Thursday, September 18, 2025
E-PAPER
Homeతాజా వార్తలునాడు నిజాం..నేడు మోడీ

నాడు నిజాం..నేడు మోడీ

- Advertisement -

అప్పుడు పెత్తందార్లకు…ఇప్పుడు కార్పొరేట్లకు వత్తాసు
నాటి పోరాటానికి మతం రంగు పులిమే కుట్ర
బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లకు నైతికతే లేదు
ట్రంప్‌ది పన్నుల తీవ్రవాదం :
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారోత్సవాల ముగింపు సభలో సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎంఎ బేబీ
జనగాంలో భారీ ర్యాలీ, బహిరంగ సభ

నవతెలంగాణ-వరంగల్‌ ప్రాంతీయ ప్రతినిధి
నాడు నిజాం తరహాలోనే నేడు ప్రధాని మోడీ వ్యవహరిస్తున్నారని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ అన్నారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారోత్సవాల ముగింపు సందర్భంగా బుధవారం జనగామ జిల్లాకేంద్రంలోని ప్రెస్టన్‌ మైదానంలో సీపీఐ(ఎం) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి అధ్యక్షతన బహిరంగసభ నిర్వహించారు. దీనికి ముఖ్య అతిధిగా హాజరైన ఎంఏ బేబీ మాట్లాడుతూ ఆనాటి నిజాం ప్రభువు భూస్వాములకు, బడా పెత్తందార్లకు అండగా నిలిచారనీ, ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ అదానీ, అంబానీల వంటి కార్పొరేట్లకు అండగా ఉన్నారని విమర్శించారు. తెలంగాణలో 1946 నుంచి 1951 వరకు ఐదేండ్లపాటు భూమి, భుక్తి, విముక్తి కోసం జరిగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీ మతం రంగు పులిమే ప్రయత్నం చేస్తున్నాయని చెప్పారు. ప్రపంచ చరిత్రలోనే ఈ సాయుధ పోరాటానికి ప్రత్యేకత ఉందన్నారు. కమ్యూనిస్టుల నాయకత్వంలో జరిగిన పోరాటంతో 3 వేల గ్రామాలను విముక్తి చేయడమే కాకుండా 10 లక్షల ఎకరాల భూములను ప్రజలకు పంపిణీ చేశారని వివరించారు. ఎలాంటి చట్టాలూ లేని కాలంలోనే కమ్యూనిస్టుల నాయకత్వంలో పెద్ద ఎత్తున భూమిని పంచడం చారిత్రాత్మకమన్నారు. ఈ పోరాట స్ఫూర్తితోనే కేరళలో 1957లో ఇఎంఎస్‌ నంబూద్రిపాద్‌ నాయకత్వంలోని కమ్యూనిస్టు ప్రభుత్వం భూ సంస్కరణలను అమలు చేసిందని తెలిపారు. ఈ సందర్భంలో పుచ్చలపల్లి సుందరయ్య, ఏకే గోపాలన్‌ వంటి నేతలు కేరళలో ప్రజలనుద్దేశించి ప్రసంగించిన విషయాన్ని గుర్తు చేశారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో పురుషులతో సమానంగా మహిళలు పోరాటం చేయడం విశేషమన్నారు. మల్లు స్వరాజ్యం అసమాన సాహసం ప్రదర్శించారనీ, మహిళలను ఈ పోరాటంలో మమేకం చేశారని చెప్పారు. ఢిల్లీలో ఇటీవలే దేవాంశుసింగ్‌ భవనానికి శంకుస్థాపన చేశామనీ, దేవాంశు ఆనాటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ప్రజలకు ఆయుధ శిక్షణనిచ్చారని గుర్తుచేశారు. త్యాగాలు లేకుండా ఏ పోరాటం విజయవంతం కాదన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంతో అనేక అనుభవాలు వచ్చాయని, గాంధీ అనుచరుడు వినోభాబావే సైతం భూదాన ఉద్యమం చేశారని ప్రస్తావించారు.

బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లకు అర్హతే లేదు
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంపై మాట్లాడే నైతిక హక్కు బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌కు లేదని ఎంఏ బేబీ అన్నారు. హైదరాబాద్‌లో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి సంబంధించి బీజేపీ ఒక కార్యక్రమం చేస్తుందని, ఈ పోరాటంలో అసలు వారి పాత్ర ఏంటని ప్రశ్నించారు. బీజేపీ చరిత్రను వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నదనీ, వారి కుట్రలను సాగనివ్వబోమని హెచ్చరించారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ ఆనాటి బ్రిటీష్‌ పాలకులకు తొత్తులుగా పనిచేశారన్నారు. గాంధీని చంపడానికి కొద్దిరోజుల ముందు ఆర్‌ఎస్‌ఎస్‌ నాయకుడు నాధురాం గాడ్సే ఆర్‌ఎస్‌ఎస్‌కు రాజీనామా చేసినట్టు ఆ పార్టీ నేతలు చెబుతున్నారనీ, గాంధీ హత్యకు ముందు ఆర్‌ఎస్‌ఎస్‌ దేశభక్తునిగా కొలిచే సవార్కర్‌ ఆశీస్సులను గాడ్సే తీసుకున్నారని వివరించారు. సవార్కర్‌ బ్రిటీషు వాళ్లను లిఖితపూర్వకంగా క్షమాపణ కోరారని తెలిపారు.

పోరాటంపై కాంగ్రెస్‌ అణచివేత
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం నేపథ్యంలో హైదరాబాద్‌ సంస్థానాన్ని ఇండియన్‌ యూనియన్‌లో విలీనం చేసే క్రమంలో ప్రధాని నెహ్రూ నాయకత్వంలో సర్ధార్‌ వల్లభారు పటేల్‌ నిజాం, భూస్వాములను కాపాడుతూ కమ్యూనిస్టులను అణిచివేశారని చెప్పారు. పోరాడిన నాయకులు, కార్యకర్తలపై ఎలాంటి సానుభూతి చూపించకుండా తీవ్రమైన మారణకాండను కొనసాగించారని వివరించారు.

ట్రంప్‌ పన్నుల తీవ్రవాదం
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ భారతదేశంపై పన్నులు విధిస్తున్నా ప్రధాని మోడీ పెదవి విప్పడం లేదని ఏంఏ బేబీ అన్నారు. ట్రంప్‌ అమెరికాకే కాకుండా, ప్రపంచానికే అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ట్రంప్‌ పలుమార్లు మోడీ నాకు మంచి స్నేహితుడని ప్రకటించారనీ, అమెరికా ఎన్నికల్లో ట్రంప్‌కు మోడీ మద్దతునిచ్చారని తెలిపారు. గాజాపై ఇజ్రాయిల్‌ నిరంతరం దాడులు చేస్తూ, అమాయకులైన పసిపిల్లల్ని సైతం చంపేస్తున్నదని చెప్పారు. అమెరికా మద్దతుతో ఇజ్రాయిల్‌ రెచ్చిపోతుందనీ, పాలస్తీనాకు మనం మద్దతునివ్వాల్సి ఉందన్నారు.

అదానీ, అంబానీలకు మోడీ త్రయం అండ
అసోంలో అటవీప్రాంతంలోని గిరిజనులను బయటకు పంపి విలువైన ఖనిజాలున్న అడవులను అదానీ, అంబానీలకు కట్టబెట్టడానికి ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్‌ షా, ఆర్‌ఎస్‌ఎస్‌ ఛీప్‌ మోహన్‌ భగవత్‌ ప్రయత్నిస్తున్నారని బేబీ అన్నారు. పార్లమెంటులో ఒకవైపు బీహార్‌లో ఎన్నికల సంఘం ఎస్‌ఐఆర్‌తో తొలగించిన ఓట్లపై చర్చ జరుగుతుండగానే మోడీ ప్రభుత్వం మినరల్స్‌ అండ్‌ మైనింగ్‌ చట్టంలో పలు సవరణలు చేస్తూ తీర్మానం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ ముగ్గురి కూటమి దేశాన్ని నాశనం చేస్తున్నదని విమర్శించారు. బీహార్‌ ఎన్నికలు కీలకంగా మారాయన్నారు. ఎన్నికల సంఘం కేంద్ర ప్రభుత్వం చేతిలో తోలుబొమ్మగా మారిందన్నారు. 65 లక్షల ఓట్లను ఎస్‌ఐఆర్‌ పేరిట తొలగించడం, సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణించిన విషయాలను ప్రజల్లోకి తీసుకుపోవాలన్నారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట స్ఫూర్తితో బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లకు వ్యతిరేకంగా పోరాడాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ సభలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎమ్‌డీ అబ్బాస్‌, జనగామ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రాపర్తి రాజు, ఇర్రి అహల్య, సింగారపు రమేష్‌, సాంబరాజు యాదగిరి, బొట్ల శేఖర్‌, బూడిద గోపి, జోగు ప్రకాశ్‌, సుంచు విజేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

భారీ ర్యాలీ
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట దినోత్సవం సందర్భంగా జనగామ జిల్లా కేంద్రంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. దీన్ని స్థానిక రైల్వే స్టేషన్‌ వద్ద ఎంఏ బేబీ జెండా ఊపి ప్రారంభించారు. కోలాటం, బతుకమ్మ ఆటలతో ఆద్యంతం ఈ ప్రదర్శన బహిరంగ సభాస్థలి వరకు సాగింది. ర్యాలీలో నాయకులు, కార్యకర్తలు ఎర్రజెండాలు పట్టుకుని డప్పు సప్పుళ్లతో ఆడుతూ పాడుతూ నినదిస్తూ ముందుకు కదిలారు. జనగామ పట్టణ ప్రధాన రహదారులు ఎర్ర దండు మయమైంది. రైల్వే స్టేషన్‌ నుంచి నెహ్రూ పార్క్‌ అంబేద్కర్‌ చౌరస్తా మీదుగా క్రిస్టియన్‌ గ్రౌండ్‌లో ఏర్పాటుచేసిన బహిరంగ సభ వద్దకు చేరుకుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -