Friday, September 19, 2025
E-PAPER
Homeజాతీయంప్రజాస్వామ్య శక్తులు ఏకం కావాలి

ప్రజాస్వామ్య శక్తులు ఏకం కావాలి

- Advertisement -

ఐక్యతతోనే ప్రజాస్వామ్యం, రాజ్యాంగానికి రక్షణ
మతతత్వ శక్తులపై ఏచూరి రాజీలేని పోరాటం :సీపీఐ(ఎం) అగ్రనాయకులు ప్రకాశ్‌ కరత్‌

భువనేశ్వర్‌ : భారత రాజ్యాంగాన్ని కాపాడేందుకు దేశంలోని ప్రజాస్వామ్య శక్తులు ఏకం కావాలని సీపీఐ(ఎం) మాజీ ప్రధాన కార్యదర్శి, ఆ పార్టీ సీనియర్‌ నాయకులు ప్రకాశ్‌ కరత్‌ పిలుపునిచ్చారు. ఈ ఐక్యత ద్వారానే భారత్‌లో ప్రజాస్వామ్యం, రాజ్యాంగాన్ని రక్షించి, బలోపేతం చేయొచ్చని వివరించారు. ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో ‘సీతారాం ఏచూరీ : ఇన్‌ డిఫెన్స్‌ ఆఫ్‌ సెక్యులరిజం, డెమోక్రసీ అండ్‌ పీపుల్స్‌ ఇండియా’ పేరుతో జరిగిన కార్యక్రమంలో స్మారక ఉపన్యాసం చేసిన ఆయన పైవిధంగా స్పందించారు. ”గణతంత్రాన్ని, రాజ్యాంగాన్ని రక్షించటానికి, లౌకికవాదం, ప్రజాస్వామ్యం, భారత ప్రజల పురోగతిని నిలబెట్టటానికి అన్ని ప్రజాస్వామ్య శక్తులు పోరాటాలను ముందుకు తీసుకెళ్లాలి. మతతత్వ, నిరంకుశ శక్తులకు వ్యతిరేకంగా సాధారణ ప్రజల హక్కులను ఏచూరి సమర్థించారు. లౌకికవాదం, ప్రజాస్వామ్య విలువలకు ఏచూరి అంకితభావం అసమానమైనది” అని ఆయన అన్నారు.

నిరంకుశ ధోరణికి వ్యతిరేకంగా ఏచూరి పోరాటం
ఏచూరి రాజకీయ ప్రయాణంలో ఆయన భారత రాజ్యాంగ ప్రాథమిక సూత్రాలను సమర్థించారనీ, వాటిని అణగదొక్కటానికి ప్రయత్నించే శక్తులకు వ్యతిరేకంగా బలంగా పోరాడారని గుర్తు చేశారు. ఏచూరి మతతత్వానికి వ్యతిరేకంగా రాజీలేని పోరాటం చేశారనీ, దీనిని జాతీయ ఐక్యత, ప్రజాస్వామ్యానికి అతిపెద్ద ముప్పుగా గుర్తించారని చెప్పారు. కుల, మతాలు, ప్రాంతం, భాషలకు అతీతంగా ప్రజల ఐక్యతను నిరంతరం ప్రోత్సహించారనీ, ద్వేష రాజకీయాలకు వ్యతిరేకంగా సమాజాన్ని మేల్కొలిపారని కరత్‌ వివరించారు. ప్రజలకు సాధికారత కల్పించటం, పౌరుల స్వేచ్ఛను కాపాడటం, కార్మికులు, రైతులు, మహిళలు, యువత, దళితులు, ఆదివాసీలు, మైనారిటీలు.. ఇలా అన్ని వర్గాల భాగస్వామ్యాన్ని నిర్ధారించటం కోసం ఏచూరి ప్రజాస్వామ్యాన్ని బలంగా విశ్వసించారని గుర్తు చేశారు. ఏచూరి ఎమర్జెన్సీ రోజుల నుంచి తన చివరి రోజుల వరకు ప్రతి నిరంకుశ ధోరణికి వ్యతిరేకంగా పోరాడారని చెప్పారు. ఆయన రాజకీయాలలో ఎప్పుడూ సామాజిక న్యాయం, సమాన అభివృద్ధి, పేదల సంక్షేమం, భారత ప్రజాధారిత దృక్పథమే కేంద్రంగా పని చేశారని గుర్తు చేశారు. ఏచూరి ఆలోచనలు నేటికీ చాలా సందర్భోచితంగా ఉంటాయన్నారు. కార్యక్రమంలో ఒడిశాలోని అనేక మంది ఇతర వామపక్ష నాయకులు కూడా పాల్గొన్నారు. ఏచూరి గురించి, భారత ప్రజాస్వామ్యం ఎదుర్కొంటున్న సవాళ్లపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -