Thursday, September 18, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంతెలంగాణ సాయుధ పోరాటమే ప్రేరణ

తెలంగాణ సాయుధ పోరాటమే ప్రేరణ

- Advertisement -

నిజాం నిరంకుశ పాలనను కూకటివేళ్లతో పెకిలించిన ఉద్యమం
సీపీఐ బహిరంగసభలో వక్తలు

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
నిజాం నిరంకుశ పాలనను, భూస్వామ్య వ్యవస్థను కూకటివేళ్లతో పెకిలించిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం దేశంలో అనేక ఉద్యమాలకు ప్రేరణగా నిలిచిందని పలువురు వక్తలు అన్నారు. ఆ పోరాట ఫలితంగానే ఈ ప్రాంత ప్రజల్లో చైతన్యం రగిలి మెరుగైన పౌర సమాజం ఏర్పడిందని చెప్పారు. సీపీఐ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట 77వ వారోత్సవాల ముగింపు బహిరంగ సభను బుధవారం హైదరాబాద్‌లోని రావి నారాయణ రెడ్డి ఆడిటోరియంలో నిర్వహించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అధ్యక్షతన జరిగిన ఈ సభలో జస్టిస్‌ చంద్రకుమార్‌, ప్రొఫెసర్‌ హరగోపాల్‌, సీపీఐ జాతీయ కార్యదర్శి సయ్యద్‌ అజీజ్‌పాషా, జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి, పశ్యపద్మ, జాతీయ సమితి సభ్యులు పల్లా వెంకటరెడ్డి, కె శ్రీనివాస్‌రెడ్డి, ఎండి యూసుఫ్‌, రాష్ట్ర సహాయ కార్యదర్శులు తక్కెళ్లపల్లి శ్రీనివాసరావు, ఈటి నరసింహా, కార్యదర్శివర్గ సభ్యులు విఎస్‌ బోస్‌, కళవేణి శంకర్‌, సీనియర్‌ నాయకులు కందిమళ్ల ప్రతాప్‌రెడ్డి, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షురాలు విమలక్క తదితరులు హాజరయ్యారు. అంతకుముందు సీపీఐ రాష్ట్ర కార్యాలయం మఖ్దూం భవన్‌లో జాతీయ పతాకాన్ని అజీజ్‌పాషా, సీపీఐ పతాకాన్ని కూనంనేని సాంబశివరావు ఆవిష్కరించారు.

కుట్రకు తెరలేపుతున్న బీజేపీ : కూనంనేని
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలోగానీ, స్వాతంత్య్రోద్యమంలోగానీ బీజేపీకి ఎలాంటి చరిత్ర లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు విమర్శించారు. కానీ కమ్యూనిస్టులు, నెహ్రూ, గాంధీ మొదలుకొని గాడ్సే వరకు, వివేకానంద నుంచి విప్లవ కెరటం భగత్‌సింగ్‌ వరకు అంతా తమ వారేనంటూ బీజేపీ సొంతం చేసుకునే కుట్రకు తెరలేపుతున్నదని అన్నారు. కమ్యూనిస్టులన్నా, ఎర్రజెండా అన్నా ఇప్పటికీ ప్రజల్లో అభిమానం ఉందన్నారు. దొరలపెత్తనం, భూస్వాముల అరాచకాలను వ్యతిరేకిస్తూ భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరీ విముక్తి కోసం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం సాగిందన్నారు. ఈ పోరాటం ద్వారానే నిరంకుశ నిజాం పాలన పతనమై హైదరాబాద్‌ సంస్థానం భారత్‌లో విలీనమైందని చెప్పారు. సీపీఐ జాతీయ కార్యదర్శి అజీజ్‌పాషా మాట్లాడుతూ హైదరాబాద్‌ సంస్థానంలో నాడు 52 శాతం తెలుగు, ఆ తర్వాత మరాఠా, కన్నడం వారు ఉంటే ముస్లింలు కేవలం 10 శాతమే ఉన్నారని చెప్పారు. దీంతో మెజార్టీ ప్రజలకు తమ మాతృభాషలో చదివేందుకు అవకాశం లేదన్నారు.

తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో అన్ని వర్గాల ప్రజలతోపాటు 10 శాతం ముస్లిముల్లో ఎనిమిది శాతం మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా పాల్గొన్నారని వివరించారు. ఇది హిందూ ముస్లింల మధ్య జరిగిన పోరాటం ఎలా అవుతుందో బీజేపీ సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. జస్టిస్‌ చంద్ర కుమార్‌ మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఎన్నికల కమిషన్‌తోపాటు రాజ్యాంగబద్ధ సంస్థలను నిర్వీర్యం చేస్తున్నదని విమర్శి చారు. రాజ్యాంగంతోపాటు వ్యవస్థల పరిరక్షణకు నాటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం స్ఫూర్తితో కమ్యూనిస్టులు మరో పోరాటం చేపట్టాలని పిలుపునిచ్చారు. హరగోపాల్‌ మాట్లాడుతూ సాయుధ పోరాటం ప్రభావం తెలంగాణ సమాజంపై ఎప్పుడూ ఉంటుందన్నారు. అంత గొప్ప పోరాటంతో ఎలాంటి సంబంధం లేని బీజేపీ చరిత్రను వక్రీకరించడం హాస్యాస్పదమన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -