నవతెలంగాణ-హైదరాబాద్: తాజా రేట్ల కోతలతో రాష్ట్రాలకు కలిగే ఆదాయ నష్టాన్ని భర్తీ చేసే పరిహారంపై జిఎస్‌టి కౌన్సిల్ చర్చ కూడా చేపట్టలేదని తెలంగాణ, కేరళ ఆర్థిక మంత్రులు పేర్కొన్నారు. కేంద్రంపై రాష్ట్రాలు ఆధారపడటాన్ని జిఎస్‌టి గణనీయంగా పెంచిందని, అభివృద్ధి ఖర్చుల కోసం సొంతంగా నిధులు సేకరించే రాష్ట్రాల సామర్థ్యాన్ని దెబ్బతీసిందని అన్నారు. శుక్రవారం న్యూఢిల్లీలో జరిగిన ‘హిందూ మైండ్’ కార్యక్రమంలో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి, ఆర్థికమంత్రి భట్టి విక్రమార్క, కేరళ ఆర్థిక మంత్రి కె.ఎన్. బాలగోపాల్‌లు పాల్గన్నారు. ప్రస్తుత కేంద్ర-రాష్ట్ర ఆర్థిక విధానాలతో రాష్ట్రాలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి మాట్లాడారు.
కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు 14శాతం పన్ను వస్తుందని హామీ ఇచ్చిందని, జిఎస్‌టికి ముందు ఇది సుమారు 14శాతం-18శాతం ఉండేదని భట్టి విక్రమార్క అన్నారు. కానీ గడువు ముగిసే సమయానికి, 18శాతం కాదు కాదా .. ఈ ఐదేళ్లలో పన్ను ఆదాయంలో 14శాతం వృద్ధి కూడా రాలేదని అన్నారు. వృద్ధి సుమారు 7-8శాతం ఉంటుందని అన్నారు. ఖర్చులో అధికభాగం రాష్ట్రాలు భరిస్తుండగా, కేంద్రానికి అధిక ఆదాయం వెళుతోందని అన్నారు.
సెస్ వినియోగం
పదిహేనవ ఆర్థిక సంఘం నివేదిక ప్రకారం.. మొత్తం ప్రభుత్వ మొత్తం వ్యయంలో సుమారు 64శాతం రాష్ట్ర ప్రభుత్వాలే భరిస్తున్నాయని బాలగోపాల్ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ప్రభుత్వ మొత్తం ఆదాయంలో సుమారు 63-64శాతం కేంద్రానికి వస్తోందని వారు చెబుతున్నారు. ఖర్చులో మూడింట రెండు వంతులు రాష్ట్రాలు భరిస్తాయి. కానీ ఆదాయంలో మూడింట రెండు వంతులు కేంద్రానికి వెళ్తాయని అన్నారు. కేంద్రం సెస్‌లను వినియోగించడంతో ఈ నిర్మాణం మొత్తం అసమతుల్యమైందని ఇరువురు ఆర్థికమంత్రులు పేర్కొన్నారు. పదిహేనవ ఆర్థిక సంఘం కేంద్రం తన ఆదాయంలో 41శాతం రాష్ట్రాలతో పంచుకోవాలని సిఫారసు చేసినప్పటికీ, దాని ఆదాయంలో సుమారు 20శాతం పంచుకోవాల్సిన అవసరం లేదని సెస్సుల ద్వారా వారు చెప్పారని అన్నారు. ఫలితంగా కేంద్ర పన్నుల్లో సుమారు 30-32 శాతం వాస్తవానికి రాష్ట్రాలతో పంచుకుంటున్నాయని అన్నారు.
కేంద్రం ప్రతిపాదించిన తాజా రేటు కోతల కారణంగా ఆదాయాలపై గణనీయమైన ప్రభావం పడుతుందని అంచనా వేస్తూ.. కేరళ, తెలంగాణ సహా 8రాష్ట్రాలు ఈ నెల ప్రారంభంలో జరిగిన జిఎస్‌టి కౌన్సిల్ సమావేశానికి ముందు ఢిల్లీలో సమావేశమై, పరిహారం కోసం కౌన్సిల్‌ను అడగాలని నిర్ణయించాయి.
వాస్తవానికి అజెండాలో పరిహారం ప్రశ్న కూడా ఉందని బాలగోపాల్ అన్నారు. కానీ ఆ అజెండాపై చర్చ జరపలేదని అన్నారు. మేము మా ప్రసంగాలు చేశాము. మా నోట్ ఇచ్చాము. కానీ వారు పరిహారంపై చర్చ చేపట్టలేదని అన్నారు. ఈ అంశాలన్నీ కేంద్రంపై రాష్ట్రాలు ఆధారపడటాన్ని పెంచాయని భట్టి పేర్కొన్నారు. మొత్తం వసూళ్లు కేంద్రానికి వస్తున్నాయని, కేంద్రం నుండి అవి రాష్ట్రాలకు మళ్లుతున్నాయని అన్నారు. దీంతో జిఎస్‌టి వ్యవస్థను పరిశీలించాలన్న పునరాలోచన అవసరమని స్పష్టం చేశారు.
సాధారణంగా ఏదైనా హేతుబద్ధీకరణ ప్రణాళికలపై వివరణాత్మక నివేదికలను స్వీకరించే జిఎస్‌టి రేటు హేతుబద్ధీకరణ కమిటీ తాజా నిర్ణయాలకు ముందు ఒక్కటి కూడా స్వీకరించలేదని బాలగోపాల్ అన్నారు. తాను గత 3-4 సంవత్సరాలుగా జిఎస్‌టి రేటు హేతుబద్ధీకరణ కమిటీలో ఉన్నానని, సమావేశం సమయంలో వివరణాత్మక అధ్యయన నివేదికలు వచ్చేవని, కానీ ఈ సారి ఎటువంటి నివేదికల రాలేదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం సూచన మాత్రమే అయినందున వివరణాత్మక విశ్లేషణలు రాలేదని అన్నారు. నష్టం ఎంత అనేది స్పష్టంగా తెలియలేదని బాలగోపాల్ అన్నారు. కేరళకు సంబంధించి రూ. 8,000-10,000 కోట్ల ఆదాయ న ష్టం జరుగుతోందని తాము లెక్కించామని అన్నారు. ప్రతి రాష్ట్రాలకు వాటి సొంత లెక్కలు ఉంటాయని, అఖిల భారత్ అనే అంశం అక్కడ లేదని అన్నారు.