జ్ఞానం నిర్మాణం అవుతున్న చోట.. అజ్ఞానం ఏలా
– విద్యాలయంలో క్షుద్ర పూజలు కలకలం
– భయాందోళనకు గురైన విద్యార్థులు, ఉపాధ్యాయులు
– విచారణ చేపట్టి.. అవగాహన సదస్సు నిర్వహించిన ఎస్ఐ
నవతెలంగాణ – రాయపర్తి
మూఢ నమ్మకం నుండి సైన్స్ వైపు.. అజ్ఞానం నుండి జ్ఞానం వైపు వ్యవస్థ ప్రయాణిస్తూ విశ్వాన్ని చుట్టు వస్తుంటే కొందరు మూర్ఖత్వ గుదిబండలై క్షుద్ర పూజలు అంటూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్న ఘటన మండలంలో బుధవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే మండలంలోని మైలారం ప్రభుత్వ పాఠశాలలో తరగతి గది ముందు గుర్తు తెలియని వ్యక్తులు పసుపు, కుంకుమ, నిమ్మకాయలతో క్షుద్ర పూజలు చేసిన ఆనవాళ్లు ఉండడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు భయాందోళనకు గురయ్యారు.
సమాచారం తెలుసుకున్న ఎస్సై ముత్యం రాజేందర్ పాఠశాలకు చేరుకొని క్షుద్ర పూజల మానవాలను పరిశీలించారు. తదుపరి విద్యార్థులకు మూఢ నమ్మకాలపై అవగాహన కల్పిస్తూ.. క్షుద్ర పూజలు ఆకతాయి చేసే పనిని వాడిని నమ్మి భయాందోళనకు గురి కావద్దని తెలిపారు. అజ్ఞానంగా ఉన్నవారు ఇలాంటి వాటిని నమ్ముతారని విద్యావంతులైన మీరు ఇలాంటివి చూసి నవ్వాలి తప్ప భయపడకూడదు అని హితబోధ చేశారు. పాఠశాలలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. క్షుద్ర పూజల తతంగానికి పాల్పడ్డ వారిని పట్టుకొని చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.