ఇది చారిత్రాత్మక ముందడుగు : మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మైనార్టీల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం మరో చారిత్రాత్మక అడుగు వేసింది. శుక్రవారం హైదరాబాద్‌లోని సచివాలయంలో రెండు కొత్త పథకాలను సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రారంభించారు. ”ఇందిరమ్మ మైనారిటీ మహిళా యోజన”, ”రేవంతన్నా కా సహారా – మిస్కీన్‌ల కోసం” పేరుతో ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియకు సంబంధించిన పోర్టల్‌ను ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. ఈ రెండు పథకాలను ముస్లిం మైనార్టీలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ”ఆ పథకాలు మైనార్టీల జీవన ప్రమాణాలు మెరుగుపరుస్తాయి. పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పిస్తాయి” అని చెప్పారు. ”వితంతువులు, విడాకులు పొందినవారు, అనాధలు, అవివాహిత మహిళలు చిన్న వ్యాపారాలు మొదలుపెట్టి స్వయం ఉపాధి పొందేలా ఇందిరమ్మ యోజన తోడ్పడుతుంది” అని తెలిపారు. ఫఖీర్, దుదేకుల వర్గాలకు మోపెడ్ వాహనాలు ఇవ్వడం వల్ల వారిని ఆర్థికంగా బలోపేతం చేస్తుందని చెప్పారు. ఈ పథకాలకు రూ.30 కోట్లు కేటాయించడం మైనారిటీల పట్ల ప్రభుత్వ అంకితభావానికి నిదర్శనమని వివరించారు.
మైనారిటీల అభివృద్ధి అంటే కేవలం సబ్సిడీలు కాదనీ, వారి స్వయం ఉపాధికి దారి చూపడం ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఇందిరమ్మ మైనారిటీ మహిళా యోజన వితంతువులు, విడాకులు పొందినవారు, అనాధలు, అవివాహిత మహిళలకు రూ.50వేలు సాయమందించటం లక్ష్యంగా ఈ పథకాన్ని ప్రారంభించినట్టు తెలిపారు. రేవంతన్నా కా సహారా – మిస్కీన్‌ల కోసం ఫఖీర్, దుదేకుల వర్గాలకు మోపెడ్ వాహనాలు, ఒక్కొక్కరికి రూ.ఒక లక్ష గ్రాంట్‌గా ఇవ్వనున్నారు. నేటి(19.9.2025) నుంచి 6.10.25 వరకు రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చని తెలిపారు. దరఖాస్తు చేసుకోవాలనీ, ఆఫ్‌లైన్ దరఖాస్తులు పరిగణలోకి తీసుకోబోరని స్పష్టం చేశారు. కార్యక్రమంలో మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మెన్ ఒబెదుల్లా కొత్వాల్, వక్ఫ్ బోర్డు చైర్మెన్ సయ్యద్ అజ్మతుల్లా హుస్సేనీ, గ్రంథాలయాల చైర్మెన్ డాక్టర్ రియాజ్, కో-ఆపరేటివ్ యూనియన్ చైర్మెన్ మోహన్ రెడ్డి, ఎం.డి కాంతి వెస్లీ , షఫియుల్లా, ఏజీఎం కె. పెర్సిస్, రీజినల్ అధికారి ప్రవీణ్ కులకర్ణి తదితరులు పాల్గొన్నారు.