Friday, September 19, 2025
E-PAPER
Homeజాతీయంనమో నమామి!

నమో నమామి!

- Advertisement -

మోడీకి వెల్లువెత్తిన జన్మదిన శుభాకాంక్షలు
పోటీ పడిన పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులు, సెలబ్రిటీలు


న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా పలువురు ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ భూగోళంపై మన మాతృ భూమిని ఓ గొప్ప దేశంగా తీర్చిదిద్దేందుకు మోడీని భగవంతుడు ఒక అవతార పురుషుడిగా ఈ లోకానికి పంపాడని ఒకరు…స్వతంత్ర భారతావని వందేండ్లు పూర్తి చేసుకునే వరకూ మోడీ సేవలు అందించాలని మరొకరు…ఈ వయసులో కూడా మీలో ఉన్న శక్తి మా వంటి యువతను ఓడిస్తోందని ఇంకొకరు…మోడీని నూతన భారత రూపకర్త అని వేరొకరు…ఇలా ఒకరితో ఒకరు పోటీ పడుతూ ప్రశంసలతో ముంచెత్తారు. ఈ మాటలు వేరెవరివో కావు… పారిశ్రామికవేత్త ముకేశ్‌ అంబానీ, నటుడు షారూఖ్‌ ఖాన్‌, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే వంటి ప్రముఖులు పంపిన సందేశాలలో ఆణిముత్యాలు. గతంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలకే పరిమితమైన జన్మదిన శుభాకాంక్షల సందేశాలు ఇప్పుడు వివిధ పార్టీలకు చెందిన రాజకీయ నేతలు, క్రీడాకారులు, సెలబ్రిటీలు, పారిశ్రామికవేత్తలు, ప్రైవేటు కంపెనీలు, విద్యా సంస్థలు, ఎగ్జిబిటర్ల నుంచి కూడా వెల్లువెత్తడం గమనార్హం.

వార్తా పత్రికలలో కూడా మోడీకి శుభాకాంక్షలు తెలుపుతూ భారీ ప్రకటనలు వచ్చాయి. ఏక్‌నాథ్‌ షిండే ‘ది ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌’ పత్రిక ఢిల్లీ ఎడిషన్‌లో మొదటి పేజీలో ప్రకటన ఇచ్చారు. ది టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా, ది ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌, హిందుస్థాన్‌ టైమ్స్‌, ది హిందూ పత్రికల ఢిల్లీ ఎడిషన్లలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రేఖా గుప్తా ప్రకటనలు ఇచ్చారు. దాల్మియా భారత్‌ వంటి ప్రైవేటు కంపెనీలు కూడా పత్రికా ప్రకటనలు ఇచ్చాయి. ప్రధానికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ‘ది టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా’ పత్రికలో 16 ప్రకటనలు, ‘ది ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌’లో 10, ‘హిందుస్థాన్‌ టైమ్స్‌’లో తొమ్మిది, ‘ది హిందూ’లో మూడు ప్రకటనలు వచ్చాయి.ప్రధాని జన్మదినాన్ని పురస్కరించుకొని ఢిల్లీ ప్రభుత్వం సేవా సంకల్ప్‌ వాక్‌ను ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి స్వయంగా భాగస్వామి అయ్యారు. బీహార్‌లోని పాట్నా సాహిబ్‌లో కేంద్ర మంత్రి హర్‌దీప్‌ సింగ్‌ పూరీ ప్రార్థనలు జరిపారు.

న్యూఢిల్లీలో బీజేపీ నేత షానవాజ్‌ హుస్సేన్‌ నిజాముద్దీన్‌ దర్గాలో ప్రార్థనలు చేశారు. రక్షణ శాఖ సహాయ మంత్రి సంజరు సేథ్‌ ఓ యజ్ఞాన్ని నిర్వహించగా బీజేపీ ఎంపీ సంబిత్‌ పత్రా పూరీలో జగన్నాథ హారతిలో పాల్గొన్నారు. మోడీ జీవిత విశేషాలతో కూడిన ఎగ్జిబిషన్‌ను న్యూఢిల్లీలో కేంద్ర మంత్రి, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్దా ప్రారంభించారు. ఇక పారిశ్రామికవేత్తలు, సినీ నటులు, క్రీడాకారులు ఇచ్చిన వీడియో సందేశాలకు లెక్కే లేదు. తామేమీ తీసిపోలేదంటూ విద్యా సంస్థలు కూడా మోడీ జన్మదినోత్సవాన్ని జరుపుకున్నాయి. గ్రీటింగ్‌ కార్డులు, ఈ-కార్డులు, షార్ట్‌ వీడియో సందేశాలు తయారు చేయాలంటూ ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్‌ తన విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు సూచించింది. మోడీ చిన్ననాటి జీవిత విశేషాలతో కూడిన ‘ఛలో జీతే హెయిన్‌’ చిత్రాన్ని ప్రదర్శించాలంటూ విద్యా మంత్రిత్వ శాఖ సీబీఎస్‌ఈ, కేవీఎస్‌, ఎన్‌వీఎస్‌ పాఠశాలలకు సర్య్యులర్‌ పంపింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -