Thursday, September 18, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంసుంకాల కేసు గెలిస్తే…

సుంకాల కేసు గెలిస్తే…

- Advertisement -

ప్రపంచంలోనే అమెరికా సంపన్న దేశం అవుతుంది : ట్రంప్‌

వాషింగ్టన్‌ : వాణిజ్య భాగస్వామ్య దేశాలపై తాను విధించిన సుంకాల విషయంలో సుప్రీంకోర్టులో జరుగుతున్న న్యాయ పోరాటంలో విజయం సాధిస్తే ప్రపంచంలోనే అమెరికా సంపన్న దేశంగా అవతరిస్తుందని దేశాధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ చెప్పారు. సుప్రీంకోర్టు తీర్పు అనుకూలంగా వస్తే చర్చలు జరిపేందుకు తమకు విశేషాధికారాలు దఖలు పడతాయని తెలిపారు. ‘సుప్రీంకోర్టులో మేము కేసు గెెలిస్తే సుంకాలు ఖరారవుతాయి. ఫలితంగా ప్రపంచ దేశాలన్నింటిలోనూ మేమే సంపన్న దేశంగా ఆవిర్భవిస్తాం. వాణిజ్య భాగస్వాములతో చర్చలు జరపడానికి మాకు అద్భుతమైన అధికారాలు సంక్రమిస్తాయి. సుంకాలను ప్రయోగించి ఏడు యుద్ధాలను పరిష్కరించాను. వాటిలో నాలుగు యుద్ధాలను సుంకాలతోనే ఆపాను’ అని అన్నారు. బ్రిటన్‌ పర్యటనకు బయలుదేరే ముందు ట్రంప్‌ విలేకరులతో మాట్లాడారు.

చైనా, భారత్‌ సహా పలు దేశాల నుంచి వచ్చే దిగుమతులపై సుంకాలు విధించడం ద్వారా ట్రంప్‌ తన అధికార పరిధిని అతిక్రమించారంటూ దాఖలైన కేసులో అమెరికా సుప్రీంకోర్టు నవంబరులో వాదనలు వింటుంది. ట్రంప్‌ ప్రభుత్వం చట్టవిరుద్ధంగా వ్యవహరించిందని దిగువ కోర్టులు నిర్ధారించాయి. సుంకాలపై రాజ్యాంగపరంగా నిర్ణయం తీసుకునే అధికారం కాంగ్రెస్‌దే కానీ దేశాధ్యక్షుడిది కాదని రూలింగ్‌ ఇచ్చాయి. పలు చిన్న చిన్న వ్యాపార సంస్థలు, కొన్ని రాష్ట్రాలు ట్రంప్‌ చర్యలను న్యాయస్థానాలలో సవాలు చేశాయి. ఈ చర్యలు తమను దాదాపుగా దివాలా తీయించాయని ఆరోపించాయి. సుంకాలు విధించాల్సింది కాంగ్రెస్‌ మాత్రమేనని, అధ్యక్షుడు కాదని న్యాయ పోరాటం చేస్తున్న లిబర్టీ జస్టిస్‌ సెంటర్‌కు చెందిన అటార్నీ జెఫ్రీ స్కాబ్‌ చెప్పారు. సుంకాలను దిగువ కోర్టులు కొట్టివేసినప్పటికీ అప్పీళ్ల కోర్టు మాత్రం వాటిని కొనసాగించేందుకు అనుమతించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -