Thursday, September 18, 2025
E-PAPER
Homeజాతీయంక్యాన్సర్‌ కోరల్లో మహిళలు

క్యాన్సర్‌ కోరల్లో మహిళలు

- Advertisement -

పురుషుల్లో పెరుగుతున్న మరణాలు
న్యూఢిల్లీ : మన దేశంలో మహిళలు ఎక్కువగా క్యాన్సర్‌ బారిన పడుతున్నారు. కానీ క్యాన్సర్‌ మరణాలు మాత్రం పురుషుల్లోనే అధికంగా కన్పిస్తున్నాయి. ఇటీవల జరిపిన ఓ అధ్యయనం ఈ విషయాన్ని వెల్లడించింది. కొత్తగా నమోదవుతున్న క్యాన్సర్‌ కేసుల్లో సగానికి పైగా మహిళలకు సంబంధించినవేనని ఆ అధ్యయనం తెలిపింది. 2022లో ప్రపంచంలోని ప్రతి లక్ష జనాభాలోనూ సగటున 197 మంది క్యాన్సర్‌కు గురయ్యారు. ఆ ఏడాది ప్రపంచవ్యాప్తంగా రెండు కోట్ల క్యాన్సర్‌ కేసులు నమోదయ్యాయి. 1.03 కోట్ల మంది పురుషులు, 97 లక్షల మంది మహిళలకు క్యాన్సర్‌ సోకింది. అమెరికాలో క్యాన్సర్‌ జీవితకాల ముప్పు పురుషులు, మహిళలకు దాదాపు సమానంగానే ఉన్నదని అమెరికన్‌ క్యాన్సర్‌ సొసైటీ తెలిపింది.

ఈ ప్రమాదాలు అధికం
మన దేశంలో మహిళలు సాధారణంగా రొమ్ము, గర్భాశయ, అండాశయ క్యాన్సర్‌కు గురవుతున్నారు. మహిళలకు సోకే క్యాన్సర్లలో 40 శాతం రొమ్ము, గర్భాశయ సంబంధమైనవే. గర్భాశయ క్యాన్సర్‌ ఎక్కువగా హ్యూమన్‌ పాపిల్లో మావైరస్‌ (హెచ్‌పీవీ) వంటి ఇన్‌ఫెక్షన్లతో ముడిపడి ఉంటుంది. రొమ్ము, అండాశయ క్యాన్సర్లు తరచుగా హార్మోన్ల కారకాలతో ప్రభావితమవుతాయి. హార్మోన్ల కారణంగా పెరుగుతున్న క్యాన్సర్‌ కేసులకు జీవన శైలిలో వస్తున్న మార్పులతో కూడా సంబంధం ఉంటుంది. గర్భధారణ ఆలస్యం కావడం, తల్లిపాలు తగ్గిపోవడం, ఊబకాయం, శారీరక శ్రమ తక్కువగా ఉండడం వంటి జీవన శైలిలో వస్తున్న మార్పులు క్యాన్సర్‌ వ్యాధికి కారణమవుతున్నాయి.

జీవనశైలే కారణం
పురుషుల విషయానికి వస్తే నోరు, ఊపిరితిత్తులు, ప్రొస్టేట్‌ క్యాన్సర్లు ఎక్కువగా కన్పిస్తుంటాయి. పొగాకు వినియోగం నివారించగల 40 శాతం క్యాన్సర్లకు దారితీస్తుంది. పొగాకు సంబంధిత ఉత్పత్తుల వినియోగం కారణంగా ప్రధానంగా నోరు, ఊపిరితిత్తుల క్యాన్సర్లు వస్తాయి. అవగాహన కల్పించడం, సౌకర్యాలను మెరుగుపరచడం వంటి కార్యక్రమాల ద్వారా మహిళల్లో వచ్చే సాధారణ క్యాన్సర్లను ముందుగానే గుర్తించవచ్చు. క్యాన్సర్‌ను సకాలంలో గుర్తిస్తే చికిత్స అందించడం సులభమవుతుంది. ఫలితంగా మరణాల రేటు తగ్గుతుంది. పురుషులకు వచ్చే క్యాన్సర్లు వారి జీవనశైలితో ముడిపడి ఉంటాయి. పొగాకు, మద్యం వినియోగం కారణంగా ఊపిరితిత్తులు, నోటి క్యాన్సర్లు సోకుతాయి. ఈ రెండు రకాలూ ప్రాణాంతకమైనవి. చికిత్సకు సులభంగా లొంగవు. పురుషులు సహజంగానే వ్యాధిని నిర్లక్ష్యం చేస్తారు. పరీక్షలు చేయించుకోవడం, వైద్య సాయం కోరడం తక్కువే. అందుకే మహిళలతో పోలిస్తే పురుషుకు క్యాన్సర్‌ వ్యాధి తక్కువగానే సోకినా మరణాలు ఎక్కువగా సంభవిస్తుంటాయి.

