అలహాబాద్ : సమాజ్‌వాదీ పార్టీ నాయకులు, ఉత్తరప్రదేశ్ మాజీమంత్రి ఆజాం ఖాన్‌కు గురువారం అలహాబాద్ హైకోర్టు భారీ ఉపశమనం ఇచ్చింది. భూకబ్జాకు సంబంధించిన హై-ప్రొఫైల్ కేసులో ఆజాం ఖాన్‌కు హైకోర్టు బెయిల్ మంజారు చేసింది. బెయిల్ పిటిషన్‌ను విచారించిన జస్టిస్ సమీర్ జైన్ నేతృత్వంలోని సింగిల్ బెంచ్ ఆజాం ఖాన్‌కు బెయిల్‌ను ఆమోదించింది. దీంతో ఆజాంఖాన్‌పై నమోదైన అన్ని కేసుల్లోనూ బెయిల్ లభించడంతో జైలు నుంచి విడుదలకు మార్గం సుగమం అయింది. అయితే తీర్పు అప్‌లోడ్ చేయడం, విడుదల ఉత్తర్వు జైలు అధికారులకు చేరడం వంటి కారణాలతో విడుదలకు రెండు, మూడు రోజులు పడుతుందని న్యాయవాది మహమ్మద్ ఖలీద్ తెలిపారు. కాగా, ఈ బెయిల్ పిటిషన్‌పై ఆగస్టు 21నే వాదనలు ముగించిన హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఈ ఏడాది మేలో ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు తన బెయిల్ పిటీషన్‌ను తిరస్కరించడంతో ఆజాం ఖాన్ హైకోర్టును ఆశ్రయించారు. రాంపూర్‌లోని క్వాలిటీ బార్ భూమిని ఆక్రమించారని యజమాని గగన్ అరోరా ఫిర్యాదు మేరకు 2019 నవంబర్ 21న ఈ కేసు నమోదయింది. ఆజాంఖాన్, భార్య తజీన్ ఫాతిమా, కుమారుడు అబ్దుల్లా అజంపై ఎఫ్‌ఐఆర్ నమోదయింది. నిజానికి ఎఫ్‌ఐఆర్‌లో ముందుగా ఖాన్‌ను పేరును ప్రస్తావించలేదు. గతేడాదిలో ఆజాంను నిందితుడిగా చేర్చారు.