నవతెలంగాణ-హైదరాబాద్ : ఏపీ శాసనసభ వర్షాకాల సమావేశాలు గురువారం ఉదయం ప్రారంభమయ్యాయి. వారం నుంచి పది రోజుల పాటు ఈ సమావేశాలు జరిగే అవకాశం ఉంది. ఈ భేటీలో పలు కీలక బిల్లులకు ఆమోదం తెలపడంతో పాటు రాష్ట్రానికి సంబంధించిన అనేక ముఖ్యమైన అంశాలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ప్రశ్నోత్తరాల సమయం ముగిశాక జరిగే శాసనసభ వ్యవహారాల సలహా కమిటీ (బీఏసీ) సమావేశంలో సభ ఎన్ని రోజులు నిర్వహించాలనే దానిపై తుది నిర్ణయం తీసుకోనున్నారు.
ఈ సమావేశాల్లో ప్రభుత్వం మొత్తం ఆరు కీలక బిల్లులను ప్రవేశపెట్టనుంది. వీటిలో ఎంతోకాలంగా వివాదాస్పదంగా ఉన్న నాలా (వ్యవసాయేతర భూమిగా మార్పిడి) చట్టం రద్దు బిల్లు అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. దీంతో పాటు ఎస్సీ వర్గీకరణ, యూనివర్సిటీల చట్ట సవరణ, పంచాయతీ రాజ్, మున్సిపల్ శాఖల చట్ట సవరణ, మోటారు వాహనాల పన్నుల చట్ట సవరణ బిల్లులను కూడా సభ ముందుకు తీసుకురానున్నారు.
ప్రభుత్వం తన ప్రతిష్ఠాత్మక హామీలైన “సూపర్ సిక్స్” అమలు, రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల పురోగతి, మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్, దివ్యాంగుల పింఛన్లు, సదరం సర్టిఫికేట్ల జారీ వంటి అంశాలపై ప్రధానంగా చర్చించాలని భావిస్తోంది. అదే సమయంలో జీఎస్టీ స్లాబుల మార్పు వల్ల రాష్ట్రంపై పడుతున్న ఆర్థిక భారం, డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీలో జాప్యం వంటి అంశాలు కూడా చర్చకు రానున్నాయి.
వీటితో పాటు “ఆడుదాం ఆంధ్ర” కార్యక్రమంలో జరిగిన అవకతవకలు, 22-ఏ కింద ఉన్న భూముల సమస్యలు, ఈనాం, అసైన్డ్ భూముల వివాదాలు, గృహ నిర్మాణం, పరిశ్రమల స్థాపన-ఉద్యోగాల కల్పన, రబీ ధాన్యం సేకరణ, పెండింగ్ బిల్లుల చెల్లింపు వంటి సుమారు 22 అంశాలపై ఈ సమావేశాల్లో వాడీవేడి చర్చ జరిగే అవకాశం వుంది.