నవతెలంగాణ-హైదరాబాద్: పాలస్తీనా అనుకూల కార్యకర్త మహమూద్ ఖలీల్‌ను అల్జేరియా లేదా సిరియాకు వెళ్లగొట్టాలని అమెరికా ఇమ్మిగ్రేషన్ జడ్జి ఆదేశించారు. ప్రతిష్టాత్మక కొలంబియా యూనివర్శిటీలో గాజాపై ఇజ్రాయిల్ ఊచకోతకు వ్యతిరేకంగా కొనసాగుతున్న ఆందోళనల్లో ఖలీల్ కీలక పాత్ర పోషిస్తున్నారు. అమెరికన్ సివిల్ లిబర్టీస్ యూనియన్ (ఎసిఎల్‌యు) బుధవారం వెల్లడించిన కోర్టు పత్రాల ప్రకారం.. లూసియానా ఇమ్మిగ్రేషన్ జడ్జి జామీ కోమన్స్ సెప్టెంబర్ 12న ఈ ఉత్తర్వులను జారీ చేశారు. ఖలీల్ అమెరికాలో చట్టబద్ధమైన శాశ్వత నివాసానికి దరఖాస్తు చేసుకున్న సమయంలో, శాశ్వత నివాసం పొందినపుడు కీలక సమాచారాన్ని వెల్లడించడంలో విఫలమయ్యారని జడ్జి ఆరోపించారు. ఖలీల్ యునైటెడ్ నేషన్స్ ఏజన్సీ ఫర్ పాలస్తీనియన్ రెఫ్యూజీస్ (యుఎన్‌ఆర్‌డబ్ల్యుఎ), కొలంబియా యూనివర్శిటీ అపార్తీడ్ డైవెస్ట్ (ఇజ్రాయిల్‌ను ఆర్థికంగా బహిష్కరించాలని వాదించే సమూహం)తో సంబంధాలను కొనసాగిస్తున్నాడని పేర్కొన్నారు. ఇమ్మిగ్రేషన్ ప్రక్రియను తప్పించుకోవడానికి, దరఖాస్తులను తిరస్కరించకుండా ఉండేందుకు ఖలీల్ ఉద్దేశపూర్వకంగా వాస్తవాలను తప్పుగా సూచించారని కోర్టు గుర్తించిందని అన్నారు.
బహిష్కరణ ఉత్తర్వులపై అప్పీల్ చేయాలని యోచిస్తున్నామని ఖలీల్ న్యాయవాది తెలిపారు. ఖలీల్ ఫెడరల్ కోర్టులో కేసు కొనసాగుతున్నందున ప్రభుత్వం అతనిని వెంటనే బహిష్కరించడం లేదా నిర్బంధించడాన్ని నిషేధిస్తూ ఈ ఏడాది ప్రారంభంలో ఫెడరల్ జిల్లా కోర్టు జారీ చేసిన ఉత్తర్వులను ఆయన లేవనెత్తారు.