విద్యాహక్కు చట్టం సెక్షన్ 23ను సవరించాలి
ప్రధాని, విద్యామంత్రికి ఎస్టీఎఫ్‌ఐ వినతి
టెట్ సిలబస్,అర్హతా మార్కులు సవరించాలి
ఎస్‌సీటీఈకి ప్రాతినిధ్యం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) విషయంలో సుప్రీంకోర్టు తీర్పుపై రివ్యూ పిటిషన్ వేయాలని స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్టీఎఫ్‌ఐ) కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. విద్యాహక్కు చట్టంలోని సెక్షన్ 23ను సవరించాలని కోరింది. ఈ మేరకు న్యూఢిల్లీలో ప్రధాన మంత్రి, కేంద్ర విద్యాశాఖ మంత్రి, విద్యాశాఖ కార్యదర్శి కార్యాలయాల్లో ఎస్టీఎఫ్‌ఐ అఖిల భారత అధ్యక్షులు సీఎన్ భారతి, ప్రధాన కార్యదర్శి చావ రవి, కోశాధికారి అబ్దుల్లా షఫీ కలిసి వినతిపత్రాలను అందజేశారు. ఉద్యోగ విరమణ ఐదేండ్లకు మించి సర్వీసు ఉన్న ఉపాధ్యాయులందరూ రెండేండ్లలో తప్పనిసరిగా టెట్ ఉత్తీర్ణులు కావాలనీ లేదా ఉద్యోగం నుండి రిటైర్ కావాలని సుప్రీంకోర్టు ఈనెల ఒకటో తేదీన ఇచ్చిన తీర్పు ఇచ్చిందని తెలిపారు. 2010, ఆగస్టు 23 కంటే ముందు దేశవ్యాప్తంగా నియామకమైన 25 లక్షల మంది ఉపాధ్యాయులపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. 20, 25 ఏండ్ల సర్వీసు పూర్తి చేసిన ఉపాధ్యాయుల ప్రయోజనాలను కాపాడేందుకు తీర్పును పున్ణ సమీక్షించాలని కోరుతూ వెంటనే రివ్యూ పిటిషన్ వేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
2010, ఆగస్టు 23 తర్వాత నియామకమైన ఉపాధ్యాయులకు మాత్రమే టెట్‌ను తప్పనిసరి చేస్తూ విద్యా హక్కు చట్టంలోని సెక్షన్ 23లో స్పష్టత ఇచ్చే విధంగా ఆ చట్టాన్ని సవరించాలని కోరారు. గత 15 ఏండ్లుగా ఎన్‌సీటీఈ, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు విద్యా హక్కు చట్టం అమలుకు పూర్వం నియామకమైన ఉపాధ్యాయులకు టెట్ అవసరమంటూ చెప్పలేదని తెలిపారు. పైగా 2010, ఆగస్టు 23కి ముందు నియామకమైన వారికి టెట్ మినహాయింపు ఇచ్చినట్టు కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించాయని గుర్తు చేశారు. అందుకే సీనియర్ టీచర్లు ఇప్పటివరకు టెట్ ఉత్తీర్ణులు కావాలనే ఆలోచన చేయలేదని తెలిపారు. సుప్రీంకోర్టు సివిల్ అప్పీల్ నెంబరు 1385/2025 కేసులో ఈనెల ఒకటో తేదీన ఇచ్చిన తీర్పు వారి ఉద్యోగాలకు ముప్పు తెచ్చిందని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని వారి ఉద్యోగాలకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు.
టెట్ ఉత్తీర్ణత మార్కులను 50 శాతానికి సవరించాలి
టెట్ సిలబస్‌ను మార్చాలనీ, ఉత్తీర్ణత మార్కులను 60 శాతం నుంచి 50 శాతానికి సవరించాలని ఎస్టీఎఫ్‌ఐ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సీఎన్ భారతి, చావ రవి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు జాతీయ ఉపాధ్యాయ విద్యామండలి (ఎన్‌సీటీఈ) చైర్మెన్ పంకజ్ అరోరా, కార్యదర్శి అభిలాష మిశ్రాలను బుధవారం న్యూఢిల్లీలో వారు కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు సుప్రీంకోర్టును సందర్శించి సీనియర్ న్యాయవాదులతో సంప్రదింపులు జరిపారు. ఎస్టీఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ఈ నెలాఖరులోగా రివ్యూ పిటిషన్ వేయటానికి ఏర్పాట్లు చేశామని తెలిపారు.