నవతెలంగాణ-హైదరాబాద్: ఎస్ఐఆర్ పేరుతో బీహార్‌లో కేంద్ర ఎన్నికల సంఘం ఓట్ల చోరీకి పాల్పడిందని ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ గళమెత్తిన విషయం తెలిసిందే. ఆగస్టు 17న ఓటర్ అధికార్ యాత్ర పేరుతో చంపారన్ నుంచి మొదలు పెట్టి పలు జిల్లాల మీదగా యాత్ర కొనసాగి సెప్టెంబర్ 1న గాంధీ మైదాన్‌లో ముగిసింది. ఈ యాత్ర బీహార్‌లో 25 జిల్లాల వ్యాప్తంగా.. 110 అసెంబ్లీ నియోజకవర్గాలను కవర్ చేస్తూ.. 1300 కిలోమీటర్లు సాగింది. ఆ యాత్రకు విశేష జనాదరణ లభించింది. రాహుల్ గాంధీ, తేజిస్వీ యాదవ్ నిర్విరామంగా ఈసీ ఓట్ల చోరీ ఉదంతాన్ని ఆ రాష్ట్ర ప్రజలకు తెలియజేయడంలో విజయవంతమైయ్యారు. ఇండియా బ్లాక్ కూటమి నేతలతో పాటు అనేక మంది యాత్రలో పాల్గొన్నారు.
తాజాగా మరోసారి ఈ ఓటర్ అధికార్ యాత్రను రాష్ట్రీయ జనతా దళ్ సీనియర్ నేత తేజిస్వీ యాదవ్ పునర్ ప్రారంభించారు. ఈరోజు జెహానాబాద్‌లో నుంచి ఓటర్ అధికార్ యాత్రను ప్రారంభించారు. ఈ యాత్రలో భాగంగా ఆయన రాహుల్ గాంధీ కవర్ చేయని మిగిలిన జిల్లాల మీదగా ఈ యాత్ర కొనసాగనుంది. జెహానాబాద్, బెగుసరాయ్, ఖగారియా, మాధేపురాఆయా జిల్లాల మీదగా ఓటర్ అధికార్ యాత్ర కొనసాగతుంది.సెప్టెంబర్ 20న వైశాలిలో ఓటర్ అధికార్ యాత్ర ముగుస్తుంది.
ఈ యాత్ర ద్వారా ప్రధానంగా బీహార్ లో నెలకొన్న నిరుద్యోగం, మహిళ హక్కుల సాధన, నాణ్యమైన విద్య కల్పన, టీచర్ల ఆత్మగౌరవం, పారిశ్రామికంగా వెనుకబాటు తదితర అంశాలపై తేజస్వీయాదవ్ ప్రసంగించనున్నారు. అభివృద్ధి చెందిన బీహార్‌ను నిర్మించాలనే కొత్త సంకల్పంతో ఆయన ఈ ప్రయాణం చేపట్టారని ఆర్జేడీ శ్రేణులు దీమా వ్యక్తం చేస్తున్నారు. బీహార్ రాష్ట్ర ప్రజలు రానున్న ఎన్నికల్లో తేజిస్వీ యాదవ్ కు ఆఖండ విజయాన్ని అందిస్తారని ఆశిస్తున్నారు.