Wednesday, September 17, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంమా పిల్లల భవిష్యత్‌తో రాజకీయాలు వద్దు

మా పిల్లల భవిష్యత్‌తో రాజకీయాలు వద్దు

- Advertisement -

నిరాధార ఆరోపణలు జీవితాలను చిన్నాభిన్నం చేస్తాయి
గ్రూప్‌-1 క్వాలిఫైడ్‌ అభ్యర్థుల తల్లిదండ్రుల ఆవేదన

నవతెలంగాణ-బంజారాహిల్స్‌
”మా పిల్లల భవిష్యత్‌తో రాజకీయాలు వద్దు. నిరాధార ఆరోపణలతో జీవితాలను చిన్నాభిన్నం చేయొద్దు” అంటూ గ్రూప్‌-1 క్వాలిఫైడ్‌ అభ్యర్థుల తల్లిదండ్రులు విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం వారు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రూ.3 కోట్లు ఇచ్చి ఉద్యోగాలు కొనుక్కున్నారని కొందరు ఆరోపణలు చేస్తున్నారని, అది నిరూపించాలని సవాల్‌ విసిరారు. ”మాకు అంత స్థోమతే లేదు.. అప్పులు చేసి, పూట గడవని పరిస్థితుల్లోనూ ఎన్నో త్యాగాలు చేసి పిల్లలను చదివించాం. ఇప్పుడు మా పిల్లల విజయాన్ని రాజకీయ లబ్ది కోసం మసకబార్చకండి” అని విజ్ఞప్తి చేశారు. పోస్టులు కొనుక్కున్నామన్న ఆరోపణలపై ఎలాంటి విచారణకైనా తాము సిద్ధంగా ఉన్నామని, అదే నిజమని తేలితే తమకు ఉద్యోగాలు అవసరం లేదని, ఆత్మహత్యకైనా తాము సిద్ధమని అన్నారు.

తమ పిల్లలు కష్టపడి సాధించిన విజయంపై అసత్య ప్రచారాలతో మనోధైర్యాన్ని దెబ్బతీయొద్దని కోరారు. పాచి పనులు, కూలి పనులు చేసుకుంటూ బతికే తాము మూడు కోట్లు ఇచ్చామంటే ఎవరు నమ్ముతారని, వాటికి ఎన్ని సున్నాలుంటాయో కూడా తెలియదని అన్నారు. తమ పిల్లలు ఎంతో కష్టపడి గ్రూప్‌-1 ర్యాంక్‌ సాధించారని, కొన్ని ఇన్‌స్టిట్యూట్‌లు వారిని సన్మానం పేరుతో తీసుకెళ్లి ఈ కుట్రలో భాగస్వాములు అయ్యారేమో అని అనుమానాన్ని వ్యక్తపరిచారు. తమకు న్యాయస్థానంపై పూర్తి నమ్మకం ఉందన్నారు. హైకోర్టు తమకు న్యాయం చేయాలని కోరారు. ఈ సమావేశంలో జంగారెడ్డి, లలిత, ఆనంద్‌ కుమార్‌, సీతా, పావని, సోనియా తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -