలవేసి నివాళులర్పించారు. సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ స భ్యులు చుక్క రాములు మాట్లాడుతూ సాయుధ పోరాట స్ఫూర్తితో ప్రజా ఉద్యమాలను మరింత సమరశీలంగా ముందుకు తీసుకెళ్లాలని పిలుపు నిచ్చారు. బైరాన్‌పల్లి పోరాట వీరుల స్మృతిగా ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని ఇచ్చిన హామీ ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదన్నారు.
ఈ సభలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు ఉడుత రవీందర్, సీనియర్ నాయకులు నక్కల యాదవ రెడ్డి, సిద్దిపేట జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కాముని గోపాలస్వామి, రాళ్ల బండి శశిధర్, శెట్టిపల్లి సత్తిరెడ్డి, గొడ్డుబర్ల భాస్కర్, నాయకులు కొంగరి వెంకట మావో, ఆలేటి యాదగిరి, బండ కింది అరుణ్ కుమార్, తాడూరి రవీందర్, బద్దిపడగ కృష్ణారెడ్డి, చొప్పరి రవి కుమార్, అత్తిని శారద, జాలిగపూ శిరీష, అమ్ముల బాల నరసయ్య, దాసరి ప్రశాంత్, చేర్యాల పట్టణ కార్యదర్శి రాళ్ల బండి నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.