రైతు నుంచి రూ.40 వేల లంచం తీసుకుంటూ..
నవతెలంగాణ-మహబూబ్‌నగర్ ప్రాంతీయ ప్రతినిధి
వనపర్తి జిల్లా కొత్తకోట తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించి ఎంఆర్‌ఐ, డిప్యూటీ సర్వేయర్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వారు రూ.40వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. కొత్తకోట మండలం నిర్విన్ గ్రామానికి చెందిన ఓ రైతు తన భూమిని పట్టా చేసి పాసుపుస్తకాలు ఇవ్వాలని ఆర్డీవోను ఆశ్రయించాడు. ఆర్డీవో పరిశీలన కోసం తహసీల్దార్‌కు పంపారు. తహసీల్దార్ ఫీల్డ్ విచారణ చేసి స్థితిగతులపై నివేదిక ఇవ్వాలని ఎంఆర్‌ఐ వాసు, డిప్యూటీ సర్వేయర్ నవీన్‌రెడ్డిని ఆదేశించారు. వీరిరువురూ రైతు దగ్గర రూ.40వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. డబ్బులు ఇస్తే ఆర్డీఓ, తహసీల్దార్ దగ్గర ఎలాంటి సమస్య రాదని అన్నీ తాము చూసుకుంటామని చెప్పారు. దీంతో సదరు రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. రైతు నుంచి వారు లంచం తీసుకుం టుండగా.. ఏసీబీ డీఎస్పీ సిహెచ్.బాలకృష్ణ ఆధ్వర్యంలో అధికారులు గురువారం దాడులు చేసి పట్టుకున్నారు. కేసు పూర్వాపరాలు విచారించి నిందితులపై చర్యలు తీసుకుంటామని ఏసీబీ అధికారులు తెలిపారు.