Friday, September 19, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సీఎంఆర్ డెలివరీలను గడువులోపు అప్పగించాలి 

సీఎంఆర్ డెలివరీలను గడువులోపు అప్పగించాలి 

- Advertisement -

అదనపు కలెక్టర్ రెవెన్యూ ఎన్. ఖీమ్యా నాయక్
నవతెలంగాణ – వనపర్తి

రబీ సీజన్ 2024-25 ధాన్యం సేకరణ – కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) డెలివరీలను నిర్ణీత గడువులో ఎఫ్.సి.ఐ కి అప్పగించాలని అదనపు కలెక్టర్ రెవెన్యూ ఎన్. ఖీమ్యా నాయక్ మిల్లర్లను ఆదేశించారు. శుక్రవారం వనపర్తి జిల్లాలోని చిట్యాల గ్రామ పరిధిలోని లక్ష్మీ నరసింహ ఇండస్ట్రీస్, సురక్ష రైస్ మిల్లును అదనపు కలెక్టర్ తనిఖీ చేశారు. రబీ 2024-25 సీజన్‌కు సంబంధించిన సీఎంఆర్ (కస్టమ్ మిల్లింగ్ రైస్) డెలివరీలను వేగవంతం చేయాలని ఆయన మిల్లర్లకు సూచించారు. వరి ధాన్యం సేకరణ ప్రక్రియలో మిల్లింగ్, సీఎంఆర్ డెలివరీ అనేది ఒక కీలకమైన దశ అని అదనపు కలెక్టర్ పేర్కొన్నారు.

రైతుల నుండి సేకరించిన ధాన్యాన్ని సకాలంలో మిల్లింగ్ చేసి, ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా బియ్యాన్ని ఎఫ్.సి.ఐ. గోదాములకు తరలించాలని ఆయన ఆదేశించారు. ఈ ప్రక్రియలో జాప్యం జరిగితే ప్రభుత్వానికి ఆర్థికంగా నష్టం వాటిల్లుతుందని హెచ్చరించారు. సకాలంలో సీఎంఆర్ డెలివరీ చేయడంలో ఎదురవుతున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అవసరమైన సహాయ సహకారాలను అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, అయితే మిల్లర్లు కూడా తమవంతు కృషి చేయాలని కోరారు. ఈ సందర్భంగా, ధాన్యం నిల్వలు, మిల్లింగ్ సామర్థ్యం, ఇప్పటివరకు డెలివరీ చేసిన బియ్యం వివరాలను ఆయన పరిశీలించారు. 

జిల్లా పౌర సరఫరాల సంస్థ డిప్యూటీ మేనేజర్ జగన్ మోహన్, జిల్లా పౌర సరఫరాల అధికారి కాశీ విశ్వనాథ్ ల పనితీరు మెరుగుపడాలని సూచించారు. ధాన్యం సేకరణ, సీఎంఆర్ డెలివరీ ప్రక్రియను పర్యవేక్షించడంలో వారి పాత్ర ప్రాముఖ్యతను అదనపు కలెక్టర్ వివరించారు. సివిల్ సప్లై అధికారులు సీఎంఆర్ డెలివరీలలో పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని, జాప్యం లేకుండా చూడాలని ఆదేశించారు. పౌర సరఫరాల శాఖ, రైస్ మిల్లర్ల మధ్య సమన్వయం చాలా అవసరమని, దీనివల్ల సీఎంఆర్ లక్ష్యాలను సకాలంలో చేరుకోవచ్చని అదనపు కలెక్టర్ స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి తనిఖీలు కొనసాగుతాయని, నిబంధనలను ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఈ తనిఖీ కార్యక్రమంలో జిల్లా పౌర సరఫరాల సంస్థ డిప్యూటీ మేనేజర్ జగన్ మోహన్, జిల్లా పౌర సరఫరాల అధికారి కాశీ విశ్వనాథ్ సైతం పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -