నవతెలంగాణ-హైదరాబాద్ : భారత ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ ఏపీ పర్యటనకు విచ్చేశారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా ఆయన బుధవారం విజయవాడలోని గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఆయనకు ఘనంగా స్వాగతం పలికింది. ఉపరాష్ట్రపతికి రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు పుష్పగుచ్ఛం అందించి సాదరంగా ఆహ్వానించారు.
విమానాశ్రయంలో ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్‌కు స్వాగతం పలికిన వారిలో రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ కూడా ఉన్నారు. అనంతరం ఉపరాష్ట్రపతి పోలీసుల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ స్వాగత కార్యక్రమంలో పలువురు రాష్ట్ర మంత్రులు, పార్లమెంటు సభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
తన పర్యటనలో భాగంగా ఉపరాష్ట్రపతి పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ముందుగా ఆయన విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గ అమ్మవారిని దర్శించుకోనున్నారు. ఆ తర్వాత పున్నమిఘాట్ వద్ద జరగనున్న ‘విజయవాడ ఉత్సవ్’ వేడుకలకు ఆయన హాజరవుతారు.