నవతెలంగాణ-హైదరాబాద్: జనసూరజ్ పార్టీ అధినేత, ఎన్నికల వ్యూహాకర్త ప్రశాంత్ కిశోర్, ఆర్జేడీ సీనియర్ నేత తేజిస్వీయాదవ్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై విమర్శలు గుప్పించారు. ఎన్నికల నేఫథ్యంలో బీహార్ రాష్ట్రానికి బీజేపీ నేతలు తరుచుగా రాకపోకలు సాగిస్తున్నారని, రాష్ట్ర ప్రజలకు కావాల్సింది అది కాదని, ఏండ్ల తరబడి బీహార్ ప్రజలు వివిధ రాష్ట్రాలకు వలస పోతున్నారని, వారికి ఉపాధి కల్పించి, వలసలకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని వచ్చే నేతలు చెప్పాలని ప్రశాంత్ కిషోర్ డిమాండ్ చేశారు. వలసలను నివారించే క్రమంలో భారీ ఎత్తున పరిశ్రమలు స్థాపిస్తామని నాయకులు వాగ్ధానాలు చేసి, వాళ్లకు భరోసా కల్పించాలన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నాలుగురోజులు హడావిడి చేయడం కాదని ఆయన ఎద్దేవా చేశారు.
ఆర్జేడీ సీనియర్ నేత తేజిస్వీ యాదవ్ కూడా అమిత్ షా పాట్నా పర్యటనపై మండిపడ్డారు. అమిత్ షా కేవలం రాజకీయ లబ్దిపొందడానికే బీహార్ కు వచ్చరని, ఆయన స్వలాభాల కోసమే పదేపదే బీజేపీ నాయకులు కూడగట్టుకొని వస్తారని ధ్వజమెత్తారు. బీహార్ రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ హోదా ఇవ్వకుండా ఈ రాష్ట్ర ప్రజల అన్యాయం చేస్తోందన్నారు.