ఆరోగ్య పరీక్షలపై అశ్రద్ధ
‘ప్రజారోగ్య ప్రచారంలో మహిళల ఆరోగ్యం పైనే ఎక్కువ దృష్టి పెడతారు. అది రెండు వైపులా పదును ఉన్న కత్తి. అవగాహన కల్పించడం, స్క్రీనింగ్‌ పరీక్షలు నిర్వహించడం వంటి చర్యలతో క్యాన్సర్‌ను ముందుగానే గుర్తించవచ్చు’ అని క్యాన్సర్‌ నిపుణుడు, సెంటర్‌ ఫర్‌ హెల్త్‌ ఇన్నొవేషన్‌ అండ్‌ పాలసీ ఫౌండేషన్‌ అధిపతి రవి మహ్రోత్రా చెప్పారు. మహిళలు తరచుగా ఆరోగ్య పరీక్షలు చేయించుకుంటారు కాబట్టి ఏదో ఒక దశలో వ్యాధిని నిర్ధారించవచ్చునని, అదే పురుషులు తమ జీవితకాలంలో ఒక్కసారి కూడా పరీక్ష చేయించుకోరని ఆయన తెలిపారు. అందుబాటులో ఉన్న డేటా ప్రకారం మన దేశంలో ప్రతి వంద మందిలోనూ 11 మందికి తమ జీవితకాలంలో ఎప్పుడో ఒకప్పుడు క్యాన్సర్‌ వచ్చే ప్రమాదం ఉంది. గత సంవత్సరం చివరి నాటికి దేశంలో 1.56 మిలియన్‌ కేసులు నమోదయ్యాయని, 8.74 లక్షల మరణాలు సంభవించాయని అంచనా.

సంపన్న దేశాలతో పోలిస్తే…
సంపన్న దేశాలలో 12 మంది మహిళల్లో ఒకరికి రొమ్ము క్యాన్సర్‌ ఉన్నట్లు నిర్ధారణ అయింది. అయితే ప్రతి 71 మందిలో ఒకరు మాత్రమే ఈ వ్యాధి బారిన పడి చనిపోతున్నారు. అదే పేద దేశాలలో ఇందుకు భిన్నమైన పరిస్థితి కన్పిస్తోంది. అక్కడ ప్రతి 27 మందిలో ఒకరికి మాత్రమే రోగ నిర్ధారణ జరుగుతోంది. అయినప్పటికీ ప్రతి 48 మందిలో ఒకరు ఈ వ్యాధితో మరణిస్తున్నారు. అమెరికాలో స్థానికంగా నివసించే వారు ఎక్కువగా క్యాన్సర్‌ మరణాలకు గురవుతున్నారు. మూత్రపిండాలు, కాలేయం, కడుపు, గర్భాశయ క్యాన్సర్‌ మరణాలు శ్వేతజాతీయుల్లో కంటే వీరిలోనే ఎక్కువగా సంభవిస్తున్నాయి. అమెరికన్‌ క్యాన్సర్‌ సొసైటీ అందించిన వివరాల ప్రకారం నల్ల జాతీయుల్లో ప్రొస్టేట్‌, కడుపు, గర్భాశయ క్యాన్సర్‌ మరణాలు శ్వేతజాతీయుల్లో కంటే ఎక్కువ. మన దేశంలో క్యాన్సర్‌ ముప్పు పెరగడమే కాకుండా పరిస్థితి క్లిష్టంగా మారుతోంది. ఏదేమైనా ఆరోగ్యకరమైన ఆహార వినియోగం, అలవాట్లు, ముందస్తు రోగ నిర్ధారణ, జీవనశైలిలో మార్పుల ద్వారా క్యాన్సర్‌ బారి నుంచి బయటపడవచ్చునని నిపుణులు సూచించారు.

ఈ ప్రాంతాల్లో ముప్పు అధికం
కొండ ప్రాంతాలు, మారుమూల ఈశాన్య ప్రాంతాలు కాన్సర్‌ వ్యాధికి స్థావరాలుగా మారుతున్నాయి. మిజోరం రాష్ట్రంలోని ఐజ్వాల్‌ జిల్లాలో జాతీయ సగటు కంటే రెండు రెట్లు ఎక్కువగా క్యాన్సర్‌ ప్రమాదం పొంచి ఉంది. జీవనశైలిలో వస్తున్న మార్పులే దీనికి ప్రధాన కారణం. ఎందుకంటే ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఈశాన్య ప్రాంతంలో పొగాకు వినియోగం ఎక్కువ. అస్సాంలోని బరాక్‌ లోయలో పొగాకును ఎక్కువగా నములుతారు. ఇది మిజోరంకు కేవలం పాతిక కిలోమీటర్ల దూరంలోనే ఉంది. పొగతాగడం, ఆల్కహాల్‌ తీసుకోవడం ఈ ప్రాంతంలో సర్వసాధారణం. ఆహార ఎంపికలు, తయారీ క్యాన్సర్‌ ప్రమాదాన్ని పెంచుతాయి. జమ్మూకాశ్మీర్‌లోని శ్రీనగర్‌లో పురుషుల్లో ఊపిరితిత్తుల క్యాన్సర్‌ ఎక్కువగా ఉంది. దక్షిణ హైదరాబాదులో రొమ్ము క్యాన్సర్‌ అధికంగా కన్పిస్తుంది. ఇతర ప్రాంతాలతో పోలిస్తే రాజధాని ఢిల్లీలో పురుషులు అనేక రెట్లు ఎక్కువగా క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. దేశంలో నోటి క్యాన్సర్‌ కేసులు కూడా పెరుగుతున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -