Thursday, September 18, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుపేదలకు భూములు పంచకుండా ప్రజాపాలన ఎలా సాధ్యం?

పేదలకు భూములు పంచకుండా ప్రజాపాలన ఎలా సాధ్యం?

- Advertisement -

పోరాట వారసత్వం ఎర్రజెండాదే
తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తితో పోరాటాలకు సిద్ధం కావాలి: సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ
మహబూబాబాద్‌లో సాయుధ రైతాంగ పోరాట సభ

నవతెలంగాణ-మహబూబాబాద్‌
తెలంగాణలో ఉన్న 25 లక్షల ఎకరాల ప్రభుత్వ భూములను పేదలకు పంచకుండా ‘ప్రజా పాలన’ ఎలా సాధ్యమవుతుందని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ ప్రశ్నించారు. భూ పంపిణీ కోసం భవిష్యత్తులో సాయుధ పోరాట స్ఫూర్తితో ఉద్యమాలకు సిద్ధం కావాలని అన్నారు. నాడు నిజాం.. భూస్వాములు, పెత్తందారులు ఎలా అయితే దొరలకు వత్తాసు పలికారో, నేడు నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్పొరేట్లకు, బహుళజాతి సంస్థలకు అలాగే ఊడిగం చేస్తోందని, ఇద్దరికీ తేడా ఏమీ లేదని అన్నారు. భూమికోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం జరిగిన వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట స్ఫూర్తితో ప్రజా వ్యతిరేక పాలకులపై పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం వార్షికోత్సవం సందర్భంగా బుధవారం మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంలోని స్థానిక ఫాతిమా హైస్కూల్‌ నుంచి వీఆర్‌ఎన్‌ గార్డెన్‌ వరకు భారీ ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం జిల్లా కార్యదర్శి సాదుల శ్రీనివాస్‌ అధ్యక్షతన నిర్వహించిన సభలో జాన్‌వెస్లీ మాట్లాడారు.

దేశ చరిత్రలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం స్ఫూర్తిదాయకమని జాన్‌వెస్లీ తెలిపారు. తమ పార్టీ ఆధ్వర్యంలో సెప్టెంబర్‌10 నుంచి 17 వరకు సాయుధ పోరాట వారోత్సవాలు నిర్వహించినట్టు చెప్పారు. భూమి కోసం, భుక్తి కోసం తాము సభలు నిర్వహిస్తుంటే, బీజేపీ మాత్రం సాయుధ పోరాటాన్ని హిందూ-ముస్లిం ఘర్షణగా వక్రీకరిస్తోందని విమర్శించారు. స్వాతంత్య్రం వచ్చినా తెలంగాణలో నిజాం పాలనలో ప్రజలు వెట్టిచాకిరీ చేశారని, భూమి లేక కూలి పనులపై ఆధారపడాల్సిన దుస్థితి ఉండేదని, మహిళలపై దొరల లైంగికదాడులు, దౌర్జన్యాలకు పాల్పడేవారని తెలిపారు. ఈ నిర్బంధాలకు, వెట్టిచాకిరీకి వ్యతిరేకంగా ప్రజలు ఎర్రజెండా పట్టుకుని తిరుగుబాటు చేశారని అన్నారు. మన పూర్వీకులు అనుభవించిన చిత్రహింసలను మనమెప్పటికీ మర్చిపోకూడదని, సాయుధ పోరాటంలో 4,000 మంది కమ్యూనిస్టులు ప్రాణాలర్పించడం వల్లే భూ సంస్కరణలు వచ్చాయని తెలిపారు. దున్నేవాడిదే భూమి అనే నినాదంతో ప్రభుత్వ భూముల్లో ఎర్రజెండాలు పాతాలని, నిలువ నీడ లేని పేదలు గుడిసెలు వేసుకోవాలని పిలుపునిచ్చారు. మానుకోటలో గుడిసెలు వేసుకున్న 5,000 మంది పేదలను పోలీసులు ఇరవైసార్లకుపైగా తరిమికొట్టారని, వారిపై అక్రమ కేసులు పెట్టారని సాదుల శ్రీనివాస్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సూర్ణపు సోమయ్య, గునిగంటి రాజన్న, ఆకుల రాజు, కందునూరి శ్రీనివాస్‌, కుంట ఉపేందర్‌, అల్వాల వీరన్న, పట్టణ కార్యదర్శి బానోత్‌ సీతారాం నాయక్‌, వన్‌టౌన్‌ కార్యదర్శి రావుల రాజు, టూటౌన్‌ కార్యదర్శి సమ్మెట రాజమౌళి, జిల్లా కమిటీ సభ్యులు, మండల కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -