24 గంటల్లో చర్యలు
ఇండ్లు ఇవ్వకుండానే చెల్లింపులు చేసిన నలుగురు అధికారుల సస్పెన్షన్
పాత బాకీ కింద జమ చేసే బ్యాంకులపై చర్యలు : రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ఇందిరమ్మ ఇండ్ల కోసం లంచమడిగితే టోల్ ఫ్రీ నెంబర్ 18005995991కు కాల్ చేసి వివరాలను తెలియజేస్తే 24 గంటల్లో చర్యలు తీసుకుంటామని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ పొంగులేటి శ్రీనివాసరెడ్డి భరోసా ఇచ్చారు. పేదవాడి సొంతింటి కలను నెరవేర్చే సంకల్పంతో సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇండ్ల మంజూరు, చెల్లింపుల విషయంలో అవినీతికి పాల్పడితే ఉపేక్షించబో మని హెచ్చరించారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారుల సమస్యలు, సందేహాల కోసం ప్రారంభించిన కాల్ సెంటర్‌కు వచ్చిన ఫిర్యాదులపై శుక్రవారం హైదరాబాద్‌లోని డాక్టర్ బీఆర్. అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలోని మంత్రి సమీక్షించారు. హౌసింగ్ కార్పొరేషన్ ఎమ్‌డీ వీపీ గౌతమ్, సెంటర్ ఫర్ గుడ్ గవర్నెస్ (సీజీజీ) ఎడిజీ సంగ్రామ్ సింగ్ పాటిల్‌తో కలిసి మంత్రి సుదీర్ఘంగా సమీక్షించారు. ఏయే అంశాలపై కాల్ సెంటర్‌కు ఫిర్యాదులు వస్తున్నాయంటూ మంత్రి ఆరా తీశారు. ఇందిరమ్మ ఇండ్ల మంజూరుకు లబ్దిదారుల నుంచి లంచమడిగే ఇందిరమ్మ కమిటీ సభ్యులను తక్షణం కమిటీ నుంచి తొలగించి క్రిమినల్ కేసు నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు.
దీనికి సంబంధించి సూర్యాపేట జిల్లా మధిరాల మండలం పోలుమల్ల గ్రామంలో కొండ లింగయ్య అనే వ్యక్తికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు కోసం పదివేలు డిమాండ్ చేసిన ఇందిరమ్మ కమిటీ సభ్యులు సత్తెయ్యను, జనగాం జిల్లా దేవరుప్పల మండలం పడమటి తండాలో శివమ్మ అనే లబ్దిదారు నుంచి రూ.30వేలు ఇవ్వాలని గ్రామ పంచాయితీ సెక్రటరీ డిమాండ్ చేశారంటూ ఈ సందర్భంగా పేర్కొన్నారు. వీటిపై పూర్తిస్ధాయి విచారణ జరిపి 24 గంటల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఖమ్మం, జగిత్యాల, కొత్తగూడెం, ఆదిలాబాద్ జిల్లాల్లో ఇండ్లు మంజూరు కాని ఆ నలుగురికి వారి ఖాతాలో నిధులు జమ చేసిన గ్రామ పంచాయితీ సెక్రటరీలను తక్షణమే సస్పెండ్ చేయాలని ఆదేశించారు. ఇంటి నిర్మాణ దశలను బట్టి ప్రతి సోమవారం నిధులను విడుదల చేస్తున్నామని తెలిపారు. అయితే కొన్ని బ్యాంకులు ఈ నిధులను లబ్దిదారుల ఖాతాలో జమచేసి పాత బకాయిల కింద జమ చేసుకుంటున్నాయని చెప్పారు.
అలాంటి బ్యాంకులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీనిపై రాష్ట్రస్దాయి బ్యాంకర్ల కమిటీకి లేఖ రాయాలని సూచించారు. ఆధార్ నెంబర్ ఆధారంగా చెల్లింపుల్లో ఎదురవుతున్న సమస్యలను ఈనెల 25వ తేదీలోగా పరిష్కరించి దసరా పండగలోపు చెల్లింపులను పూర్తి చేయాలని ఆదేశించారు. ఏఈలు కూడా ప్రతి గ్రామంలో లబ్దిదారుని వద్దకు వెళ్లి ఆధార్, బ్యాంకు వివరాలను పరిశీలించాలని సూచించారు. లబ్దిదారులు ఆధార్‌నెంబర్‌తో బ్యాంకు ఖాతాను అనుసంధానం చేసుకోవాలని కోరారు. ఆధార్ నెంబర్‌గానీ, పేరుగానీ తప్పుగా ఉంటే గ్రామ కార్యదర్శి, ఎంపీడీవో దృష్టికి తీసుకువెళ్లి సరి చేసుకోవాలన్నారు. త్వరలో లబ్దిదారుడే స్వయంగా ఈ దిద్దుబాటు చేసుకొనేలా యాప్‌ను తయారు చేశామనీ, ఒకటి రెండు రోజుల్లో యాప్ అందుబాటులోకి వస్తుందన్నారు. కాల్ సెంటర్‌కు వచ్చిన ఫిర్యాదులను తక్షణమే ఆయా జిల్లా కలెక్టర్, ఎస్పీకి పంపడంతోపాటు సచివాలయంలోని తన కార్యాలయానికి కూడా పంపించాలని అధికారులకు సూచించారు. ఇటువంటి ఫిర్యాదులపై తమ కార్యాలయం కూడా మానిటరింగ్ చేస్తుందని మంత్రి వివరించారు.